సిద్దిపేట: ఆమే శక్తి

10 Dec, 2018 13:14 IST|Sakshi
హుస్నాబాద్‌ పట్టణంలో ఓటు వేసేందుకు క్యూలో ఉన్న మహిళలు

అభ్యర్థుల తలరాత రాసేది మగువలే.. 

గెలుపు, ఓటములను నిర్ణయించే స్థాయిలో మహిళా ఓటర్లు

మేనిఫెస్టోతోపాటు స్థానిక అంశాలూ ప్రభావితం చేసే అవకాశం 

దుబ్బాక, హుస్నాబాద్, సిద్దిపేట నియోజకవర్గాల్లో వారిదే పై చేయి 

శాసనసభ ఎన్నికల్లో గెలుపోటములను మహిళలు ప్రభావితం చేయబోతున్నారా..? రాజకీయ నేతల భవితవ్యంపై తీర్పునివ్వబోతున్నారా..? మహిళ నిర్ణయమే శిరోధ్యారమవుతుందా.. అనే ప్రశ్నలకు ఔననే సమాధానమే వస్తోంది. జిల్లాలో మహిళల నిర్ణయమే రాజకీయ పార్టీల భవిష్యత్తును శాసించబోతోంది. మహిళా ఓటర్లు ఎక్కువ శాతం ఓటింగ్‌లో పాల్గొనడం అభ్యర్థుల తల రాతలను మార్చబోతోంది. జిల్లాలోని గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక, హుస్నాబాద్‌ నియోజకవర్గాల్లో గజ్వేల్‌ మినహా మిగతా చోట్ల మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. పోలింగ్‌ జరిగిన తీరు పరిశీలిస్తే మహిళలదే పైచేయిగా ఉంది.     


గజ్వేల్‌ : హుస్నాబాద్‌ నియోజకవర్గంలో మొత్తం 222436 ఓటర్లు ఉండగా... ఇందులో మహిళలు 111692, పురుషులు 110737 మంది ఉన్నారు. ఎన్నికల్లో 185976 ఓట్లు పోలయ్యాయి. ఇందులో మహిళలు 93587 మంది ఓటు హక్కును వినియోగించుకోగా పురుషులు 92100 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఈ లెక్కన 1487 మంది మహిళా ఓటర్లు ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఓట్లు వేశారు. నియోజకవర్గంలో స్థానిక అంశాలు ఓటింగ్‌ను ప్రభావితం చేశాయని తెలుస్తోంది. నియోజకవర్గంలోని మిషన్‌ భగీరథ పథకం పనులు కొన్ని గ్రామాల్లో పూర్తయి,

మరికొన్ని గ్రామాల్లో ప్రగతిపథంలో ఉండడం, హుస్నాబాద్‌ పట్టణంలో 560 డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం సాగుతుండడం తమకు అనుకూలంగా ఉంటుం దని... ఈ అంశాన్ని మహిళలు సానుకూలంగా తీసుకొని తమ వైపే మొగ్గు చూపారని టీఆర్‌ఎస్‌ అంచనా వేస్తోంది. మరోవైపు ప్రభుత్వ వైఫ ల్యాలు, అసంపూర్తి పనులు మహిళలను తమ వైపు మళ్లించాయని ప్రజాకూటమి అంచనా వే  స్తోంది. దుబ్బాక నియోజకవర్గానికి వచ్చేసరికి ఇక్కడ మొత్తంగా 190483 ఓట్లు ఉండగా... ఇందులో మహిళలు 96780, పురుషులు 93703 మంది ఉన్నారు. ఎన్నికల్లో మొత్తంగా 163798 ఓట్లు పోలవగా... ఇందులో మహిళలు 83176, పురుషులు 80482 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు.


