దోపిడీ చరిత్రను తిరగ రాసే కుట్ర!

30 Jun, 2015 09:17 IST|Sakshi
దోపిడీ చరిత్రను తిరగ రాసే కుట్ర!
  •     'సెక్షన్ 8' విషయంలో ఏపీ ప్రభుత్వ తీరుపై జస్టిస్ సుదర్శన్‌రెడ్డి
  •      వ్యక్తిగత చిక్కుల్లోంచి బయటపడేందుకే తెరపైకి తెచ్చారు
  •      రాజ్యాంగాన్ని సవరించినా సెక్షన్ 8 అమలు కాదు
  •      రియల్ ఎస్టేట్ వ్యాపారంగా ఏపీ రాజధాని నిర్మాణం
  • హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1956 నుంచి 2014 వరకు కొనసాగిన నిధులు, నియామకాలు, వనరుల దోపిడీ చరిత్రను తిరగరాసేందుకే ఏపీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలగనప్పటికీ వ్యక్తిగత చిక్కుల్లోంచి బయటపడేందుకు 'సెక్షన్ 8' ను అనైతికంగా తెరపైకి తెస్తున్నారని ఆయన మండిపడ్డారు. సోమవారం హైదరాబాద్‌లో తెలంగాణ విద్యావంతుల వేదిక హైదరాబాద్ నగరశాఖ ఆధ్వర్యంలో 'సెక్షన్ 8 పేరిట హైదరాబాద్‌పై ఏపీ ప్రభుత్వం కుట్రలను ఓడిద్దాం' అనే అంశంపై బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సదస్సులో జస్టిస్ సుదర్శన్‌రెడ్డి, తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, కో చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య తదితరులు ప్రసంగించారు.

    జస్టిస్ సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ సెక్షన్ 8 అనే అంశం రాజ్యాంగబద్ధంగా లేదని, రాజ్యాంగాన్ని సవరించినా సెక్షన్ 8 అమలు కాదని స్పష్టం చేశారు. దేశ ప్రజాస్వామ్య పార్లమెంటరీ వ్యవస్థ దేశ సమైక్యతకు విరుద్ధంగా ఉందన్నారు. రాజ్యాంగ వ్యవస్థలో గవర్నర్ ప్రజాప్రతినిధి కాదని, రాజ్యాంగంలోని విధులు, బాధ్యతలు మాత్రమే ఆయన అధికారాలని వివరించారు. ఏపీ నూతన రాజధాని నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేయడానికి సెక్షన్ 6ను రూపొందించినట్లు తెలిపారు.

    నిబంధనలకు విరుద్ధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంగా ఏపీ రాజధాని నిర్మాణం జరుగుతుందని జస్టిస్ సుదర్శన్‌రెడ్డి విమర్శించారు. సెక్షన్ 6 ఎందుకు అమలు కావట్లేదని సీమాంధ్ర ప్రజలు, అక్కడి మేధావులు ప్రశ్నించాలని ఆయన సూచిం చారు. హైదరాబాద్‌లో ప్రజలు కలసిమెలసి జీవిస్తున్న విషయాన్ని పాలకవర్గాలు గమనించాలన్నారు. రెచ్చగొట్టేందుకే రాజకీయ నేతలు రకరకాల కుట్రలు చేస్తున్నారని... ప్రజల్లో చిచ్చురేపే ఆలోచనలను మానుకోవాలన్నారు. ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ సెక్షన్ 8ను తొలి నుంచీ తెలంగాణ ప్రజలు వ్యతిరేకిస్తున్నారని తెలిపారు.

    స్వార్థ ప్రయోజనాల కోసమే ఈ అంశాన్ని తెరమీదకు తెస్తున్నారన్నారు. ఏపీ పాలకులు చేసే కుట్రలను తెలంగాణ ప్రజలు తిప్పికొట్టాలన్నారు. చట్టాలపై ప్రజలకు మరింత అవగాహన కల్పిం చేందుకు త్వరలోనే ఒక పుస్తకం తెస్తామన్నారు. తెలంగాణ విద్యావంతుల వేదిక నగర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గురజాల రవీందర్‌రావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ తిప్పర్తి యాదయ్య, తెలంగాణ అడ్వకేట్ జేఏసీ అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు