క్లైమాక్స్‌కువిద్యుత్‌ విభజన

5 Nov, 2019 02:21 IST|Sakshi

ఉద్యోగుల విభజనపై ఇరురాష్ట్రాలకు జస్టిస్‌ ధర్మాధికారి కమిటీ లేఖ

డిసెంబర్‌ 14, 15 తేదీల్లో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడి

ఏపీ స్థానికత కలిగిన 1,157 మందిని తెలంగాణ రిలీవ్‌ చేయడంతో వివాదం 

సాక్షి, హైదరాబాద్‌: విద్యుత్‌ ఉద్యోగుల విభజన వివాదం క్లైమాక్స్‌కు చేరుకుంది. జస్టిస్‌ ఎం.ధర్మాధికారి ఏకసభ్య కమిటీ డిసెంబర్‌ 14, 15 తేదీల్లో హైదరాబాద్‌లో సమావేశమై ఏపీ, తెలం గాణ రాష్ట్రాలకు ఉద్యోగుల కేటాయింపులకు సంబంధించిన తుది జాబితాను ఖరారు చేసి సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించనుంది. ఏపీ, తెలంగాణకు ఈ విషయాన్ని తెలుపుతూ జస్టిస్‌ ఎం.ధర్మాధి కారి కమిటీ తాజాగా లేఖ రాసింది. ఏపీ స్థానికత కలిగి ఉన్నారని 1,157 మంది ఉద్యో గులను తెలంగాణ విద్యుత్‌ సం స్థలు 2015 జూన్‌లో ఏకపక్షంగా ఏపీకి రిలీవ్‌ చేయ డంతో గత ఐదేళ్లుగా రెండు రాష్ట్రాల మధ్య ఈ వివాదం నడు స్తోంది. దీని పరిష్కారానికి రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ ధర్మాధికారి నేతృ త్వంలో సుప్రీం కోర్టు ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఉద్యో గుల విభజనకు ధర్మాధి కారి కమిటీ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఇరు రాష్ట్రాల విద్యుత్‌ సంస్థలు రిలీవైన 1,157 మందితో సహా తమ స్టేట్‌ కేడర్‌ ఉద్యోగులందరి నుంచి ఆప్షన్లు స్వీకరించగా, రిలీవైన 1,157 మందిలో 613 మంది ఏపీకి, 504 మంది తెలంగాణకు ఆప్షన్‌ ఇవ్వగా 42 మంది ఏ రాష్ట్రానికి ఆప్షన్‌ ఇవ్వలేదు. ఇక ఏపీలో పనిచేస్తున్న మరో 265 మంది తెలంగాణకు ఆప్షన్‌ ఇవ్వగా, తెలంగాణ నుంచి ఒక్కరూ ఏపీకి ఆప్షన్‌ ఇవ్వలేదు. ఉద్యో గులిచ్చిన ఆప్షన్ల ప్రకారం.. రెండు రాష్ట్రాలు ప్రాథమిక కేటాయిం పుల జాబితాలను ప్రకటించి అభ్యంతరాలు స్వీకరించాలని గత నెలలో ధర్మాధికారి కమిటీ ఆదేశించింది. ఆ మేరకు ఇప్పటికే తెలంగాణ విద్యుత్‌ సంస్థలు ప్రాథమిక కేటాయింపుల జాబితా లను ప్రకటించి అభ్యంతరాల స్వీకరణను ప్రారంభించాయి. 

అంతమందిని తీసుకోలేం..
ఇటు తమ రాష్ట్రానికి ఆప్షన్లు ఇచ్చిన 613 మందిని స్వీకరించేందుకు ఖాళీ పోస్టులు లేవని, వీరి కోసం ప్రత్యేకంగా సూపర్‌న్యూమరరీ పోస్టులు సృష్టించడం ఆర్థికపరంగా సాధ్యం కాదని ఏపీ ప్రభుత్వం ధర్మాధికారికి లేఖ ద్వారా తెలియజేసింది. అయితే, ఏపీ నుంచి 202 మంది తెలంగాణ స్థానికత గల ఉద్యోగులు ఐదేళ్ల కిందే స్వచ్ఛందంగా సొంత రాష్ట్రం తెలంగాణకు వచ్చి చేరారు. వీరు తెలంగాణకు రావడంతో ఏపీలో ఖాళీ అయిన పోస్టుల్లో 613 మంది నుంచి 202 మందిని తీసుకునేందుకు ప్రాథమిక కేటాయింపుల జాబితాను ప్రకటించి ఈ నెలాఖరులోగా అభ్యంతరాల స్వీకరణను పూర్తి చేయాలని తాజాగా ఏపీ ప్రభుత్వాన్ని కమిటీ ఆదేశించింది. డిసెంబర్‌ 14, 15వ తేదీల్లో రెండు రాష్ట్రాలతో సమావేశం నిర్వహించి తుది కేటాయింపుల జాబితాలను ప్రకటిస్తామని వెల్లడించింది. 

265 మందిలో 72 మంది మాత్రమే!
ఇక ఏపీ నుంచి తెలంగాణకు ఆప్షన్లు ఇచ్చిన 265 మందిలో కేవలం 72 మంది మాత్రమే కమిటీ మార్గదర్శకాల ప్రకారం అర్హులని తెలంగాణ విద్యుత్‌ సంస్థలు నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. గత ఐదేళ్లలో పదవీ విరమణలతో ఏపీలో వందల పోస్టులు ఖాళీ అయ్యాయని, పోస్టులు లేవని ఏపీ చేస్తున్న వాదనలో వాస్తవాలు లేవని తెలంగాణ విద్యుత్‌ సంస్థల అధికారులు పేర్కొంటున్నారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగుల జాబితాలను ధర్మాధికారి కమిటీకి అందజేసి ఏపీకి ఆప్షన్లు ఇచ్చిన ఉద్యోగులందరినీ ఆ రాష్ట్రానికే కేటాయించాలని కోరుతామని ఓ అధికారి ‘సాక్షి’కి తెలిపారు.  

మరిన్ని వార్తలు