9 నెలల తర్వాత ఇల్లు చేరిన జవాన్‌

14 Apr, 2017 00:23 IST|Sakshi
9 నెలల తర్వాత ఇల్లు చేరిన జవాన్‌

నెక్కొండ(నర్సంపేట): వరంగల్‌రూరల్‌ జిల్లా నెక్కొండ మండలం పెద్దకొర్పోలుకి చెందిన ఆర్మీ జవాన్‌ బండారి రాజు గత  9 నెలల క్రితం ఇంటి నుంచి వెళ్ళిపోగా తన తం డ్రి బండారి వెంకన్న మరణ వార్తను సాక్షి దినపత్రికలో చూసి గురువారం ఇంటికి తిరిగి వచ్చాడు.  తొమ్మిది నెలల క్రితం తన భార్య రవళి, అత్త కలసి తనపై హన్మకొండలోని మహిళా పోలీస్‌స్టేషన్‌లో అక్రమంగా గంజాయి కేసు పెట్టారు. మనస్తాపం చెందిన రాజు ఆర్మీ ఉద్యోగాన్ని సైతం వదిలేసి ముంబైకి వెళ్లిపోయాడు.

దీంతో అప్పటి నుంచి రాజుకు సం బంధించిన సమాచారమూ లేకపోవడంతో వెంకన్న దిగులు తో ఈ నెల 8న మృతి చెందాడు. రాజు తండ్రి సుమారు 5 నెలలపాటు రాజు కోసం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు పలుచోట్ల విచారించినా ఎలాంటి సమాచారమూ లభించలేదు. కాగా, వెంకన్న మృతి చెందినప్పుడు తలకొరివి పెట్టాల్సిన కుమారుడు రాజు ఆచూకీ లేకపోవడంతో కుమార్తె లలిత తలకొరివి పెట్టింది.

 ఈ సమాచారంతో ఈ నెల 9న ‘సాక్షి’మెయిన్‌లో ‘తొమ్మిది నెలలుగా ఆచూకీ లేని ఆర్మీ జవాన్‌’శీర్షికతో వార్త ప్రచురితమైంది. ఈ వార్త క్లిప్పింగ్‌ను రాజు మిత్రులు వాట్సాప్‌లో పెట్టారు. రెండు రోజల క్రితం గమనించిన రాజు గురువారం తెల్లవారుజామున 4 గంటలకు గ్రామానికి చేరుకున్నాడు. వచ్చిన వెంటనే శ్మశాన వాటికకు వెళ్లి తన తండ్రి కాష్టం వద్ద విలపించాడు. తీవ్ర ఆవేదనతో ఉన్న రాజు  కుటుంబసభ్యులతో తప్ప ఎవ్వరితో మాట్లాడలేకపోతున్నాడు. తండ్రి మరణ వార్తను ‘సాక్షి’లో చూసి వచ్చానంటూ చెప్పాడు. రాజును ఇంటికి చేర్చిన ‘సాక్షి’కి అతని కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు