రేవంత్‌ నిర్బంధంపై ముగిసిన వాదనలు

27 Feb, 2019 02:26 IST|Sakshi

తీర్పు వాయిదా వేసిన ధర్మాసనం

పోలీసులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు

ఈ కేసు పరిహారం ఇవ్వదగ్గది

రేవంత్‌ తరఫు న్యాయవాది మోహన్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి నిర్బంధం.. ఇందుకు పరిహారం చెల్లించే వ్యవహారంపై మంగళవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. వాదనలు విన్న న్యాయమూర్తులు జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, జస్టిస్‌ టి.అమర్‌నాథ్‌గౌడ్‌లతో కూడిన ధర్మాసనం తీర్పు వాయిదా వేసింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రేవంత్‌ను అర్ధరాత్రి పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, ఆయనను కోర్టు ముందు హాజరుపరిచేలా ఆదేశాలివ్వాలంటూ రేవంత్‌ సన్నిహితుడు వేం నరేందర్‌రెడ్డి హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

ఈ వ్యాజ్యంలో పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది సి.వి.మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, రేవంత్‌ నిర్బంధం విషయంలో పోలీసులు చట్ట నిబంధనలు పాటించకుండా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని తెలిపారు. నిర్బంధానికి ముందు రేవంత్‌ కుటుంబసభ్యులకు నోటీసులిచ్చేందుకు ప్రయత్నించామని, వారు తిరస్కరించడంతో రేవంత్‌ అనుచరుడు అంజి అనే వ్యక్తికి ఇచ్చామని చెబుతున్నారని, ఇది అబద్ధమని వివరించారు. అంజి అనే పేరుతో రేవంత్‌ అనుచరుల్లో ఎవరూ లేరని, ఈ విషయాన్ని తాము ఇప్పటికే కోర్టుకు లిఖితపూర్వకంగా నివేదించామని తెలిపారు.

రేవంత్‌ నిర్బంధం తర్వాతే పోలీసులు నివేదిక తయారు చేశారని, అందుకే దానిపై తేదీ, సమయం లేదని వివరించారు. రేవంత్‌ నిర్బంధంపై హైకోర్టు తీవ్రంగా స్పందించాక అధికారులు ఆ నివేదికను తెరపైకి తెచ్చారని పేర్కొన్నారు. తలుపులు పగులగొట్టి బెడ్రూంలోకి పోలీసులు వచ్చారని చెప్పారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. పిటిషనర్‌ ఘటనా స్థలం లేరని, ఎవరో చెప్పిన మాటల ఆధారంగా ఈ వ్యాజ్యం దాఖలు చేశారని పోలీసుల తరఫు సీనియర్‌ న్యాయవాది రోహత్గీ ఆరోపించారని, దీనిపై ఏం చెబుతారని ప్రశ్నించింది.

రేవంత్‌ కుటుంబ సభ్యుల్లో పిటిషనర్‌ ఒకరిగా మెలుగుతున్నారని, ఆయన ఘటనా స్థలంలో లేకపోయినా, రేవంత్‌ కుటుంబసభ్యులతో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకున్నారని మోహన్‌రెడ్డి చెప్పారు. వాస్తవాలతో దాఖలు చేసిన వ్యాజ్యానికి విచారణార్హత లేదనడం సరికాదన్నారు. ఎంసీ మోహతా కేసులో అధికార దుర్వినియోగం జరిగిప్పుడు బాధితులకు పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందన్నారు. అందువల్ల ఈ కేసులో బాధితునికి పరిహారం చెల్లించాల్సిన అవసరం ఉందన్నారు. రేవంత్‌ నిర్బంధానికి సంబంధించిన వీడియో ఫుటేజీ, సబ్‌ టైటిల్స్‌తో అందించాలని పోలీసులకు మరోసారి స్పష్టం చేస్తూ కోర్టు తీర్పును వాయిదా వేసింది. 

మరిన్ని వార్తలు