గోదారి నీటి తరలింపుపై ఈఎన్‌సీల సమావేశం

9 Jul, 2019 19:56 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ : ఏపీ, తెలంగాణ ఉన్నతస్థాయి ఇంజనీర్ల సమావేశం హైదరాబాద్‌లోని జలసౌధలో మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో గోదావరి నీటిని కృష్ణానది రిజర్వాయర్లకు తరలించే అంశంపై చర్చించారు. తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్‌రావు, ఏపీ ఈఎన్‌సీ వెంకటేశ్వర్ రావు, అంతర్ రాష్ట్ర జలవనరుల విభాగం చీఫ్ ఇంజనీర్ నరసింహరావు, నీటి పారుదల శాఖ ప్రత్యేకాధికారి శ్రీధర్ దేశ్‌పాండే, పలువురు విశ్రాంత ఇంజనీర్లు, నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రెండు రాష్ట్రాల అవసరాలు, నీటి లభ్యతను గుర్తించడం జరిగిందని మురళీధర్‌రావు తెలిపారు. 
(చదవండి : గోదావరి నుంచి కృష్ణాకు.. రోజుకు 4 టీఎంసీలు)

ఆయన మట్లాడుతూ.. ‘గోదావరి నుంచి ఎంత నీటిని వాడుకోవాలి అనే అంశంపై సూత్రప్రాయంగా ఏకాభిప్రాయంతో ఒప్పుకున్నాం. నీటిని ఏవిధంగా తరలించాలి, రూట్ అలైనమెంట్ తదితర అంశాలపై తదుపరి సమావేశంలో చర్చిస్తాం. ప్రాథమికంగా గోదావరిలో వెయ్యి టీఎంసీల నీరు అందుబాటులో ఉంటుందని తేల్చాం. తెలంగాణ నీటి అవసరాలు 700-800 టీఎంసీల వరకు ఉంటాయి. కృష్ణా బేసిన్‌లో ఉన్న ప్రాజెక్టులపైన చర్చ జరిగింది. రెండు రాష్ట్రాలకు సుమారు 1300 టీఎంసీల కృష్ణా నీటి అవసరాలు ఉన్నాయి. మన రాష్ట్రానికి 500 టీఎంసీల అశూర్డ్ వాటర్ ఉంది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి ముందే మరోసారి సమావేశమై వారికి ప్రాథమిక నివేదిక ఇస్తాం. ఏపీ అధికారులు మూడు, నాలుగు రకాలుగా ప్రతిపాదనలు చేశారు. మనం కూడా రెండు రకాలుగా ప్రతిపాదనలు చేసాం’అన్నారు.

ఏపీ ఈఎన్సీ వెంకటేశ్వర రావు మాట్లాడుతూ.. ‘గోదావరి నుంచి కృష్ణకు నీటిని తరలించే అవకాశాలపై చర్చించాం. రెండు రాష్ట్రాల అవసరాలకు రోజుకు 4 టీఎంసీలు వాడుకోవాల్సి ఉంటుందని చెప్పాం. ప్రాథమిక అవసరాలు, నీటిని ఎలా తీసుకెళ్లాలి అనే అంశంపై లోతుగా చర్చ జరిగింది. నీటి తరలింపులో ఉన్న సమస్యలు, ఇబ్బందులన్నింటిపైనా తదుపరి మీటింగ్‌లో చర్చిస్తాం. రెండు రాష్ట్రాలు కలిసి నీటిని ఏవిధంగా వాడుకోవలన్నదే మా ఆలోచన’అన్నారు.

మరిన్ని వార్తలు