బర్త్‌ సర్టిఫికెట్‌ కావాలి!

26 Feb, 2020 02:59 IST|Sakshi

హైదరాబాద్‌లో గత డిసెంబర్‌ నుంచి వెల్లువలా దరఖాస్తులు

వీటిలో అధికంగా నిరక్షరాస్యులు, ఒక వర్గానికి చెందిన వారివే..

1936–1980 వరకు జనన ధ్రువీకరణ పత్రాలకు కొందరి దరఖాస్తు

స్వాతంత్య్రానికి పూర్వం రికార్డులు సైతం తిరగేస్తున్న అధికారులు

వీరంతా బంగ్లాదేశీయులు,మయన్మార్‌ దేశస్తులని అనుమానం

వయసు నిర్ధారణకు పోలీసు విచారణ కోరుతున్న బల్దియా

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో బర్త్‌ సర్టిఫికెట్ల కోసం బల్దియాకు దరఖాస్తులు అనూహ్య సంఖ్యలో పెరుగుతున్నాయి. అంటే దీనర్థం నగరంలో జననాల రేటు పెరుగుతోందని కాదు.. తాము నగరంలోనే జన్మించామని నిరూపించుకునేందుకు కొందరికి ఉన్నపణంగా అవసరం ఏర్పడిందని.. ఈ దరఖాస్తుదారుల్లో రోజుల వయసున్న పిల్లలతోపాటు.. కాటికి కాలు చాచిన వృద్ధులున్నారు. ముఖ్యంగా పాతబస్తీలో గతంతో పోలిస్తే.. జనన ధ్రువీకరణ దరఖాస్తుల సంఖ్యలో ఆకస్మిక పెరుగుదల నమోదవుతోంది. ప్రతిరోజూ బల్దియాకు వివిధ సర్కిళ్లకు వచ్చే దరఖాస్తులు, జారీ చేసే సర్టిఫికెట్లను పరిశీలిస్తే.. ఈ విషయం తేటతెల్లమవుతోంది.

ముఖ్యంగా గతేడాది డిసెంబర్, ఈ జనవరి నెలను పరిశీలిస్తే గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) జారీ చేసిన సర్టిఫికెట్ల సంఖ్యలో ఈ తేడా స్పష్టమవుతుంది. ఉదాహరణకు 2020 జనవరి 1వ తేదీన 88 మంది పురుషులకు బర్త్‌ సర్టిఫికెట్లు మంజూరయ్యాయి. అందులో 38 మంది ఒకే వర్గానికి చెందినవారున్నారు. అదేరోజు 101 మంది మహిళలకు బర్త్‌ సర్టిఫికెట్లు మంజూరవ్వగా.. అందులో 32 మంది ఒకే వర్గానికి చెందినవారు ఉండటం గమనార్హం. ఇదే గతేడాది జనవరి 1వ తేదీన ఇందులో సగం సంఖ్యలోనే దరఖాస్తులు ఉండటం ఆశ్చర్యానికి గురి చేసిందని ఓ జీహెచ్‌ఎంసీ అధికారి వెల్లడించారు. దాదాపు రోజువారీ సగటు కంటే 100 శాతం దరఖాస్తులు పెరిగాయని అధికారులు అంటున్నారు. పౌరసత్వ సవరణ బిల్లు (సీఏఏ) అమల్లోకి వచ్చాకే.. ఈ దరఖాస్తులు పెరిగాయని కూడా అధికారులు చెబుతున్నారు.

