కోర్టులో వాదనలు ఎలా జరిగాయి?

27 Jun, 2015 07:23 IST|Sakshi
కోర్టులో వాదనలు ఎలా జరిగాయి?

ఓటుకు కోట్లుకేసులో మొదటి నిందితుడు రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై జరిగిన విచారణ ఆద్యంతం ఉత్కంఠంగానే సాగింది. వచ్చే మంగళవారాని(జూన్ 30)కి బెయిల్ పిటిషన్ పై తీర్పు వెల్లడిస్తామని హైకోర్టు వెల్లడించింది. దాదాపు గంటసేపు వాదనలు, ప్రతివాదనలు, న్యాయమూర్తి ఛలోక్తుల మధ్య విచారణ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.

అడుగేస్తే.. అడుగేయలేం..

కేసు విచారణకు గంటముందుగానే హైకోర్టులోని 11వ నంబరు హాలు కిక్కిరిసిపోయింది. న్యాయవాదులు, మీడియా ప్రతినిధులు రాకతో మొత్తం అడుగుతీసి అడుగువేయలేని పరిస్థితి. తెలంగాణ ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి ముందుగా తన బృందంతో కోర్టుహాలుకు చేరుకున్నారు. ఆతర్వాత రేవంత్ రెడ్డి తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కోర్టు హాల్లోకి ప్రవేశించారు అప్పటికే కోర్టు హాలు నిండిపోవడంతో సిద్ధార్థ లూథ్నా అడుగు ముందుకు వేయలేని పరిస్థితి. ఈకేసును వాదించాల్సింది తామే.. దయచేసి కాస్త స్థలం ఇవ్వండంటూ సిద్ధార్థ బృందంలోని న్యాయవాది ... అక్కడున్నవారికి విజ్ఞప్తిచేశారు.

కాసేపటి తర్వాత ఏసీబీ తరఫు న్యాయవాదులు, వారి ప్రతినిధులు వచ్చేసరికి.. అప్పటికే నిండిపోయిన ఉన్న కోర్టు హాల్లో నిలబడ్డమే కష్టంగా మారింది. ఈగంట వ్యవధిలోనే రేవంత్ కు బెయిల్ వస్తుందా, లేదా అన్నదానిపై న్యాయవాదుల మధ్య చాలా చర్చోపచర్చలు సాగాయి. బెయిల్ వస్తుందని కొందరు, రాదని కొందరు.. ఇలా తలోరకంగా తమతమ అభిప్రాయాలు చెప్తూ వచ్చారు. సరిగ్గా మధ్యాహ్నం 2:15 గంటలకు న్యాయమూర్తి జస్టిస్ ఇళంగోవ్ కోర్టులోకి ప్రవేశించారు. పూర్తిస్థాయిలో నిశ్చబ్ధ వాతావరణం కనిపించింది.

కోర్టులో వినిపించని టీడీపీ వాదనలు..

ఓటుకు నోటు కేసు వచ్చినదగ్గరనుంచి తెలుగుదేశం పార్టీ నేక వాదనలు వినిపిస్తోంది. ఏపీ ముఖ్యమంత్రిచంద్రబాబుకూడా రోజుకో వాదనలు చేస్తున్నారు. స్గింగ్ ఆపరేషన్లు చెల్లవని ఒకసారి, రేవంత్ రెడ్డిన కుట్రలో ఇరికించారని ఒకసారి, ఈకేసు ఎన్నికలసంఘం పరిధిలోకి వస్తుందని మరోసారి, ఫోన్ ట్యాప్ చేశారని, ఇది అక్రమమని ఇంకోసారి.. ఇలా పలురకాల వాదనలు వినిపిస్తున్నారు. ప్రజలముందు డిఫెండ్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కాని కోర్టులో మాత్రం రేవంత్ రెడ్డి తరఫున్యాయవాదులెవ్వరూ ఇందులో ఒక్క మాటనుకూడా కోర్టు ఎదుట ప్రస్తావించలేదు. ఈకేసులో ఎఫ్ ఐ ఆర గురించి డిఫెన్స్ లాయర్ ప్రస్తావించగానే జడ్జి అడ్డుకున్నారు. ఈదశలో ఎఫ్ఐఆర్ గురించి ప్రస్తావించడం సరికాదన్నారు.

