ఎనీ టైం మోసం..

15 Mar, 2015 00:40 IST|Sakshi

బజార్‌హత్నూర్ మండలం గిర్నూర్ గ్రామానికి చెందిన శనిగారపు నర్సయ్య అవసరానికి డబ్బులు తీసుకునేందుకు గత సెప్టెంబర్‌లో ఇచ్చోడలోని ఓ ఏటీఎం సెంటర్‌కు వెళ్లాడు. అతని వెంట ఓ ఇద్దరు వ్యక్తులు ఏటీఎంలోకి వెళ్లి మాటల్లో పెట్టారు. అతని వద్ద నుంచి ఏటీఎం కార్డు దొంగిలించారు. అనంతరం అతని ఖాతా నుంచి రూ.25 వేలు కాజేశారు. జిల్లాలోని ఏటీఎం సెంటర్లలో జరుగుతున్న మోసాలకు ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇలా ఎంతో మంది బాధితులు మోసపోతున్నారు. లక్షల రూపాయలు పోగొట్టుకుంటున్నారు.
 
- ఏటీఎం సెంటర్లలో కనిపించని సెక్యూరిటీ గార్డులు
- పనిచేయని సీసీ కెమెరాలు
- మోసాలకు పాల్పడుతున్న దుండగులు
- పట్టించుకోని బ్యాంక్ సిబ్బంది
 
ఆదిలాబాద్ క్రైం : జిల్లాలో ఏటీఎం సెంట ర్ల నిర్వహణ అత్యంత దారుణంగా తయారైంది. ఎక్కడా సెక్యురిటీ గార్డులు ఉండ డం లేదు. వాటి నిర్వహణను గాలికొదిలేశారు. ఇదే అదునుగా భావించి మోసకారు లు రెచ్చిపోతున్నారు. మాయమాటలతోఅమాయకులను బుట్టలో వేసుకుని ఏటీఎం కార్డులను మా ర్చేసి.. వేల రూపాయలు దండుకుంటున్నారు. ఇలా ఆర్థిక నేరాలు రోజురోజకు శృతి మించుతున్నా బ్యాంకు యాజమాన్యాలు మాత్రం తమకు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వినియోగదారులకు మెరుగైన సేవలందించాలనే ఉద్దేశంతో బ్యాంకులు పోటాపోటీగా ఏటీఎం సెంటర్లు ఏర్పాటు చేస్తున్నా.. రక్షణ చర్యలు మాత్రం విస్మరిస్తున్నాయి. నిత్యం లక్షలాది రూపాయలు డ్రా చేసే ఈ కేంద్రాల వద్ద కనీసం సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేయకపోవడంతో వినియోగదారులు భయూందోళనకు గురవుతున్నారు. జిల్లాలో మొత్తం 200లకుపైగా ఏటీఎం కేంద్రాలున్నాయి. వీటి నుంచి వినియోగదారులు కోటి రూపాయలకు పైగా ప్రతిరోజూ నగదు డ్రా చేస్తున్నట్లు తెలుస్తోంది.
 
భద్రత గాలికి..
ఏటీఎం సెంటర్ల వద్ద భద్రత కల్పించాల్సిన బాధ్యత సంబంధిత బ్యాంకులపైనే ఉంది. జిల్లాలోని చాలా ఏటీఎంల వద్ద భద్రత గాలిలో దీపంలా ఉంది. చాలా కేంద్రాల వద్ద సెక్యూరిటీ గార్డులు కనిపించడం లేదు. పైగా ఏటీఎం కేంద్రాల లోపల సీసీ కెమెరాలు కూడా పనిచేయడం లేదు. దీనికి కారణం చాలా వరకు బ్యాంకులు ఆర్థిక భారం పడుతుందనే ఉద్దేశంతో నియమించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని బ్యాంకులు బ్యాంక్ వద్ద ఉన్న ఏటీఎం సెంటర్ వద్ద, ముఖ్యమైన పాయింట్ల వద్ద మాత్రమే సెక్యూరిటీ గార్డును నియమించుకుంటున్నాయి. ఇతర పాయింట్ల వద్ద నియమించడం లేదు. ముఖ్యంగా పట్టణ, మండల కేంద్రాల్లో ఉండే ఏటీఎంల వద్ద భద్రత ఉండడం లేదు.

ఏటీఎం సెంటర్లకు ఆటోమెటిక్‌గా మూసుకునే గ్లాస్ డోర్ ఉండాలి. జిల్లాలో ఇలాంటి ఎక్కడా కనిపించవు. ఎల్లప్పుడూ తలుపులు తెరిచే ఉంటాయి. దీంతో దుండగులు నేరుగా లోపలికి ప్రవేశించి వినియోగదారులు డబ్బులు డ్రా చేసే సమయంలో మాయమాటలు చెప్పడంతోపాటు వారి ఏటీఎం కార్డులను దొంగిలిస్తున్నారు. ఎలాగోలా పిన్‌కోడ్ తెలుసుకుని పెద్ద ఎత్తున నగదు డ్రా చేసి మోసం చేస్తున్నారు. పోలీసుస్టేషన్‌లో కేసు పెట్టినా.. మళ్లీ ఆ డబ్బులు తిరిగి వస్తాయన్న గ్యారంటీ లేదు. ఇలా కొంత మంది మోసపోయిన వారు పోలీసులను కూడా ఆశ్రయించడం లేదని తెలుస్తోంది.
 
నగదు లేకున్నా.. ఓపెన్‌గానే..
జిల్లాలో ఏటీఎం సెంటర్ల భద్రత ఒక ఎత్తయితే.. వాటి నిర్వహణ వినియోగదారులకు మరింత చికాకు కనిపిస్తున్నాయి. చాలా వరకు ఏటీఎం సెంటర్లు ఎప్పుడు చూసినా  సాంకేతిక కారణాలతో పనిచేయడం లేదని,ఏటీఎంలో నో మనీఅంటూ బోర్డులు దర్శనమిస్తాయి. ఏటీఎంలలో అవసరం మేరకు డ బ్బులు నిల్వ ఉంచడం లేదని వినియోగదారులు పేర్కొంటున్నారు. దీనివల్ల తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. ఈ పరిస్థితి నెలలో మొదటి వారం మరింత కష్టంగా ఉంటోంది. ఈ వారంలో ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగులు వేతనాలు తీసుకునేందుకు ఏటీఎంల బాట పడుతారు. ఆ సమయంలో డబ్బులు లేవని బోర్డులు దర్శనమివ్వడంతో నిరాశగా ఇంటిముఖం పట్టాల్సిన పరిస్థితి నెలకొంది.
 
భద్రత ఏర్పాటు చేసుకోవాలి..
- ఎల్.రఘు, వన్‌టౌన్ సీఐ
ఏటీఎం సెంటర్లలో బ్యాంక్‌లు కచ్చితంగా భద్రత ఏర్పాటు చేసుకోవాలి. ఇటీవల ఆదిలాబాద్‌లోని ఓ బ్యాంక్ ఏటీఎం సెంటర్ అద్దంను గుర్తు తెలియని దుండుగులు పగులగొట్టిన సంఘటన జరిగింది. గతంలో బ్యాంక్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి సెక్యూరిటీ గార్డులను నియమించుకోవాలని, భద్రతకు పాటించాల్సిన చర్యలపై సూచించాం. అరుునా పట్టించుకోవడం లేదు. అవాంఛనీయ సంఘటనలు జరిగితే బ్యాంక్ అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ప్రతి ఏటీఎంలో సెక్యురిటీ గార్డు, సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి.

మరిన్ని వార్తలు