పోస్టల్‌ బ్యాలెట్‌పై పట్టింపేది? 

20 Nov, 2018 01:50 IST|Sakshi

ఎన్నికల విధుల్లోని ఉద్యోగులు, సిబ్బంది ఓట్లపై శీతకన్ను

ఇప్పటివరకు 30శాతం దాటని ‘పోస్టల్‌’ ఓటింగ్‌

పోస్టల్‌ బ్యాలెట్‌ విధానంపై ప్రభుత్వ ఉద్యోగుల్లో అనాసక్తి

విధానంలోని లోపాలు.. అవగాహనారాహిత్యమే కారణాలు

పోస్టల్‌ ఓటింగ్‌లో ముందున్న టీచర్లు.. వెనకబడిన పోలీసులు

ఇప్పటికైనా అవగాహన కార్య క్రమాలు చేపట్టాలంటూ విజ్ఞప్తులు  

సాక్షి, హైదరాబాద్‌: ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రచారం చేస్తోన్న ఎన్నికల కమిషన్‌.. ఎన్నికల విధుల్లో ఉండే ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది ఓట్లపై మాత్రం దృష్టి సారించడం లేదు. వీరికోసం పోస్టల్‌ బ్యాలెట్‌ విధానం అమలులో ఉన్నా అందులోని లోటు పాట్ల కారణంగా చాలా మంది వినియోగించుకోలేకపోతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్ని ఎన్నికల్లో కేవలం 30 శాతం లోపే ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నట్టు ఎన్నికల కమిషన్‌ నివేదికల ద్వారా వెల్లడైంది. ఓటు హక్కును తప్పనిసరిగా ఉపయోగించుకునేలా ఏర్పాట్లు చేస్తే తప్పకుండా తాము ఉపయోగించుకుంటామని, ఆ విధానంలో సమస్యల కారణంగానే పోస్టల్‌ బ్యాలెట్‌పై నమ్మకం పోయిందని ప్రభుత్వ ఉద్యోగులు వాపోతున్నారు. ఇటు మరికొందరు ఉద్యోగులు పోస్టల్‌ విధానంపై అవగాహన లేకపోవడంతో ఓటేయలేకపోతున్నారు. 

పోస్టల్‌ బ్యాలెట్‌ దరఖాస్తు ఎలా... 
ఎన్నికల విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగి ఓటు వేసేందుకు ముందుగా ఎన్నికల కమిషన్‌ ఫారం నంబర్‌–12ను పూర్తి చేసి అవసరమైన పత్రాలను జతచేసి జిల్లా ఎన్నికల అధికారి లేదా సంబంధిత అసెంబ్లీ సెగ్మెంట్‌ రిటర్నింగ్‌ అధికారి లేదా తన విభాగాధిపతికి పంపించాలి. ఈ ఫారం నంబర్‌లో పేర్కొన్న ఉద్యోగి తన ఓటుకు సంబంధించిన వివరాలు.. ఓటర్‌ ఐడెంటిటీ నంబర్, అడ్రస్, ఫొటో, ఉద్యోగ గుర్తింపు కార్డు ఎన్నికల అధికారి పరిశీలిస్తారు. అన్ని సక్రమంగా ఉంటే పోస్టల్‌ బ్యాలెట్‌ను పోస్ట్‌ ద్వారా ఫారంలో పేర్కొన్న ఇంటి అడ్రస్‌కు పంపిస్తారు. సదరు ప్రభుత్వ ఉద్యోగి తనకు వచ్చిన పోస్టల్‌ బ్యాలెట్‌లో తన ఓటుకు వినియోగించుకుని తిరిగి మళ్లీ రిటర్నింగ్‌ అధికారికి పోస్టు ద్వారానే పంపించాల్సి ఉంటుంది. 

జాప్యమా.. విధాన లోపామా.. 
పోస్టల్‌ బ్యాలెట్‌ విధానంలోని లోపాల వల్లే ప్రభుత్వ ఉద్యోగులు ఓటు వేసేందుకు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ఎన్నికలకు వారం రోజుల ముందు ఈ విధానం పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే ఇందులో ఫారం నంబర్‌–12 పూర్తి చేసి పంపించినా పోస్టల్‌ బ్యాలెట్‌ తమ చేతికి రాలేదని కొంతమంది.. తాము పంపిన పోస్టల్‌ బ్యాలెట్‌ చేరిందో లేదో కూడా తెలియదని మరికొంత మంది చెబుతున్నారు. ఇలా పోస్టల్‌ ద్వారా కాకుండా తాము ఎన్నికల విధులు నిర్వర్తించే రోజే తమ రిపోర్టింగ్‌ అధికారి కార్యాలయంలోనే పోస్టల్‌ బ్యాలెట్‌ ఏర్పాటు చేస్తే బాగుంటుందని ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. దీంతో సమయం ఆదా కావడంతో పాటు పోస్టల్‌ బ్యాలెట్‌ చేరడం కూడా తేలికవుతుందంటున్నాయి. 

టీచర్లే అధికం.. 
పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకునే వారిలో అధిక శాతం మంది ప్రభుత్వ ఉపాధ్యాయులే ఉంటున్నారు. దాదాపు 70 శాతం మంది టీచర్లు ఈ విధానం ద్వారా ఓట్లు వేస్తున్నట్లు ఈసీ నివేదికల్లో వెల్లడైంది. అయితే వీరు పూర్తి స్థాయిలో ఎన్నికల విధుల్లో ముందస్తుగానే ఉంటుండటంతో ఫారం–12, తదితరాలన్ని పూర్తి చేసి ఎన్నికల అధికారికి చేరవేయడంలో సక్సెస్‌ అవుతున్నారు. ఇటు పోలీస్‌శాఖలో మాత్రం పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకుంటోంది కేవలం 12 శాతం మంది మాత్రమే. ప్రస్తుతం రాష్ట్ర పోలీస్‌ శాఖలో హోంగార్డులతో కలిపి మొత్తం 66 వేల మంది పోలీస్‌ సిబ్బంది పనిచేస్తున్నారు. వీరంతా అసెంబ్లీ ఎన్నికల్లో బందోబస్తులో విధులు నిర్వర్తించనున్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌పై అవగాహన కల్పిస్తే వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నామని.. ఈ దిశగా చర్యలు చేపట్టాలని సిబ్బంది ఉన్నతాధికారులను కోరుతున్నారు.  

2014లో 30%
రాష్ట్ర విభజన జరిగినా 2014 ఎన్నికలు ఉమ్మడి రాష్ట్రంలోనే జరిగాయి. అయితే ఈ ఎన్నికల్లో కేవలం 30 శాతం మంది ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారని ఈసీ నివేదికలో స్పష్టమైంది. అంతకుముందు 2009 సాధారణ ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా కేవలం 26 శాతం మంది ఉద్యోగులు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

>
మరిన్ని వార్తలు