అపెక్స్‌ భేటీలో తేల్చుదాం!

22 Jan, 2020 02:40 IST|Sakshi

బోర్డుల పరిధి, పట్టిసీమ జలాల వినియోగంపై..

ముఖ్యమంత్రుల స్థాయి సమావేశంలోనే తుది నిర్ణయం

తెలుగు రాష్ట్రాలతో భేటీలో స్పష్టం చేసిన కేంద్ర జలశక్తి శాఖ

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా, గోదావరి నదీ జలాల్లోని సమస్యాత్మకంగా ఉన్న అంశాలన్నింటినీ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల స్థాయిలో నిర్వహించే అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీలోనే తేల్చాలని కేంద్ర జలశక్తి శాఖ నిర్ణయించింది. కార్యదర్శుల స్థాయి సమావేశాలతో కీలక అంశాలపై తుది నిర్ణయాలకు రాలేమని, సీఎంల సమక్షంలో చర్చించిన తర్వాతే నిర్ణయాలు చేయాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. త్వరలోనే అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీ తేదీని నిర్ణయించి బోర్డుల పరిధి, కొత్త ప్రాజెక్టుల నిర్మాణ అనుమతులు వంటి అంశాలను చర్చిస్తామని తెలుగు రాష్ట్రాలకు స్పష్టం చేసింది.

కృష్ణాబోర్డు తరలింపు, ప్రాజెక్టుల డీపీఆర్, పట్టిసీమ మళ్లింపు జలాలు, వరద జలాల వినియోగం, తాగునీటి వినియోగంలో 20% మాత్రమే లెక్కింపు, ప్రాజెక్టులకు జాతీయ హోదా, పోలవరం ముంపు వంటి అంశాలపై చర్చించేందుకు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్‌ అధ్యక్షతన ఢిల్లీలోని శ్రమశక్తిభవన్‌ లో తెలుగు రాష్ట్రాలతో భేటీ జరిగింది. దీనికి కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్, కేంద్ర జలసంఘం సభ్యుడు ఆర్‌కే గుప్తా, ఏపీ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనా«థ్‌దాస్, తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్, ఏపీ ఈఎన్‌సీ నారాయణరెడ్డి, తెలంగాణ అంతరాష్ట్ర జల విభాగపు సీఈ నర్సింహారావు తదితరులు హాజరయ్యారు.

మళ్లింపు వాటాలు దక్కాల్సిందే..
భేటీలో తెలంగాణ మళ్లింపు జలాల అంశాన్ని ప్రస్తావించింది. గోదావరి ట్రిబ్యునల్‌ అవార్డు ప్రకారం.. ఏపీ చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్టుతో మళ్లిస్తున్న జలాల మేరకు తమకూ కృష్ణా బేసిన్‌ లో 45 టీఎంసీల అదనపు టీఎంసీలు కేటాయిం చాలని కోరింది. ఏపీ పట్టిసీమ ద్వారా నీటిని మళ్లిస్తున్నా తెలంగాణకు వాటా మాత్రం దక్కడ డం లేదని దృష్టికి తెచ్చింది. ఈ మూడేళ్లలోనే 135 టీఎంసీల మేర నష్టపోయామంది. దీనిపై కేంద్ర కార్యదర్శి జోక్యం చేసుకుంటూ సీఎంల సమావేశాల్లో దీనిపై తుదినిర్ణయం చేద్దామని చెప్పినట్లుగా తెలిసింది.

అప్పటివరకు కృష్ణా జలాల్లో పాత వాటాలు ఏపీ 512 టీఎంసీ, తెలంగాణ 299 టీఎంసీల వాటా ప్రకారమే వినియోగించుకోవాలని సూచించింది. కృష్ణాలో వృథాగా సమద్రంలోకి వెళ్తున్న సమయంలో వినియోగించిన నీటిని రాష్ట్రాల వినియోగం కింద లెక్కించరాదని ఏపీ విన్నవించింది. దీనిపైనా అపెక్స్‌ కౌన్సిల్‌లో చర్చించి నిర్ణయం చేస్తామని కేంద్రం తెలి పింది. ఇక కృష్ణా, గోదావరి ప్రాజెక్టుల పరిధి, వర్కింగ్‌ మాన్యువల్‌పైనా చర్చించారు. ప్రాజెక్టులు తమ పరిధిలో ఉంటేనే వాటి నిర్వహణ సాధ్యమని కృష్ణా, గోదావరి బోర్డులు తెలిపాయి. 

మరిన్ని వార్తలు