4 రోజులే..

22 Sep, 2018 13:16 IST|Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా : ఓటు పట్ల ఇంకా చాలా మంది నిర్లక్ష్యాన్ని వీడడం లేదు. 18 ఏళ్లు నిండినా ఓటరుగా నమోదు చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నట్లు కనిపించడం లేదు. ముఖ్యంగా చదువుకున్న యువతీ యువకులే ఈ విషయంలో వెనకబడినట్లు అధికారులు పేర్కొంటున్నారు. అర్హత గల ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు కావాలని విస్తృతంగా ప్రచారం జరుగుతున్నా మేల్కొనడం లేదు. సమాజాన్ని సరైన దిశలో నడిపించడంలో తమ ఓట్లే కీలకమన్న విషయాన్ని యువత గ్రహించాలి.  ఈ నెల 10న విడుదలైన ఓటర్ల ముసాయిదా జాబితా ప్రకారం జిల్లాలో 26.56 లక్షల మంది ఓటర్లు ఉన్నారు.

ఈ జాబితాలో సవరణలతోపాటు కొత్తగా ఓటు నమోదు చేసుకోవడానికి ఈనెల 25వ తేదీ వరకు అవకాశమిచ్చారు. ఈ లోగా ఓటరుగా నమోదు చేసుకుంటేనే ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ఈనెల 15, 16 తేదీల్లో ఓటరు నమోదుకు అన్ని అన్ని పోలింగ్‌ బూతుల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యాంపులకు అనూహ్య స్పందన లభించింది. రెండు రోజుల్లోనే 23 వేల మంది ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ముసాయిదా జాబితా వెలువడిన తేదీ నుంచి ఈనెల 21వ తేదీ వరకు ఈ సంఖ్య 26 వేలకు మాత్రమే చేరుకుందని అధికారులు పేర్కొంటున్నారు. ఓటు హక్కులేని వారు మరింత మంది ఉంటారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఓటు హక్కుకు ఇవీ అర్హతలు.. 

  • స్థానికంగా నివాసం ఉంటూ ఈ ఏడాది జనవరి ఒకటికి 18 ఏళ్లు నిండిన వారంతా ఓటరుగా నమోదు చేసుకోవడానికి అర్హులు. వీరంతా ఫారం–6ను పూరించి బూత్‌ లెవల్‌ఆఫీసర్‌  (బీఎల్‌ఓ)కు అప్పగించాలి. 
  •  ఆధార్‌ కార్డు తప్పనిసరి కాదు.  
  •  వయసు నిర్ధారణ తెలిపే సర్టిఫికెట్‌ ఉంటే ఎటువంటి సమస్యా ఉండదు. ఒకవేళ లేకుంటే అధికారులు నివాస స్థలానికి వచ్చి విచారణ చేపట్టి ధ్రువీకరిస్తారు.  
  •   ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి ఓటరు నివాసం మారితే తొలుత మునుపటి నియోజకవర్గంలో ఓటును ఫారం–7 ద్వారా తొలగించుకోవాలి. తాజాగా ఓటరుగా నమోదు కావడానికి ఫారం–6ని పూరించి ఇవ్వాలి. 
  •  ఇంటిపేరు, వ్యక్తి పేరు, పుట్టిన తేదీలో చేర్పులు మార్పులు ఉంటే ఫారం–8ని వినియోగించాలి. 
  •   నియోజకవర్గ పరిధిలో ఓటరు తన నివాసాన్ని మార్చితే ఫారం–8ఏ వినియోగించాలి.
     
మరిన్ని వార్తలు