ప్రాథమికంగా నేరం జరిగినట్టేనని పలుమార్లు కోర్టు తన అభిప్రాయాన్ని వ్యక్తంచేసింది. ఎమ్మెల్యే కొనుగోలు ప్రయత్నం, డబ్బు, వీడియోలు ఉన్నాయని కోర్టు ప్రస్తావించింది. రేవంత్ రెడ్డికి బెయిల్ ఎందుకివ్వాలో అన్నదానిపై మాత్రమే వాదనలు వినిపించాలని న్యాయమూర్తి డిఫెన్స్ లాయర్ సిద్ధార్థకు స్పష్టంచేశారు. ఈకేసులో ఇప్పటికే నిందితుడు 26 రోజులు పాటు రిమాండ్ లో ఉన్నారని, విచారణకోసం ఐదురోజులు కస్టడీకి కూడా తీసుకున్నారని కోర్టుకు నివేదించారు. ప్రత్యక్ష సాక్షుల విచారణ, వారి స్టేట్ మెంట్లనుకూడా తీసుకున్నారని కోర్టు ముందు ఉంచారు. ఏసీబీ ఆధారాలుగా చెప్తున్న వీడియో, ఆడియో టేపులన్నీ.. ఫోరెన్సిక్ పరీక్షల్లో ఉన్నాయని, ఈకేసులో ఇంతకన్నా విచారించాల్సింది.. ఏమీ లేదని కోర్టుకు తెలిపారు. గతంలో నిందితుడికి ఒకరోజు బెయిల్ ఇస్తే.. కోర్టు మార్గదర్శకాల ప్రకారం నడుచుకున్నారని,ఇప్పుడు కూడా ఎలాంటి షరతులు విధించినా అభ్యంతరం వ్యక్తంచేయకుండా పాటిస్తామని కోర్టుకు విజ్ఞప్తిచేశారు.

ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర..

రేవంత్ రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దంటూ ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి గట్టిగా వాదించారు. ఈకేసుపూర్వాపరాలను చెప్తున్న సమయంలో..  జడ్జి జోక్యంచేసుకున్నారు. మొత్తం వివరాలను తాను చదివానన్నారు. వీడియోకూడా తాను టీవీల్లో చూశానని జడ్జి రాజా ఇళంగోవ్ చెప్పుకొచ్చారు. బెయిల్ ఎందుకు ఇవ్వరాదో వాదనలు వినిపిస్తే చాలన్నారు. రేవంత్ రెడ్డికి బెయిల్ ఎందుకు నిరాకరించాలో చెప్తూ ఏడు కారణాలను ఏజీ కోర్టు ముందు ఉంచారు. ఇప్పుడు బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారని, రాజకీయంగా అత్యంత పలుకుబడి వారు అయినందున కేసును ప్రభావితంచేస్తారని కోర్టు ముందు ఉంచారు. ఈకేసులో పట్టుబడ్డ డబ్బు ఎక్కడనుంచి వచ్చిందో, మిగిలిన నాలుగున్నరకోట్లు ఎక్కడున్నాయి, మొత్తం ఈ వ్యవహారం వెనుక ఎవరున్నారో తెలుసుకోవాల్సి ఉందన్నారు. రేవంత్ రెడ్డికి చెందిన పార్టీ పక్కరాష్ట్రంలో అధికారంలో ఉందని, పైగా ఢిల్లీలో వీళ్లకు చెందినవారు అధికారంలో ఉన్నారన్న విషయాన్ని కోర్టు ఎదుట ఉంచారు. ఇప్పటికే ఈ కేసులోనోటీసు అందుకున్న ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య విచారణాధికారి ఎదుట హాజరుకాలేదన్న విషయాన్ని ఏజీ కోర్టుకు తెలిపారు. నాలుగో నిందితుడైన మత్తయ్య ఇప్పటికీ దొరకలేదని, పక్కరాష్ట్రంలో దాక్కుంటున్నారని చెప్పారు. దర్యాప్తు మొత్తం ఇంకా ప్రాథమిక దశలో ఉందని, కాల్ డేటాను కూడా విశ్లేషించాల్సి ఉందని కోర్టుకు నివేదించారు.

