హ్యాపీ బర్త్‌డే కేసీఆర్‌ 

18 Feb, 2020 02:50 IST|Sakshi

జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, మోదీ, వైఎస్‌ జగన్‌
సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు 66వ జన్మదినం సందర్భంగా రాష్ట్రపతి, ప్రధానితో సహా దేశం నలుమూలల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సుఖ సంతోషాలతో, సంపూర్ణ ఆరోగ్యంతో నిండు జీవితం గడపాలని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఫోన్‌ ద్వారా సీఎం కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. చిరకాలం ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ‘జన్మదిన శుభాకాంక్షలు సీఎం కేసీఆర్‌ గారూ, ఆరోగ్యంగా, సంతోషంగా రాబోయే రోజుల్లో మరింత ప్రజా సేవ చేయాలని కోరుకుంటున్నా’అని రాష్ట్ర గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ శుభాకాంక్షలు తెలిపారు. లోక్‌సభ స్పీకర్‌ ఓంప్రకాశ్‌ బిర్లా కూడా కేసీఆర్‌కు ఫోన్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. 

ఫోన్‌లో జగన్‌ శుభాకాంక్షలు
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు ఆయన జన్మదినం సందర్భంగా ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ఫోన్‌లో శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గారికి హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు. దేవుని ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని, చిరకాలం ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షిస్తున్నా’ అని ముఖ్యమంత్రి జగన్‌ ట్వీట్‌ కూడా చేశారు. 

మమత, పళని, సంగ్మా..
బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్‌ సంగ్మా, ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌ అనుసూయ ఉయికె, పంజాబ్‌ గవర్నర్‌ వీపీ సింగ్‌ బద్నోర్, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తదితరులు సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, సీఎంలు జగన్, మమతా బెనర్జీ తదితరులకు సీఎం కేసీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. 

సందడిగా ప్రగతి భవన్‌ 
కేసీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్లు, అకాడమీల చైర్మన్లు, అధికారులు, వివిధ రంగాలకు చెందిన వారితో సోమవారం ప్రగతిభవన్‌ పరిసరాలు సందడిగా మారాయి. మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సీఎంకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రాధాన్యతను వివరిస్తూ రూపొందించిన పాటల సీడీని ఈ సందర్భంగా సీఎం విడుదల చేశారు. 

మంత్రి హరీశ్‌రావు భావోద్వేగ ట్వీట్‌ 
కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా ట్విట్టర్లో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు భావోద్వేగ సందేశాన్ని పోస్ట్‌ చేశారు. ‘తెలంగాణ మీ స్వప్నం. ఈ రాష్ట్రం మీ త్యాగ ఫలం. ఈ అభివృద్ధి మీ దక్షతకు నిదర్శనం. ఈ నేలకు మీరే శ్రీరామ రక్ష. తెలంగాణ జాతిపిత కేసీఆర్‌ గారు శత వసంతాలు చూడాలని కోరుకుంటూ’.. అంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కాగా, వీరితో పాటు యూఎస్‌ కాన్సుల్‌ జనరల్‌ జోయల్‌ రీఫ్‌మన్, హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ,  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు.  

తల్లిని కన్న తనయుడు.. మా నాన్న
కేటీఆర్‌ ట్వీట్‌
‘తల్లిని కన్న తనయుడికి జన్మదిన శుభాకాంక్షలు’అంటూ టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కె.తారకరామారావు ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన సందేశం.. సీఎం కేసీఆర్‌ జన్మదిన వేడుకల సందేశాల్లో ప్రత్యేకంగా నిలిచింది. ‘నాకు తెలిసిన బహుముఖ ప్రజ్ఞాశాలి, సాహసి, కారుణ్యమూర్తి, ప్రజాకర్షక, శక్తిమంత నేత మా నాన్న కావడం గర్వకారణం’అని కేటీఆర్‌ పేర్కొన్నారు. దూరదృష్టి, చిత్తశుద్ధితో కలకాలం ఇలాగే స్ఫూర్తి నివ్వాలని కేటీఆర్‌ సందేశంలో పేర్కొంటూ, కేసీఆర్‌ పెయింటింగ్‌(పక్క చిత్రం)ను  జత చేశారు. కాగా ‘ఈచ్‌ వన్‌ ప్లాంట్‌ వన్‌’ నినాదంలో భాగంగా తమ కుటుంబ సభ్యులందరూ సోమవారం ప్రగతిభవన్‌లో తలా ఒక మొక్క నాటినట్లు కేటీఆర్‌ మరో సందేశంలో పేర్కొన్నారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పారు. వాటి సంరక్షణకు వచ్చే రెండేళ్ల పాటు శ్రద్ధ తీసుకోవాలని కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు. ‘జన్మదిన శుభాకాంక్షలు డాడీ. చిరకాలం ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుడిని కోరుకుంటున్నా’అని మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ట్వీట్‌ చేయడంతో పాటు కేసీఆర్‌ పెయింటింగ్‌ను తన సందేశానికి జత చేశారు. 

మరిన్ని వార్తలు