మూటకట్టి.. మూలనేసి..

4 Feb, 2018 03:09 IST|Sakshi
శ్రీశైలం ప్రాజెక్టు సమయంలో నీట మునిగిన వేల ఏళ్ల నాటి ఆలయ నమూనాలు, పాత షెడ్డులో వెలుగు చూసిన షోకేసులు

వేల ఏళ్లనాటి మట్టి, రాతి వస్తువులపై పురావస్తు శాఖ నిర్లక్ష్యం 

మూటకట్టి మూలనేయడంతో సింహభాగం ధ్వంసం 

సంచాలకుల కార్యాలయం ‘షెడ్డు’లో వందల సంఖ్యలో వస్తువులు 

తాజా పరిశీలనలో వెలుగులోకి పురాతన సంపద, షోకేసులు 

పదిలంగా ఉన్న వాటి జాగ్రత్త చర్యలు మొదలెట్టిన అధికారులు  

సాక్షి, హైదరాబాద్‌: తవ్వకాల్లో వేల ఏళ్ల నాటి వస్తువులు, పనిముట్లు బయటపడ్డాయి.. అధికారుల్లో ఆసక్తి పెరిగి ఇంకాస్త శోధించారు.. ఈసారి చెక్కలకు అద్దాలు బిగించి రూపొందించిన షోకేసులు బయటపడ్డాయి.. మరికాస్త వెతగ్గా ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు, కుర్చీలు, బల్లలు కనిపించాయి.. చారిత్రక అన్వేషణల్లో వస్తువులు బయటపడే కొద్దీ సంబరపడే అధికారులు ఇక్కడ మాత్రం వస్తువులు బయటపడే కొద్దీ అవాక్కయ్యారు.. ఎందుకనుకుంటున్నారా..? ఇవన్నీ ఎక్కడో చారిత్రక ప్రదేశంలో దొరికినవనుకుంటే పొరపాటే.. పురావస్తు శాఖ సంచాలకుల కార్యాలయం ‘షెడ్డు’లో బయటపడ్డాయి. విలువైన వస్తువులను గతంలో పనిచేసిన అధికారులు తమ నిర్లక్ష్యానికి బలిచేసిన తీరుతో కొత్త అధికారులు విస్తుపోయారు. వేల ఏళ్లనాటి వస్తువులను మూటకట్టి పడేయడంతో అనేక వస్తువులు ధ్వంసమయ్యాయి. చారిత్రక సాక్ష్యాలు చెదిరిపోయాయి. 

అన్నీ తెలిసీ గాలికొదిలారు.. 
తవ్వకాలు జరిపిన ప్రాంతాల్లో ముఖ్యమైన చోట్ల సైట్‌ మ్యూజియంలు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలున్నాయి. ఉదా.. ధూళికట్టలో బౌద్ధ స్థూపం లభించింది. అక్కడి తవ్వకాల్లో వెలుగుచూసిన వస్తువులతో సైట్‌ మ్యూజియం ఏర్పాటు చేస్తే, అక్కడికి వచ్చే సందర్శకులకు ఆ చరిత్ర కళ్లకు కడుతుంది. ఇలాంటి సైట్‌ మ్యూజియంలు ఏర్పాటు చేయాలంటే ఆయా తవ్వకాల్లో వెలుగుచూసిన వస్తువులు భద్రపరచాలి. కానీ వాటిల్లో కొన్ని ధ్వంసమయ్యాయి. తవ్వకాలు వెలుగుచూసిన నాటి వస్తువులు చిన్న పెంకు కూడా పురావస్తు శాఖ దృష్టిలో విలువైనదే. భవిష్యత్‌ అధ్యయనాలకు అవి ఆధారమవుతాయి. అవి ధ్వంసమయితే అధ్యయనాలు జరగవు. ఈ విషయం తెలిసీ అధికారులు నిర్లక్ష్యంగా వాటిని గాలికొదిలేశారు.  

పాతవి లేవనుకొని.. 
శ్రీశైలం ప్రాజెక్టు నిర్మించే సమయంలో అనేక గ్రామాలు నీట మునిగాయి. వేల ఏళ్ల నాటి దేవాలయాలూ మునిగిపోయాయి. ఆ సమయంలో అధికారులు కొన్ని విప్పి మరోచోట పునర్‌ నిర్మించారు. మరో 100 వరకు దేవాలయాల నమూనాలు గ్రానైట్‌ రాళ్లతో రూపొందించి మ్యూజియంలో భద్రపరిచారు. ఆ తరహాలో భవిష్యత్‌లో దేవాలయాలు నిర్మించాలనేది నాటి ఆలోచన. దేవాదాయ శాఖ రూ.లక్షలు వెచ్చించి ఆ నమూనాలకు చెక్కలు, అద్దాలతో షోకేసులు రూపొందించింది.

కొంతకాలం తర్వాత ఆ నమూనాలను హైదరాబాద్‌ హెరిటేజ్‌ మ్యూజియంకు తరలించారు. అప్పుడు ఆ షోకేసులను షెడ్డులో ఉంచారు. కానీ ఇప్పటి అధికారులకు పాత షోకేసుల విషయం తెలియక భారీ వ్యయంతో కొత్త షోకేసులు ఆర్డరిచ్చారు. కొద్దిరోజుల క్రితం హెరిటేజ్‌ తెలంగాణ సంచాలకులు విశాలాచ్చి ఆ షెడ్డులో ఏమున్నాయో చూడాలంటూ సిబ్బందిని పురమాయించడంతో ఏళ్ల తర్వాత తాళాలు తీసి ఒక్కో వస్తువును పరిశీలించి కంగుతిన్నారు. షోకేసులు సహా వెలకట్టలేని పురాతన సంపద చాలా వరకు ధ్వంసమైనట్లు గుర్తించారు. పదిలంగా ఉన్న వాటిని వేరుచేసి అదే షెడ్డులో జాగ్రత్తగా భద్రపరిచే చర్యలు చేపట్టారు. ధ్వంసమైనవాటిని తరలించారు.

మరిన్ని వార్తలు