కీలక భేటీ వాయిదా.. బస్సు ప్రయాణికులకు నిరాశ

23 Jun, 2020 19:29 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : అంతర్రాష్ట్ర ఒప్పందంపై చర్చలు ప్రారంభం కావడంతో ఇక వచ్చే వారం నుంచి బస్సుల్లో ప్రయాణించొచ్చని భావించిన తెలుగు రాష్ట్రాల ప్రజలకు తీవ్ర నిరాశ ఎదురైంది. బుధవారం జరగాల్సిన కీలక భేటీ వాయిదా పడింది. అనివార్య కారణాల వల్ల భేటీని వాయిదా వేస్తున్నట్లు రెండు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. కరోనా వైరస్ ప్రబలిస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ ప్రకటించిన తరువాత అంతరాష్ట్ర బస్సు సర్వీస్ లు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే సడలింపుల్లో భాగంగా బస్సులను తిప్పడానికి రెండు రాష్ట్రాలు సన్నద్ధం అయ్యాయి.

ఈ మేరకు గత వారం విజయవాడలో సమావేశమైన రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులు చర్చలు జరిపారు. మరోసారి చర్చించుకొని ఫైనల్ చేసుకోవాలని అప్పుడే అనుకున్నారు. దీనిలో భాగంగా ఈ నెల 24న ఆర్టీసీ అధికారులు హైదరాబాద్‌లో మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. కానీ అనివార్య కారణాల వల్ల ఈ సమావేశం వాయిదా పడింది. ఈ వారంలో భేటీ అయ్యేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు ఇప్పట్లో తిరిగి ప్రారంభం కావడం కష్టమేనని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు హైదరాబాద్‌లో కరోనా వైరస్‌ రోజు రోజుకి విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో అంతరాష్ట్ర బస్సులను నడపడానికి సీఎం కేసీఆర్‌ అంగీకరించపోవచ్చని భావిస్తున్నారు. 

కాగా, తెలంగాణలో జిల్లాల్లో ఇప్పటికే బస్సులు తిరుగుతున్నాయి. హైదరాబాద్‌లో కరోనా కేసులు ఎక్కువగా ఉండటంతో... సిటీలో బస్సులను, మెట్రో రైళ్లను నడిపేందుకు ప్రభుత్వం ఇంకా అనుమతి ఇవ్వలేదు. ఐతే... రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు నడిపినా సమస్యేమీ ఉండదనే అభిప్రాయం ఆర్టీసీ ఉన్నతాధికారుల నుంచి వస్తుండటంతో... సర్కారు ఆ దిశగా చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు