గెస్ట్‌ లెక్చరర్ల నియామకాలపై రగడ!

31 Jul, 2018 01:22 IST|Sakshi

కొత్త వారిని నియమించేందుకు ఇంటర్‌ బోర్డు నోటిఫికేషన్లు

పాతవారిని రెన్యువల్‌ చేయకపోవడంపై ‘ఇంటర్‌ జేఏసీ’ ఆందోళన

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో దాదాపు 1,200 మంది గెస్ట్‌ లెక్చరర్ల నియామకాలను పారదర్శకంగా మెరిట్‌కు ప్రాధాన్యం ఇచ్చేలా చేపడుతున్నామని ఇంటర్మీడియట్‌ విద్యా కమిషనర్‌ అశోక్‌ చెప్పారు. అయితే ఒక సంఘం నేతలు ఉద్దేశపూర్వకంగా అడ్డుపడుతున్నారని ఆరోíపించారు. ఇంటర్మీడియట్‌ విద్యా కమిషనరేట్‌లో సోమవారం ఆయన మాట్లాడారు.

గెస్ట్‌ లెక్చరర్లను రెన్యువల్‌ చేయడం కుదరదన్న విషయంలో ఓ సంఘం నేతలు అపార్థం చేసుకుంటున్నారని, పాత వారిని అలాగే కొనసాగించాలని పట్టు పడుతున్నారని విమర్శించారు. కొత్త వారి నియామకాలకు నోటిఫికేషన్లు ఇవ్వవద్దని ప్రిన్సిపాళ్లకు ఒక సంఘం సమాచారం పంపించిందని ఆరోపించారు. పాత వారిని రెన్యువల్‌ చేయాల్సిందేనంటూ ఇంటర్‌ విద్యా జేఏసీ చైర్మన్‌ పి.మధుసూదన్‌రెడ్డి ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు.

గెస్ట్‌ ఫ్యాకల్టీకి హక్కులు ఉండవన్న విషయాన్ని గుర్తించడం లేదన్నారు. గతంలో గౌరవ వేతనం తీసుకున్న వారికి, అనుభవం కలిగిన వారికి ఆయా సర్టిఫికెట్లను జారీ చేయాలని ప్రిన్సిపాళ్లకు ఆదేశాలు ఇస్తామని వెల్లడించారు. దీంతో ఇదివరకు గెస్ట్‌ లెక్చరర్లుగా పని చేసిన వారికి ఉపయోగపడుతుందన్నారు. ఇప్పటివరకు 205 కాలేజీల్లో నోటిఫికేషన్లు జారీ చేశామని, మరో 142 కాలేజీలు నోటిఫికేషన్లు జారీ చేయాల్సి ఉందన్నారు.

ఇప్పుడు వద్దంటే ఎలా?: ఇంటర్‌ విద్యా జేఏసీ
1,200 మంది గెస్ట్‌ లెక్చరర్లు జూన్, జూలైల్లో పనిచేశారని ఇంటర్‌ విద్యా జేఏసీ చైర్మన్‌ పి.మధుసూదన్‌రెడ్డి తెలిపారు. ఎన్‌రోల్‌మెంట్‌ డ్రైవ్‌లోనూ పాల్గొన్నారని, ఇప్పుడు వారిని అకస్మాత్తుగా రోడ్డు న పడేస్తే ఎలాగని ప్రశ్నించారు. 2016–17లో పనిచేసిన వారందరిని 2017–18లో తీసుకున్నారని, ఇప్పుడు వారిని పక్కకు పెట్టడంలో ఆంతర్యమేమిటన్నారు. ప్రిన్సిపాళ్లకు బాధ్యతలు అప్పగించ డం వల్ల స్థానికంగా ఒత్తిళ్లు వస్తున్నాయని, వారు పనిచేసే పరిస్థితి లేదని వెల్లడించారు.

‘సరైన షెడ్యూల్‌ లేకుండా ఎలా?’
ఉన్నతాధికారులు తమను బలి పశువులను చేస్తున్నారని జూనియర్‌ కాలేజీల ప్రిన్సిపాళ్ల సంఘం అధ్యక్షుడు కృష్ణకుమార్‌ అన్నారు. ఏ తేదీన నోటిఫికేషన్‌ జారీ చేయాలి.. ఎన్ని రోజులు దరఖాస్తులు స్వీకరించాలి.. డెమో, ఇంటర్వ్యూలు ఎప్పుడు నిర్వహించాలన్న వివరాలతో కూడిన షెడ్యూల్‌ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ప్రాధాన్యాల విషయంలోనూ స్పష్టత లేదన్నారు.

మరిన్ని వార్తలు