వలస వరస మారింది!

27 Nov, 2017 12:16 IST|Sakshi

ఆంధ్రా నుంచి తెలంగాణ వచ్చిన కూలీలు

పత్తి ఏరడంలో 140మందికి పైగానే..

అన్ని సదుపాయాలు కల్పిస్తున్న స్థానిక రైతులు

ఇక్కడ కూలీల కొరతే కారణం

కల్వకుర్తి రూరల్‌: ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు వలసల జిల్లాగా పేరుంది. ఇక్కడ ఉపాధి లేక వేలాది మంది కూలీలు ముంబైకి వెళ్లడం సర్వసాధారణం. అలాంటి పాలమూరుకు ఆంధ్రప్రదేశ్‌ నుంచి పనుల కోసం కూలీలు వస్తుండడం గమనార్హం. స్థానిక రైతులు భారీగా పత్తిసాగు చేయగా.. ఒకేసారి కోతకు వచ్చాయి. దీంతో పత్తి తీసేందుకు కూలీల కొరత ఏర్పడింది. ఈ మేరకు స్థానిక కూలీలు ఆంధ్రప్రదేశ్‌ నుంచి కూలీలను రప్పిస్తున్నారు.

నర్సరావుపేట నుంచి జీడిపల్లికి..
గుంటూరు జిల్లా నర్సరావుపేటకు చెందిన 140మంది కూలీలు కల్వకుర్తి జీడిపల్లి గ్రామానికి వచ్చారు. ఈ మండలంలో 1600ఎకరాలకు పైగా పత్తి సాగుచేశారు. స్థానికంగా ఎక్కువ ధర ఇచ్చినా కూలీలు దొరకకపోవడంతో నర్సరావుపేట నుంచి కూలీలను రప్పించారు. వారికి ఇక్కడ ఉండేందుకు అన్ని సదుపాయాలు కల్పించడంతో పాటు కేజీ పత్తికి రూ.10 చొప్పున చెల్లిస్తున్నారు.

అక్కడ పనులు లేకే..
నర్సరావుపేటలో మాకు సరైన పనులు దొరకడం లేదు. ఏ పని చేద్దామన్నా లభించక పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఏం చేద్దామని ఆలోచించే సమయంలో జీడిపల్లి రైతులు మమ్ముల్ని సంప్రదించారు. ఈ మేరకు పత్తి ఏరడానికి వచ్చాం. ఇక్కడ పని పూర్తయ్యాక మరో చోటకు వెళ్తాం. – కనకం, నర్సరావుపేట

మరిన్ని వార్తలు