తప్పులు చేస్తే జైళ్లకే..

16 Dec, 2015 01:40 IST|Sakshi
తప్పులు చేస్తే జైళ్లకే..

-  షాదీ ముబారక్, పింఛన్లు పక్కదారి పట్టొద్దు
 - విద్యార్ధుల ఆధార్, బ్యాంకు  ఖాతాలపై నిర్లక్ష్యం తగదు  
 - ఇన్ చార్జి డీపీఓ రమాదేవి
 ఇబ్రహీంపట్నం:
అధికారులు తప్పులు చేసి జైళ్లకు వెళ్లాల్సిన పరిస్థితి తెచ్చుకోవద్దని ఇన్‌చార్జి డీపీఓ రమాదేవి హెచ్చరించారు. మంగళవారం ఆమె ఇబ్రహీంపట్నంలో అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డీపీఓ మాట్లాడుతూ.. పేదలకు రెండో పెళ్లికి షాదీ ముబారక్ పథకం, ఉద్యోగుల తల్లిదండ్రులకు వృద్ధాప్య పింఛన్లు వర్తించని స్పష్టం చేశారు. జిల్లాలోని పలు పలుచోట్ల ఇలాంటి తప్పులు బయటపడుతున్నట్లు ఆమె వెల్లడించారు. సంబంధిత వారినుంచి డబ్బులు రికవరీ చేస్తున్నట్లు వివరించారు.
 
 ఒకటికి రెండుసార్లు విచారణ జరిపి నిజమైన లబ్ధిదారులకు గుర్తించాలని.. తప్పులు చేస్తే శిక్ష తప్పదని అధికారులను హెచ్చరించారు. ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్పుల కోసం ఎంతమంది విద్యార్ధులు దరఖాస్తు చేసుకున్నారని డీపీఓ మండల విద్యాధికారి వెంకట్‌రెడ్డిని ప్రశ్నించగా సరైన సమాధానం అయన చెప్పకపోవడంతో రమాదేవి అసహనానికి గురయ్యారు. విద్యార్ధుల ఆధార్ నంబర్ల సేకరణ, స్కాలర్‌షిప్స్, బ్యాంకు ఖాతాల వివరాల సేకరణలో విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. అవసరమైతే ఉన్నతాధికారుల సలహాలు తీసుకోవాలన్నారు.
 
  ప్రీమెట్రిక్ స్కాలర్‌షిప్పు తక్కువ కావడంతో విద్యార్ధుల తల్లిదండ్రులు కులం, ఆదాయం, నివాస పత్రాలు తీసుకోవడం లేదని విద్యాధికారి వెంకట్‌రెడ్డి తెలిపారు. భవిష్యత్తులో ఈ విధానం ఎంతో ఉపయోగపడుతుందని, స్కాలర్‌షిప్స్ పెరుగుతాయని విద్యార్థుల తల్లిదండ్రులను చైతన్యం చేయాలని రమాదేవి సూచించారు. రెండు వారాల క్రితం సమావేశమైనప్పుడు చెప్పిన సమాధానాలే అధికారుల నుంచి వస్తున్నాయని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
  హరితహారం కింద చెట్లు నాటాం.. ఇంకేం పని అని అనుకోవద్దు.. మళ్లీ వర్షకాలం వస్తుంది.. తిరిగి సదరు పథకం కింద మొక్కలు నాటాల్సి ఉందన్నారు. మండలంలో 2.09 లక్షల మొక్కలు నాటగా అందులో 52 శాతం వర్షాభావంతో ఎండిపోతున్నట్లు ఉపాధి హామీ ఏపీఓ లలిత తెలిపారు. వీలైనన్ని ఎక్కువ మొక్కలను బతికించుకునేందుకు అధికారులు కృషిచేయాలన్నారు. ఆయా అంశాల ప్రగతిపై జిల్లా కలెక్టర్ ఎప్పుడైనా ప్రశ్నించవచ్చని, ఆధికారులు అప్రమత్తంగా ఉండాలని ఇన్‌చార్జి డీపీఓ అధికారులను హెచ్చరించారు. సమావేశంలో తహసీల్దార్ విజయేందర్‌రెడ్డి, ఇన్‌చార్జి ఎంపీడీఓ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు