పీహెచ్‌సీలకు ‘వెలుగు’

31 Jul, 2018 01:15 IST|Sakshi

510 మంది వైద్యులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో గ్రామీణ వైద్యానికి మంచిరోజులు వచ్చాయి. ఎట్టకేలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ)కు మెడికల్‌ ఆఫీసర్లు/సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లు నియమితులయ్యారు. ఈ మేరకు 510 మందికి సోమవారం ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ శ్రీనివాసరావు నియామక ఉత్తర్వులు ఇచ్చారు.

ఏడాది క్రితం ఈ పోస్టుల కు  దరఖాస్తులు ఆహ్వానించగా, దాదాపు 5 వేల మందివరకు ఎంబీబీఎస్‌ డాక్టర్లు దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థుల మార్కులు, రిజర్వేషన్లు, రోస్టర్‌ ప్రక్రియ ఆధారంగా నియామకాలు జరిపారు. దీనిపై కొందరు కోర్టుకు వెళ్లడంతో భర్తీ ప్రక్రియ ఆగిపోయింది. అయితే కోర్టుకు వెళ్లినవారే కేసును ఉపసంహరించుకోవడంతో 510 మందికి నియామకపు ఉత్తర్వులు ఇచ్చారు.  

పోస్టింగుల్లో మార్పులుండవ్‌...: కంటివెలుగు కార్యక్రమం ప్రారంభం కానున్న నేపథ్యంలోనే పీహెచ్‌సీల్లో వైద్యులను ఆగమేఘాల మీద నియమించారు. ప్రభుత్వం వచ్చే నెల 15 నుంచి కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇందుకు భారీగా ఏర్పాట్లు చేసింది. మొత్తం పరీక్షలు చేశాక దాదాపు 3 లక్షల మందికి శస్త్రచికిత్సలు అవసరం అవుతాయని అంచనా వేసింది. ఈ శస్త్రచికిత్సల కోసం 114 ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు, స్వచ్ఛంద సంస్థలను గుర్తించారు.

గ్రామాల్లో పీహెచ్‌సీ యూనిట్‌గా ఆయా కంటి పరీక్షలు జరుగుతాయి. ఇంతటి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటే పీహెచ్‌సీలదే కీలకపాత్ర. అందుకే ప్రభుత్వం కోర్టు కేసును పరిష్కరించి వైద్యుల భర్తీ ప్రక్రియ చేపట్టింది. నియామక ఉత్తర్వులు అందుకున్న వైద్యులు తమకు ఇష్టమైన చోట అవకాశం కల్పించాలని ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావుకు విన్నవించేందుకు సోమవారం పెద్ద ఎత్తున ఆయన కార్యాలయానికి చేరుకున్నారు.

అయితే  ప్రస్తుతం వినతలును పరిశీలించడం సాధ్యం కాదని అన్నారు. ‘‘పోస్టింగుల్లో మార్పులు ఉండవు. కంటి వెలుగు కార్యక్రమం ఉన్నందున అభ్యర్థులు తక్షణమే విధుల్లో చేరాలి’’అని విజ్ఞప్తి చేశారు. మరో 41 మంది సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లకు డిప్యూటీ సివిల్‌ సర్జన్లుగా పదోన్నతులు కల్పించినట్లు తెలిపారు. తద్వారా జిల్లాల్లో డిప్యూటీ డీఎంహెచ్‌వోల కొరత తీరనుందన్నారు. దీంతో కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా ముందుకు సాగనుందని ఆశాభావం వ్యక్తంచేశారు.

>
మరిన్ని వార్తలు