నియోజకవర్గంలో 26 94మంది మహిళలు పురుషులతో పోలిస్తే ఎక్కువగా ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఈ అంశం తమకు కలిసి వస్తుందని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. నియోజకవర్గంలో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, ఆసరా పింఛన్‌దారులు తమ వైపే మొగ్గు చూపారని అంచనా వేస్తోంది. మరోవైపు మిషన్‌ భగీరథ పథకం కూడా తమకు కలిసివచ్చిందనే ఆశలో ఉంది. బీజేపీ, కాంగ్రెస్‌ అభ్యర్థులు నియోజకవర్గంలో స్థానిక సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోవడం, ప్రభుత్వ వ్యతిరేకత కలిసొస్తుందనే ఆశలో ఉన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో పరిస్థితి మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే భిన్నంగా ఉంది. ఇక్కడ మహిళలు ఏకపక్షంగా తీర్పునిస్తారనే అంచనాలున్నాయి. 


నియోజకవర్గంలో మొత్తం 209339 ఓట్లలో మహిళలు 105279 మంది ఉన్నారు. ఎన్నికల్లో 165368 ఓట్లు పోలవగా... ఇందులో మహిళలు 83575 మంది ఉన్నారు. వీరిలో 95శాతానికి పైగా తమవైపే మొగ్గు చూపారని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. గజ్వేల్‌ నియోజకవర్గంలోని గజ్వేల్, ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్, కొండపాక, మర్కూక్, మనో హరాబాద్, తూప్రాన్‌ మండలాల్లో మొత్తంగా 233207 ఓట్లు ఉండగా... మహిళలు 116202, పురుషులు 116982, ఇతరులు 23మంది ఉన్నా రు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ మధ్య పోటీ నెలకొన గా... ఈ రెండు పార్టీలు కూడా తమ మేనిఫెస్టోతో మహిళల ముందుకు వెళ్లాయి. టీఆర్‌ఎస్‌ నేతలు ప్రధానంగా ‘మిషన్‌ భగీరథ’ పథకాన్ని ప్రధాన ప్రచార అస్త్రంగా వాడుకున్నారు. 


నియోజకవర్గంలో రూ. 450కోట్ల వ్యయంతో ఈ పథకాన్ని చే పట్టి 248 ఆవాసాలకు స్వచ్ఛమైన నల్లా నీటిని అందించామని పార్టీ శ్రేణులు ప్రచారంలో వివరించే ప్రయత్నం చేశాయి. గతంలో ఇక్కడ మం చినీళ్లు దొరకక కిలోమీటర్ల దూరం వెళ్లి తెచ్చుకున్న కష్టాలను గుర్తు చేస్తూ కేసీఆర్‌కు ఓటు వేయాలని అభ్యర్థించాయి. అంతేగాకుండా మహిళా సంఘాలకు రుణాలు, ఇతర పథకాలను ప్రస్తావిస్తున్నారు. కాంగ్రెస్‌ సైతం మేనిఫెస్టోలో పొందు పర్చిన ఓ కుటుంబానికి 6 గ్యాస్‌ సిలిండర్లు ఉచి తంగా పంపిణీ చేస్తామనే అంశాన్ని బలంగా మహిళల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాయి.

ఏటా 6 సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేస్తే మహిళల కష్టాలు తీరుతాయని వివరించాయి. అదే విధంగా మహిళా సంఘాలకు రుణాల పెంపు అంశాన్ని ప్రచారం చేశాయి. ఇక ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు, సభలకు మహిళలను పెద్ద ఎత్తు న తరలించడంపైనే పార్టీలు దృష్టి పెట్టాయి. రెండు పార్టీలు మహిళలు తమవైపే ఉంటారని వి శ్లేషిస్తున్నాయి. ఎన్నికల్లో మొత్తంగా 206699 ఓటర్లు పాల్గొనగా... అందులో మహిళలు 1022309 మంది, పురుషులు 104457 మంది, ఇతరులు ముగ్గురున్నారు. రెండు పార్టీలు మహిళలు తమ వైపే మొగ్గు చూపారనే అంచనాల్లో నిమగ్నమయ్యాయి. మొత్తానికి సిద్దిపేట ఎన్నికల చిత్రం మహిళల పాత్రపైనే ఆధారపడి ఉండటం విశేషం. 

మరిన్ని వార్తలు