రేవంత్ రెడ్డిని కస్టడీలోకి తీసుకున్న సమయంలో... సమాచారం రాలేదా? అంటూ జడ్జి ఏజీని ప్రశ్నించారు. కస్టడీ సమయంలో ఎలాంటి సమాచారాన్ని ఇవ్వడానికి రేవంత్ రెడ్డి అంగీకరించలేదని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో జడ్జి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలప్రక్రియను అడిగి తెలుసుకున్నారు. ఏపార్టీకి ఎంతమందికి ఉన్నారు,, ఏపార్టీనుంచి ఎవరు పోటీచేశారు.. తదితర అంశాలపై జడ్జి ఇళంగోవ్ ప్రశ్నలు వేశారు. టీడీపీకి ఎంతమంది ఎమ్మెల్యే లు ఉన్నారో కూడా అడిగి తెలుసుకున్నారు. అదేసమయంలో జేఎంఎం కేసునుకూడా జడ్జి ప్రస్తావించారు. ఓటుకు నోటు అనే మాట మొదట ఈకేసు నుంచే వచ్చింది కదా? అని జడ్జి అన్నారు. ఓట్లు కొనుగోలు చేయడం అనేది చాలా తీవ్రమైన నేరంగా పరిగణించాలంటూ సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని ఏజీ ప్రస్తావించారు. బెయిల్ ఇచ్చేటప్పుడు నేర తీవ్రతను పరిగణలోకి తీసుకోవాలని ఏజీ వాదించారు. 10 మంది ఎమ్మెల్యేలను కొని ఉంటే... ప్రభుత్వమే కూలిపోయేదన్న అంశాన్ని కోర్టుకు ముందు ఉంచారు. ఎన్నికల ప్రక్రియను అడ్డుకున్న వ్యక్తులు, దర్యాప్తును అడ్డుకోలేరా? అంటూ ఏజీ.. భయాన్నీ, సందేహాలనూ వ్యక్తంచేశారు. ఇక ఈ కేసులో నేరం రుజువైతే ఎంతకాలం శిక్షపడే అవకాశం ఉందని న్యాయమూర్తి అడ్వకేట్ జనరల్్ను అడిగారు. దీంతో కనిష్ఠంగా ఆరునెలలు గరిష్ఠంగా ఐదేళ్ల శిక్షపడే అవకాశం ఉందని ఏజీ కోర్టుకు తెలిపారు.

ఆ రెండు కారణాలు...

రేవంత్ రెడ్డికి బేయిల్ నిరాకరించాలంటూ అడ్వకేట్ జనరల్ చెప్పిన ఏడుకారణాల్లో కేవలం రెండు మాత్రమే ఆయనకు అనుకూలంగా ఉన్నాయని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. బెయిల్ ఇస్తే.. విచారణను ప్రభావితం చేయడంతోపాటు, సండ్రవెంకట వీరయ్య విచారణకు హాజరుకాకపోవడం, మత్తయ్య పరారీలో ఉండడాన్ని కోర్టు తీవ్రంగానే పరిగణించింది. అయితే ఏడేళ్లకంటే తక్కువ శిక్షపడే కేసుల్లో అరెస్టు చేయకూడదంటూ చట్టం చెబుతున్న అంశంకూడా వాదనల్లో ప్రస్తావనకు వచ్చింది. అఇయతే సాధారణ కేసుల్లా కాకుండా ఈకేసును ప్రత్యేకంగా చూడాలని, నేర స్వభావం, తీవ్రతను పరిగణలోకి తీసుకోవాలని ఏజీ కోర్టుకు నివేదించారు. ఇరుపక్షాల వాదనలు విన్నతర్వాత మంగళవారం తీర్పు వెల్లడిస్తానని జడ్జి ప్రకటించారు. తమ వాదనలను లిఖిత పూర్వకంగా ఇస్తామని ఏజీ కోర్టుకు చెప్పగానే, అందుకు న్యాయమూర్తి అంగీకరించారు.  బెయిల్ పిటిషన్ పై విచారణ ముగిసిన కొన్ని నిమిషాల్లోనే ఏసీబీ కోర్టు.. అవినీతినిరోధకశాఖకు ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చిన రిపోర్టును అందించింది. లిఖితపూర్వక వాదనల్లో ఎఫ్ ఎస్ ఎల్ రిపోర్టునుకూడా కోర్టు ముందు ఉంచే అవకాశాలున్నాయని న్యాయనిపుణులు చెప్తున్నారు.

-శ్రీహరి, సాక్షి టీవీ

మరిన్ని వార్తలు