ఆర్జిత సేవలు బంద్‌

10 Aug, 2018 03:56 IST|Sakshi

నేటి నుంచి ఆలయాల్లో అర్చనాభిషేకాలు నిలిపివేత

జీవో 577 అమలు, కేడర్‌ ఫిక్సేషన్‌ అవకతవకలు సరిచేయాలని తెలంగాణ అర్చక, ఉద్యోగ జేఏసీ డిమాండ్‌

సాక్షి, హైదరాబాద్‌: దేవాదాయ శాఖ అధీనంలో ఉన్న దేవాలయాల్లో శుక్రవారం నుంచి ఆర్జిత సేవలు నిలిచిపోనున్నాయి. దేవాదాయ శాఖ అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నామని, దేవాలయాల్లో అర్చనాభిషేకాలు నిలిపివేస్తామని తెలంగాణ అర్చక, ఉద్యోగ జేఏసీ కన్వీనర్‌ గంగు భానుమూర్తి వెల్లడించారు. గురువారం హైదరాబాద్‌ న్యూనల్లకుంటలోని రామాలయంలో అన్ని జిల్లాల నుంచి హాజరైన ప్రతినిధుల సమావేశం జరిగిందని, ఈ సమావేశంలో ఆర్జిత సేవలు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వెల్లడించారు.

దేవాలయాలు తెరిచే ఉంటాయని, నిత్యపూజలు, మహానైవేద్యం సమర్పిస్తామని, అయితే, భక్తులు ఫీజు చెల్లించి జరిపించుకునే అర్చనాభిషేకాలను మాత్రం నిలిపివేస్తామని చెప్పారు. తాము సీఎం కేసీఆర్‌కు, దేవాదాయ మంత్రి, కమిషనర్లకు వ్యతిరేకంగా ఈ ఉద్యమం చేయడం లేదని, కేవలం దేవాదాయ శాఖ అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగానే ఆందోళన చేస్తున్నామని ఆయన చెప్పారు. అర్చక, ఉద్యోగుల వేతనాలను ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఇవ్వాలని గత ఏడాది సెప్టెంబర్‌లో జీవోనెం.577 విడుదల చేశారని, మళ్లీ సెప్టెంబర్‌ వస్తున్నా అధికారులు ఈ జీవోను అమలు చేయడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ జీవోను వెంటనే విడుదల చేయాలని, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ పద్దు ద్వారా వేతనాలు చెల్లించాలని, కేడర్‌ ఫిక్సేషన్‌లో జరిగిన అవకతవకలు సరిచేయాలనే ప్రధాన డిమాండ్లతో ఆందోళనకు దిగుతున్నామని చెప్పారు. గత మూడు రోజుల నుంచి ఈ విషయమై నల్లబ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్నామని, అయినా అధికారులు స్పందించకపోవడంతో ఆర్జిత సేవలు నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంటున్నట్టు భానుమూర్తి చెప్పారు.

మరిన్ని వార్తలు