కారు అదుపుతప్పి  జవాన్‌ మృతి

10 Jun, 2019 06:52 IST|Sakshi
ఆర్మీజవాన్‌ అంతిమయాత్ర, (ఇన్‌సెట్లో) సోమ రాజశేఖర్‌(ఫైల్‌)

వంగూరు  రూరల్‌: రేయింబవళ్లు విధులు నిర్వహిస్తూ దేశానికి రక్షణ కల్పించిన ఓ జవాన్‌.. భార్య, కుటుంబసభ్యులను కలిసేందుకు స్వస్థలానికి వస్తుండగా రోడ్డు ప్రమాదం రూపంలో అతడిని మృత్యువు కబళించింది. దీంతో ఎన్నో రోజుల తర్వాత ఇంటికి వస్తున్నాడని.. మరెన్నో ఆశలతో ఎదురుచూస్తున్న ఆ కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. అచ్చంపేట పట్టణానికి చెందిన సోమ రాజశేఖర్‌(35) అనే జవాన్‌ ప్రస్తుతం జమ్మూకాశ్మీర్‌లోని ఉదంపూర్‌ దగ్గర్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే, శనివారం విధులు ముగించుకుని సెలవుపై తమ కుటుంబసభ్యులను కలిసేందుకు స్వగ్రామానికి కారులో బయల్దేరాడు.
 
అదుపుతప్పి కారు బోల్తా..
ఈక్రమంలో హైదరాబాద్‌ నుంచి అచ్చంపేటకు కారులో ప్రయాణిస్తుండగా అర్ధరాత్రి రెండు గంటల సమయంలో మండలంలోని సర్వారెడ్డిపల్లి స్టేజీ సమీపంలో కారు అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో సోమరాజశేఖర్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. కారులో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి మహేష్‌ గాయాలపాలయ్యాడు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు హుటాహుటీనా ఘటనాస్థలానికి చేరుకుని మహేష్‌ను వైద్యం నిమిత్తం, సోమరాజశేఖర్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం 108 వాహనంలో కల్వకుర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు.

అచ్చంపేటలో విషాదఛాయలు
ఆర్మీలో జవాన్‌గా విధులు నిర్వహిస్తూ.. రోడ్డు ప్రమాదంలో తమ వాడు మరణించాడని తెలియడంతో ఆ కుటుంబసభ్యులతోపాటు అచ్చంపేటలో విషాదచాయలు అలుముకున్నాయి. స్థానిక జూబ్లీనగర్‌కు చెందిన సోమభారతి, యాదయ్యకు నల్గురు సంతానం ఉండగా.. అందులో అందరికంటే చిన్నవాడు రాజశేఖర్‌(రఘు, చిన్న). 16ఏళ్లుగా ఆర్మీలో వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వర్తించాడు. ప్రస్తుతం జమ్మూకాశ్మీర్‌లోని ఉదంపూర్‌ దగ్గర్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. సెలవు తీసుకుని శనివారం రాత్రి తిరిగి ఇంటికి వస్తుండగా.. వంగూరు మండలం సర్వారెడ్డిపల్లి స్టేజీ వద్ద కారు బోల్తా పడి దుర్మరణం చెందాడు. రాజశేఖర్‌కు ఐదేళ్ల క్రితం అలేఖ్యతో వివాహమైంది. వీరికి సంతానం లేదు. 

ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

రాజశేఖర్‌ మరణ వార్త విని కుటుంబ సభ్యులు, స్నేహితులు కన్నీరుమున్నీరయ్యారు. అందరితో కలిసి ఉండే రాజశేఖర్‌ ఇక లేడని తెలిసి శోకసంద్రంలో మునిగిపోయారు. అచ్చంపేట సమీపంలో రోడ్డు ప్రమాదంలో మృతిచెందడం జీర్ణించుకోలేకపోతున్నారు. మధ్యాహ్నం 3గంటల తర్వాత కల్వకుర్తి ఆసుపత్రి నుండి అచ్చంపేటకు జవాన్‌ మృతదేహాన్ని తీసుకవచ్చారు. ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, గువ్వల అమల, మున్సిపల్‌ ఛైర్మన్‌ తులసీరాం, టీఆర్‌ఎస్‌ నాయకులు, కాంగ్రెస్, బీజేపీ నాయకులు బాలాజీ, వైఎస్సార్‌సీపీ నాయకులు చంద్రశేఖర్,  వీహెచ్‌పీ, బీవీఎస్, రాజశేఖర్‌ స్నేహితులు జవాన్‌ మృతి పట్ల నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. సాయంత్రం జూబ్లీనగర్‌ నుంచి రాజశేఖర్‌ అంతిమయాత్రను నిర్వహించారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. డీఎస్పీ నర్సింహులు, సీఐ రామకృష్ణ, ఎస్‌ఐలు పరుషరామ్, విష్ణు, పలువురు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు