ఏపీపై కేంద్రానికి ఫిర్యాదు!

10 May, 2017 02:55 IST|Sakshi
ఏపీపై కేంద్రానికి ఫిర్యాదు!
ఉమ్మడి భవన్‌పై పెత్తనం చెలాయిస్తోందన్న తెలంగాణ
పరిస్థితులు ఉద్రిక్తం కాకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
 
సాక్షి, న్యూఢిల్లీ:
ఢిల్లీలోని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి భవన్‌ ఆస్తులపై ఏపీ భవన్‌ అధికారులు పెత్తనం చెలాయిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఉమ్మడి భవన్‌ను ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు 58:42 నిష్పత్తిలో పంచుకోవాలని కేంద్ర హోం శాఖ సూచించినా.. అందుకు విరుద్ధంగా 64 శాతం ఆస్తుల్లో ఏపీ ప్రభుత్వం కార్యకలాపాలు నిర్వహిస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. అలాగే తెలంగాణకు కేటాయించిన.. గవర్నర్, ముఖ్యమంత్రి, హైకోర్టు సీజే, రాష్ట్ర మంత్రులు నివాసం ఉండే శబరీ బ్లాక్‌కు భద్రతా పరమైన సమస్యలు తలెత్తేలా ఏపీ వ్యవహరిస్తోందని రాష్ట్ర ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. బ్లాక్‌కు పక్కనే ఉండే ఆర్‌సీ బంగ్లాలో ఇతరులకు వసతి కల్పిస్తున్నారని, దీంతో భద్రతా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పేర్కొంది. హక్కుగా రావాల్సిన ఆర్‌సీ బంగ్లాను తమకు కేటాయించాలని ఏపీ రెసిడెంట్‌ కమిషనర్‌కు లేఖరాసినా స్పందన లేకపోవడంతో బంగ్లాకు తాళం వేసుకున్నామని, కానీ ఏపీ భవన్‌ అధికారులు దౌర్జన్యంగా తాళాలు పగలగొట్టారని లేఖలో వివరించింది. ఇలాంటి ఘటనలు రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలకు దారి తీసే ప్రమాదం ఉందని, ఈ నేపథ్యంలో ఏపీ తీరును కట్టడి చేసి తెలంగాణకు రావాల్సిన వాటా దక్కేలా చర్యలు తీసుకోవాలని లేఖలో కోరినట్లు తెలుస్తోంది. 
 
ఉమ్మడి సర్వేకు ఏపీ ’నో’..
రెండు రాష్ట్రాల ఉమ్మడి భవన్‌లో ఎవరెక్కువ వాటా వినియోగించు కుంటున్నారో ఉమ్మడిగా సర్వే చేద్దామని చేసిన ప్రతిపాదనను ఏపీ అంగీకరించడం లేదని, ఏపీ ఎక్కువ వాటాను కలిగి ఉందనడానికి ఇదే నిదర్శనమని తెలంగాణ అధికారులు పేర్కొన్నారు. గతంలో ఏపీ సీఎం చంద్రబాబుకు ఢిల్లీలో ముప్పు ఉందంటూ ఆధారాలు లేని వార్తలతో గతంలో హడావుడి సృష్టించిన ఏపీ భవన్‌ అధికారులు.. శబరి బ్లాక్‌కు భద్రతపై లేఖ రాస్తే స్పందించకపోవడం సరికాదన్నారు.
మరిన్ని వార్తలు