ఉదయం 7 నుంచే పరీక్ష హాల్లోకి అనుమతి

24 Mar, 2018 02:43 IST|Sakshi

జేఈఈ మెయిన్స్‌ టైంటేబుల్‌ జారీ 

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ స్థాయి సాంకేతిక విద్యా సంస్థల్లో 2018–19 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు ఏప్రిల్‌ 8న జరగనున్న జేఈఈ మెయిన్‌ రాత పరీక్షల కోసం సీబీఎస్‌ఈ అన్ని ఏర్పాట్లు చేసింది. ఏప్రిల్‌ 15, 16 తేదీల్లో మెయిన్‌ ఆన్‌లైన్‌ పరీక్షలను రోజూ 2 దఫాలుగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. ఈ పరీక్షలకు సం బంధించిన పూర్తిస్థాయి టైంటేబుల్‌ను జారీ చేసింది. ఉదయం 9:30కు జరిగే పరీక్షకు విద్యార్థులను ఉదయం 7 గంటల నుంచే పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని పేర్కొంది.

మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే పరీక్షకు మధ్యాహ్నం 12:45 గంటల నుంచే అనుమతిస్తామని వెల్లడించింది. నిర్ణీత పరీక్ష ప్రారంభ సమయం తర్వాత నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని స్పష్టం చేసింది. 8న ఉదయం బీఈ/బీటెక్‌ కోసం పేపర్‌–1 పరీక్ష ఉంటుందని, బీఆర్క్‌/బీప్లానింగ్‌లో ప్రవేశాలకు మధ్యాహ్నం పేపర్‌–2 పరీక్ష ఉంటుందని వెల్లడించింది. 15, 16 తేదీల్లో ఆన్‌లైన్‌ పరీక్షలు ఉంటాయని, ఉదయం ఆఫ్‌లైన్‌ పరీక్ష టైంటేబులే వర్తిస్తుందని వివరించింది. అయితే 15వ తేదీ మధ్యాహ్నం రెండో విడత పేపర్‌–1 ఆన్‌లైన్‌ పరీక్ష మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభం అవుతుందని, విద్యార్థులను 12:45నుంచే పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని చెప్పింది. మెయిన్‌ పరీక్షల సిలబస్, ప్రశ్నపత్రాల విధానంలో మార్పు లేదని, 2014, 2015, 2016, 2017ల్లో ఇచ్చినట్లే ఈసారీ ఉంటుందని చెప్పింది.  

మరిన్ని వార్తలు