మరీ నిజాం కాలం నాటి సర్టిఫికెట్లా? 
‘1936లో జన్మించిన నాకు బర్త్‌ సర్టిఫికెట్‌ ఇవ్వండి.. 1945లో పుట్టిన నాకు జనన ధ్రవీకరణ పత్రం ఇవ్వండి..’అంటూ పాతబస్తీలోని వివిధ సర్కిల్‌ ఆఫీసుల్లో బల్దియా అధికారులకు మునుపెన్నడూ చూడని దరఖాస్తులు వస్తున్నాయి. 86 ఏళ్లు పైబడిన వ్యక్తికి ఇప్పుడు బర్త్‌ సర్టిఫికెట్‌తో ఏం పని? అని అధికారులు ఆశ్చర్యపోతున్నారు. అదే సమయంలో స్వాతంత్య్రానికి పూర్వం, నిజాం హయాంలో ఉన్న బల్దియా రికార్డులను తిరగేయాల్సి రావడంతో ఇవి సహజంగానే జీహెచ్‌ఎంసీ అధికారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. వీరి రికార్డుల వెరిఫికేషన్‌ కోసం అధికారులు నానాతంటాలు పడుతున్నారు. పాత నిజాం కాలం నాటి ఉర్దూలో ఉన్న రికార్డులను తిరగేయాల్సి వస్తోంది. అందులో 99 శాతం దరఖాస్తుల్లో వీరి డేటా దొరకడం లేదు. దీంతో ఆర్డీవో, పోలీసులకు వీరి దరఖాస్తును విచారణ కోసం పంపుతున్నారు. దరఖాస్తుదారుడు విద్యావంతుడైతే.. అందుబాటులో ఉన్న పత్రాల ఆధారంగా ధ్రువీకరణ పత్రాలు ఇస్తారు. లేని వారికి దరఖాస్తుదారుడు సమర్పించిన వివరాల ఆధారంగా మంజూరు చేస్తారు.

వక్ఫ్‌బోర్డుకూ అదే రీతిలో దరఖాస్తులు 
ఇటు వక్ఫ్‌ బోర్డుకు సైతం వివాహ ధ్రువీకరణ పత్రాలు కావాలంటూ దరఖాస్తులు వెల్లువలా వస్తున్నాయి. గతంలో రోజుకు 100 నుంచి 150 వరకు దరఖాస్తులు వచ్చేవి. అయితే జనవరి నుంచి రోజుకు 450 నుంచి 500కు పైగా దరఖాస్తులు వస్తున్నాయని సమాచారం. ఈ సర్టిఫికెట్లలో కూడా వివాహం జరిగిన తేదీ, సంవత్సరం, జాతీయత తదితర వివరాలు ఉండటం గమనార్హం. అనూహ్యంగా పెరిగిన ఈ దరఖాస్తులను చూసి వక్ఫ్‌బోర్డు అధికారులే విస్మయం చెందుతున్నారు.

ఆ దేశాల వారేనని అనుమానం.. 
నగరంలోని పాతబస్తీతో పాటు ఇటు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో దాదాపుగా 10 వేలకు పైగా బంగ్లాదేశ్, మయన్మార్‌ దేశాలకు చెందిన రొహింగ్యాలు శరణార్థులుగా వచ్చి ఆశ్రయం పొందారు. వీరంతా ఇప్పటికే అక్రమ మార్గంలో ఓటరు, ఆధార్, పాన్, పాస్‌పోర్టులు పొంది భారత పౌరులుగా చలామణి అవుతోన్న విషయం తెలిసిందే. త్వరలో తెలంగాణలోనూ సీఏఏ, జాతీయ పౌర పట్టిక (ఎన్నార్సీ) అమలుకానున్న నేపథ్యంలో వీరంతా బర్త్, మ్యారేజ్‌ సర్టిఫికెట్లకు తప్పుడు దరఖాస్తులు చేసుకుంటున్నారని అధికారులు అనుమానిస్తున్నారు. 1936 నుంచి 1980 వరకు పలువురు తమకు కొత్తగా జనన ధ్రువీకరణాలు కావాలని అడుగుతుండటంతో, వాటిలో అనుమానాస్పదంగా.. రికార్డుల్లోలేని దరఖాస్తుల విచారణ కోసం పోలీసులకు అప్పగిస్తున్నారు.

మరిన్ని వార్తలు