సికింద్రాబాద్‌ పోస్టింగ్‌ కోసం ఎదురు చూస్తున్నాడు: సహోద్యోగులు

17 Jun, 2020 20:05 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భారత్‌ - చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో సూర్యాపేటకు చెందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతడి సహోద్యోగులు సంతోష్‌ మృతి పట్ల సంతాపం తెలిపారు. ‘సంతోష్‌ నిగర్వి.. దూకుడుగా ఉండే వాడు కాదు. మృదు స్వభావి. ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు. చాలా మంచి మనిషి’ అని కల్నల్‌ ఎస్‌ శ్రీనివాసరావు తెలిపాడు. అంతేకాక ‘మరో రెండేళ్లలో సంతోష్‌కు‌ సికింద్రాబాద్‌కు పోస్టింగ్‌ వచ్చేది. దాని కోసం అతడు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నాడు. ఏ అధికారి అయినా తన సొంత రాష్ట్రంలో సేవ చేయడం చాలా గౌరవంగా భావిస్తారు. సంతోష్‌ కూడా అలానే. ఇప్పటి నుంచే అతడు తన పిల్లలకు మంచి స్కూల్‌ గురించి వెతుకుతున్నాడు. తెలుగు అధికార్లుగా మేం ఎప్పుడు టచ్‌లో ఉండే వాళ్లం. ఒకరికి ఒకరం మర్యాద ఇచ్చుకునే వాళ్లం. ఒకరి బాగోగులు ఒకరం తెలుసుకునే వాళ్లం’ అని శ్రీనివాసరావు తెలిపారు. అంతేకాక తనతో పాటు పని చేసే జూనియర్ల గురించి సంతోష్‌ ఎంతో శ్రద్ధ తీసుకునేవాడన్నారు.

కోరుకొండ సైనిక్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ అరుణ్‌ కులకర్ణి మాట్లాడుతూ.. ‘పూర్వ విద్యార్థుల కార్యక్రమాల్లో సంతోష్‌ చురుగ్గా పాల్గొనేవాడు. టీచర్లతో కాంటక్ట్‌లో ఉండేవాడు’ అని తెలిపారు. మరో అధికారి మాట్లాడుతూ.. ‘సంతోష్‌ సమస్యలకు భయపడేవాడు కాదు. దేశానికి, తన బెటాలియన్‌కు మంచి చేయాలని తపిస్తుండేవాడు. ఎప్పుడు కంబాట్‌ దుస్తుల్లోనే ఉండేవాడు. ఏ పని అయినా చేస్తాడు.. ఎంత కష్టమైన ఆపరేషన్‌లో అయినా పాల్గొంటాడు. అతడి ముఖం మీద చిరునవ్వు ఎప్పుడు చెరగదు’ అని తెలిపారు. కల్నల్‌ సంతోష్‌ బాబు అంత్యక్రియలు గురువారం ఉదయం సూర్యాపేటలో జరుగనున్నాయి. (చనిపోతున్నా.. చైనాకు చుక్కలు చూపించాడు)

మరిన్ని వార్తలు