నిలువెల్లా బంగారమే..

5 Jun, 2015 00:07 IST|Sakshi

హిమాయత్‌నగర్(హైదరాబాద్): సాధారణంగా వేళ్లకు ఉంగరాలు, చేతికి బ్రాస్‌లెట్, మెడలో గొలుసు...సహజంగా పసిడి ప్రియులకు ఉండే ఆభరణాలు. అయితే ముంబైకి చెందిన ఓ వ్యాపారి ఏకంగా నాలుగు కేజీల బంగారంతో ఏకంగా చొక్కానే కుట్టించి పసిడిపై తనకున్న మమకారాన్ని చెప్పకనే చెప్పాడు. అంతే కాదు... మరో రెండు నెలల్లో పుత్తడి ప్యాంట్ కుట్టించుకొనేందుకు ముచ్చట పడుతున్న విషయాన్ని బైటపెట్టాడు. నాలుగు కేజీల చొక్కాతోపాటు మూడు కేజీల బరువున్న బంగారు బూట్లు, పలు నగలు నగలు ఆయన ఒంటిపై ఉండటం గమనార్హం. ఆయన పేరు పంకజ్ పరేఖ్, వస్త్రవ్యాపారి అయిన అతడు ముంబైలో శివసేన నాయకుడు.

సోదరుడు ప్రదీప్ పరేఖ్ గృహప్రవేశం కోసం హైదరాబాద్ వచ్చిన అతడు బుధవారం రాత్రి హిమాయత్‌నగర్‌లో సందడి చేశాడు. ధరలకు భయపడి జనం వస్త్ర సన్యాసమే చేస్తున్న ఈరోజుల్లో బంగారంతోనే చొక్కా కుట్టించుకున్న పంకజ్ పరేఖ్ జనాన్ని ఆశ్చర్యానికి గురిచేశాడు. అయితే పోలీసులు మాత్రం ఆందోళనకు గరయ్యే పరిస్థితి నెలకొంది. కాగా, తనకు చిన్నతనం నుంచే బంగారమంటే మహాపిచ్చి అని పంకజ్ తెలిపారు. ప్యాంట్‌కూడా రెండు నెలల్లో అందుబాటులోకి వస్తే గిన్నీస్ బుక్‌లో స్థానం కోసం దరఖాస్తు చేయనున్నట్లు సెలవిచ్చారు. ఇతనికి రక్షణగా నలుగురు గార్డులు అనుక్షణం వెన్నంటి ఉంటారు.
 

మరిన్ని వార్తలు