ఆ పిటిషన్లను ఏపీకి బదిలీ చేయండి 

29 Jan, 2019 02:26 IST|Sakshi

తెలంగాణ సీజేకు ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం లేఖ 

పిల్‌గా పరిగణించిన సీజే..  

సాక్షి, హైదరాబాద్‌: ఉమ్మడి హైకోర్టు ఏర్పడే నాటికి దాఖలైన అప్పీళ్లు, కోర్టు ధిక్కార పిటిషన్లు, పునః సమీక్షా పిటిషన్లపై విచారణ జరిపే పరిధి ఉమ్మడి హైకోర్టుకు ఉందంటూ ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలోని సెక్షన్‌ 40(3) చెబుతోందని, దీని వల్ల ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయవాదులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటారని, కాబట్టి ఈ వ్యవహారంపై న్యాయపరంగా తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసింది. ఈ లేఖను పరిశీలించిన ప్రధాన న్యాయమూర్తి దానిని ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణించారు.

ఈ వ్యాజ్యంపై సోమవారం సీజే జస్టిస్‌ తొట్టతిల్‌ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ వ్యవహారంలో కొన్ని కీలక అంశాలు ముడిపడి ఉన్నందున దీనిపై విస్తృత ధర్మాసనం విచారించడం మేలన్న అభిప్రాయానికి వచ్చింది. ఈ వ్యవహారంపై విస్తృత ధర్మాసనం విచారణ జరుపుతుందంటూ సీజే ధర్మాసనం జ్యుడీషియల్‌ ఉత్తర్వు జారీ చేసింది. దీంతో ఈ విస్తృత ధర్మాసనంలో న్యాయమూర్తులు ఎవరుండాలన్న దానిపై సీజే పరిపాలనాపరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.    

>
మరిన్ని వార్తలు