తుంగభద్రపై ఏపీ మరో ఎత్తిపోతలు! 

19 Apr, 2018 02:46 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

దిగువ శ్రీశైలం, సాగర్‌లకు కష్టాలు

అప్రమత్తమైన తెలంగాణ, కేంద్రానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌ : తుంగభద్ర నదీ జలాలను వినియోగించుకుంటూ భారీ ఎత్తిపోతల చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్‌ సిద్ధమవుతోంది. 40 టీఎంసీల మేర నీటిని వినియోగించుకుంటూ ఏకంగా రూ.12వేల కోట్లతో ‘నాగల్‌దిన్నె, అనంతపూర్‌ ఎత్తిపోతల పథకం’చేపట్టేందుకు ప్రణాళికలు రచిస్తోంది. తుంగభద్ర జలాలపై ఆధారపడ్డ శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకోకుండా చేపడుతున్న ఈ ఎత్తిపోతలను ఎట్టి పరిస్థితుల్లో నిలువరించేందుకు తెలంగాణ ప్రభుత్వం సమాయత్తమైంది. తెలంగాణకు జరిగే నష్టాలను వివరిస్తూ త్వరలోనే కేంద్రానికి లేఖ రాసేందుకు సిద్ధమవుతోంది. కర్నూలు జిల్లా నందవరం మండలం నాగల్‌దిన్నె సమీపంలో 40 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా ప్రణాళిక రూపొందించింది. ఈ నీటిని నిల్వ చేసేందుకు 6 బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్లను ప్రతిపాదిస్తోంది. దీనిద్వారా కర్నూలు, అనంతపురం జిల్లాలకు సాగు, తాగునీటిని సరఫరా చేయాలని భావిస్తోంది.  

మహబూబ్‌నగర్‌కు ముంపు.. 
ఈ పథకం చేపట్టిన పక్షంలో దిగువన ఉన్న రాష్ట్ర ప్రాజెక్టులకు, వాటి నీటి అవసరాలకు తీవ్ర కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణకు జరిగే నష్టాన్ని పేర్కొంటూ ఓ నివేదికను సిద్ధం చేసినట్లుగా తెలిసింది. దాని ప్రకారం ‘కృష్ణా జల వివాదాల పరిష్కార ట్రిబ్యునల్‌–1 ప్రకారం కృష్ణా బేసిన్‌ పరిధిలో ఎలాంటి అంతర్రాష్ట్ర ప్రాజెక్టులు చేపట్టినా తెలంగాణ అనుమతులు తీసుకోవాలి. కానీ ఇక్కడ ఏపీ ఎలాంటి అనుమతినీ తీసుకోలేదు. దీనికితోడు తుంగభద్ర జలాలు శ్రీశైలం ప్రాజెక్టు అవసరాలను తీరుస్తున్నాయి. శ్రీశైలం నిండితే సాగర్‌కు నీటి లభ్యత పెరుగుతుంది. ప్రస్తుతం తుంగభద్ర జలాలను ఎగువే వినియోగిస్తే దిగువన ఉన్న శ్రీశైలం, సాగర్‌లు తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొనే ప్రభావం ఉంటుంది. ఇక నీటి నిల్వలకు అనుగుణంగా 15 నుంచి 20 టీఎంసీల రిజర్వాయర్‌ల నిర్మాణానికి ఏపీ ప్రణాళిక వేసింది. దీనివల్ల మహబూబ్‌నగర్‌ జిల్లాలోని చాలా ప్రాంతాలకు ముంపు ప్రమాదం పొంచి ఉంది. ఈ దృష్ట్యా ఎత్తిపోతల పథకాన్ని చేపట్టకుండా కేంద్రం జోక్యం చేసుకుని ఏపీకి తగిన ఆదేశాలు ఇవ్వాలి’అని నివేదికలో పేర్కొన్నట్లుగా తెలిసింది. ఈ నివేదికలోని అంశాలతో త్వరలోనే కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు