తెలుగు వర్సిటీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు

30 May, 2019 02:54 IST|Sakshi

హైదరాబాద్‌: నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయం అందజేసే వివిధ రకాల కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు రిజిస్ట్రార్‌ ఆచార్య అలేఖ్య పుంజాల ఓ ప్రకటనలో తెలిపారు. కళలు, సంస్కృతి, సంగీతం, నాటకం, చిత్ర శిల్పకళ, జానపద కళలు, విజ్ఞానం, భాషా శాస్త్రం, వ్యాకరణం, సాహిత్యం, చరిత్ర, పురావస్తు శాస్త్ర, జ్యోతిషం వంటి కోర్సు ల్లో చేరవచ్చని తెలిపారు. హైదరాబాదు ప్రాంగణంలో శిల్పం, చిత్రలేఖనం, ప్రింట్‌ మేకింగ్‌లో బ్యాచిలర్‌ కోర్సుతో పాటుగా ఎంఏ (తెలుగు), ఎంఏ (అనువర్తిత భాషా శాస్త్రం), ఎంఏ (కర్ణాటక సంగీతం), ఎంపీఏ (కూచిపూడి/ఆంధ్రనాట్యం), ఎంపీఏ (జానపద కళలు),ఎంపీఏ (రంగస్థల కళలు), ఎంఏ (జర్నలిజం) సాయంకాలం కోర్సుగా ఎంఏ (జ్యోతిషం) వంటి పోస్ట్రుగాడ్యుయేషన్‌ కోర్సులు, వివిధ లలిత కళా రంగాలలో పీజీ డిప్లొమా, డిప్లొమా, సర్టిఫికెట్, కళా ప్రవేశిక, ప్రాథమిక ప్రవీణ కోర్సులున్నట్లు పేర్కొన్నారు.

రాజమండ్రి నన్నయ ప్రాంగణంలో ఎంఏ (తెలుగు), శ్రీశైలం పాల్కురికి సోమనాథ ప్రాంగణంలో ఎంఏ (చరిత్ర పురావస్తు శాస్త్రం), కూచిపూడిలోని శ్రీ సిద్ధేంద్రయోగి కూచిపూడి కళాపీఠంలో ఎంపీఏ (కూచిపూడి నృత్యం) కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వరంగల్‌ జానపద గిరిజన విజ్ఞాన పీఠం, రాణి రుద్రమదేవి పేరిణి కేంద్రం ద్వారా రెండేళ్ల కాల వ్యవధితో పేరిణి నృత్య విశారద కోర్సును అందజేస్తున్నట్లు వివరించారు. హైదరాబాదు, రాజమండ్రి, శ్రీశైలం, వరంగల్‌ కూచిపూడిలోని పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ ప్రాంగణాల్లోని కోర్సులకు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. పూర్తి వివరాలకు తెలుగు వర్సిటీ వెబ్‌సైట్‌ నుంచి పొందవచ్చును. ఆసక్తి గల వారు ఆన్‌లైన్‌ ద్వారా రూ.350 చెల్లించి జూన్‌ 22లోపు దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. ఆలస్య రుసుముతో జూన్‌ 29లోగా చెల్లించాల్సి ఉంటుంది.
 

మరిన్ని వార్తలు