ఈ ఐడియా.. బాగుందయా

30 Jul, 2019 02:30 IST|Sakshi

అందరినీ ఆకర్షిస్తున్న మన ‘ఎల్‌ఈడీ స్టాప్‌లైన్స్‌.. సెలబ్రిటీల నుంచీ ప్రశంసలు 

‘వాట్‌ యాన్‌ ఐడియా సర్‌జీ’.. ఓ యాడ్‌లో జూనియర్‌ బచ్చన్‌ డైలాగ్‌ ఇదీ..  ఇప్పుడు సీనియర్‌ బచ్చన్‌.. అదేనండి అమితాబ్‌ బచ్చన్‌ కూడా అదే అంటున్నారు.. జీహెచ్‌ఎంసీ, నగర పోలీసుల యత్నాన్ని ‘సూపర్‌ ఐడియా’ అంటూ కొనియాడుతున్నారు.. మహారాష్ట్రలోని పుణే ట్రాఫిక్‌ పోలీసులు కూడా దీన్ని అమలు చేయడానికి సిద్ధపడుతున్నారు.. కోయంబత్తూరూ ఇదే దారిలో ఉంది.. అటు సోషల్‌ మీడియాలోనూ వైరల్‌గా మారింది.. ఇంతమందిని ఆకర్షించిన ఆ ఐడియా.. ఇంతకీ ఏంటి?
– సాక్షి, హైదరాబాద్‌

ఏం చేశారు.. 
నగరంలో కేబీఆర్‌ పార్క్‌ జంక్షన్‌ వద్ద ప్రయోగాత్మకంగా ఎల్‌ఈడీ స్టాప్‌ లైన్‌ ఏర్పాటు చేశారు. అంటే సిగ్నల్‌ లైట్లు మాత్రమే కాకుండా స్టాప్‌లైన్‌ కూడా ఏ రంగు సిగ్నల్‌ ఉందో దాన్ని చూపే విధంగా డిజైన్‌ చేశారు. ఫలితంగా రెడ్‌ సిగ్నల్‌ పడితే ఈ ఎల్‌ఈడీ లైన్‌ కూడా ఆరంగులో కనిపిస్తుందన్నమాట. వాహనాలు దీనిపై నుంచి వెళ్ళినా ఎలాంటి ఇబ్బందీ లేని సామగ్రితో తయారుచేశారు. రాత్రి వేళల్లో ఇవి మరింత ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. 

ఇంతకీ ఎందుకు పెట్టారు.. 
సిటీలో ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వద్ద చాలా మంది ఓ ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. అదేంటంటే.. ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నచోట్ల మినహాయిస్తే జంక్షన్లలో కుడివైపునే సిగ్నల్స్‌ ఉంటున్నాయి. దీంతో ఎడమ వైపుగా వెళ్ళే వారికి పక్కగా భారీ వాహనం ఉంటే.. సిగ్నల్‌ సరిగా కనిపించడం లేదు.. దీంతో రెడ్‌సిగ్నల్‌ పడిన విషయం గుర్తించలేక స్టాప్‌లైన్‌ క్రాసింగ్‌ జరుగుతోంది. ఫలితంగా జరిమానానే కాకుండా కొన్నిసార్లు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. అటు పాదచారులు రోడ్డు దాటే లైన్స్‌ పరిస్థితీ అంతే. పగటి వేళల్లోనే వీటిని గుర్తుపట్టడం కష్టసాధ్యంగా మారింది. రాత్రిపూట అయితే, రోడ్డు దాటే పాదచారులకు మరింత ఇబ్బందికరంగా మారుతోంది. వీటిని పరిగణలోకి తీసుకున్న నగర ట్రాఫిక్‌ విభాగం అధికారులు ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ ఉండే జంక్షన్ల వద్ద ప్రత్యామ్నాయాలను అన్వేషించారు. ఈ నేపథ్యంలోనే ఓ ప్రైవేట్‌ సంస్థ ట్రాఫిక్‌ పోలీసుల్ని సంప్రదించింది. ఎల్‌ఈడీ లైట్లతో కూడిన స్టాప్‌లైన్ల ఏర్పాటు ప్రతిపాదనలు చేసింది. ఈ ఎల్‌ఈడీ లైన్‌ ఏర్పాటు చేయడానికి మీటర్‌కు రూ.6500 వరకు ఖర్చు అవుతోంది. 

బాగుందిగా మరి.. విస్తరిస్తోనో.. 
ఇలా చేయాలంటే ఇండియన్‌ రోడ్‌ కాంగ్రెస్‌ (ఐఆర్‌సీ) అనుమతి అవసరం. ఎందుకంటే దేశంలో రహదారి నిర్వహణ, ట్రాఫిక్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థలో మార్పులు చేయాలంటే ఐఆర్‌సీ అనుమతి ఉండాల్సిందే. ఎవరైనా చేపట్టిన/చేపట్టనున్న ప్రయోగానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఐఆర్‌సీకి పంపిస్తే.. దాని వల్ల కలిగే లాభాలు, లోపాలు తదితరాలను అధ్య యనం చేసిన తర్వాత ఐఆర్‌సీ తగు మార్గదర్శకాలు జారీ చేస్తుంది. ఆ తర్వాతే కొత్త విధానం పూర్తిగా అమలు చేయవచ్చు. నగరానికి ఎల్‌ఈడీ స్టాప్‌లైన్స్‌ను ఏర్పాటు చేసిన సంస్థే ఐఆర్‌సీ అనుమతి కోసం ఆ విభాగంతో సంప్రదింపులు జరుపుతోంది. అంతా ఒకే అయితే.. సిటీ అంతా ఎల్‌ఈడీ స్టాప్‌ లైన్లు జిగేలుమననున్నాయి.

మరిన్ని వార్తలు