గడువు కుదించడం సరికాదు

22 Sep, 2018 02:03 IST|Sakshi

     ఓటర్ల నమోదుపై అభ్యంతరాల సమర్పణపై హైకోర్టులో వ్యాజ్యం 

     గడువు 45 రోజులకు పెంచేలా ఆదేశాలివ్వండి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో అసెంబ్లీ రద్దు నేపథ్యంలో ఓటర్ల జాబితా షెడ్యూల్‌ను విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి.. ప్రతిపాదనలు, అభ్యంతరాల సమర్పణ గడువును 15 రోజులకు కుదించడాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిల్‌ దాఖలైంది. ఓటర్ల నమోదు ప్రతిపాదనలు, అభ్యంతరాల సమర్పణ గడువును 45 రోజులుగా నిర్ణయించేలా ప్రధాన ఎన్నికల అధికారిని ఆదేశించాలని కోరుతూ హైదరాబాద్‌ కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన కమ్యూనిటీ ఆర్గనైజేషన్‌ ఫర్‌ పీపుల్స్‌ ఎమన్సిపేషన్‌ అధ్యక్షుడు శివప్రసాద్‌ ఈ పిల్‌ దాఖలు చేశారు. సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి, ప్రధాన ఎన్నికల అధికారిని ప్రతివాదులుగా పేర్కొన్నారు.

మొదట 2019 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసిందని, ఆ తర్వాత అసెంబ్లీ రద్దు నేపథ్యంలో ఆ నోటిఫికేషన్‌ను రద్దు చేసి, ఓటర్ల నమోదు గడువును 2018 జనవరి 1గా మార్చారని పిటిషనర్‌ వివరించారు. కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలోనే ఏకంగా 1.57 లక్షల మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించారన్నారు. అధికార పార్టీ అండతోనే ఇది జరిగిందని ఆరోపించారు.  ఓట ర్ల పరిశీలనకు అధికారులు ఉదయం 11 నుంచి సాయం త్రం 5 గంటల మధ్య వస్తారని, ఈ సమయంలో ఉద్యోగులు వారి ఉద్యోగాలకు వెళతారని, భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేస్తుంటే వారి ఇంటికి తాళాలు వేసి ఉంటాయన్నారు. ఇలాంటి వారిని ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తున్నారని వివరించారు.  

ఏపీ ఓటర్లే లక్ష్యంగా..: కూకట్‌పల్లి నియోజకవర్గంలో నివాసముంటున్న ప్రజల్లో 50 శాతం మంది ఏపీకి చెందిన వారని, ప్రభుత్వం వీరినే లక్ష్యంగా చేసుకుని తొలగింపు ప్రక్రియను చేపడుతోందన్నారు. ఇలా ఇప్పటి వరకు 1.57 లక్షల మంది ఓట ర్లను తొలగించారని, ఇది అన్యాయమని తెలిపారు. ఇలా తొలగించిన ఓటర్లను తిరిగి జాబితాలో చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారులను కోరినా ప్రయోజనం లేకపోయిందన్నారు. నిష్పాక్షిక ఎన్నికలు సాధ్యం కావాలంటే ఓటర్ల జాబితాలో తప్పుల సవరణకు తగినంత సమయం ఉండాలని తెలిపారు. ఓటర్ల జాబితా నుంచి పెద్ద సంఖ్యలో ఓటర్లను తొలగించడాన్ని చట్ట విరుద్ధంగా ప్రకటించాలని కోర్టును కోరారు. పిటిషన్‌పై హైకోర్టు ఈ నెల 25న విచారణ జరిపే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు