‘ఆరోగ్యలక్ష్మి’ అభాసుపాలు

9 Sep, 2018 12:06 IST|Sakshi
తూప్రాన్‌ అంగన్‌వాడీ కేంద్రంలో భోజనం చేస్తున్న పిల్లలు, గర్భిణులు, బాలింతలు

తూప్రాన్‌ (మెదక్‌): జిల్లాలో గర్భిణులు, బాలంతల సంరక్షణ కోసం ప్రవేవపెట్టిన ఆరోగ్యలక్ష్మి పథకం అభాసుపాలవుతోంది. పేద కుటుంబాల్లోని పిల్లలు, బాలింతలు, గర్భిణుల ఆరోగ్య సంరక్షణ, రక్తహీనత నివారణ కోసం ప్రభుత్వం ఈ పథకం ద్వారా  పౌష్టికాహారం అందజేస్తుంది.  కానీ ప్రస్తుతం ఈ పథకం ద్వారా పంపిణీ చేయాల్సిన పాల సరఫరా నిలిచిపోయింది. ప్రభుత్వం ఐసీడీఎస్‌ ద్వారా ప్రభుత్వం పౌష్టికాహార మాసోత్సవాలు నిర్వహిస్తుంది.  ఈ సమయంలో పాల సరఫరా నిలిచిపోవడంతో బాలింతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాలల్లో ఉండే పుష్కలంగా పౌష్టిక విలువలతో కూడిన పోషక విలువలు అందకుండా పోతున్నాయి.   తూప్రాన్‌ మండలంలో  పది రోజులుగా అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా కావల్సిన పాలు  అందడం లేదు. ఏజెంట్‌ నిర్వాకం వల్లనే ఈ పరిస్థితి నెలకొందని ఐసీడీఎస్‌ అధికారులు పేర్కొంటున్నారు. నర్సాపూర్‌ ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలో తూప్రాన్, మనోహరాబాద్, నర్సాపూర్, కౌడిపల్లి, శివ్వంపేట, చిలిపిచెడ్‌ మండలాలు ఉన్నాయి.  ఈ ప్రాజెక్టు పరిధిలో గర్భిణులు 1,817, బాలింతలు 1,835 ఏడు నెలల నుంచి సంవత్సరం లోపు పిల్లలు 1,862, సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల పిల్లలు 5,991, మూడు సంత్సరాల నుంచి ఆరు సంవత్సరాలలోపు పిల్లలు 6,655 మంది ఉన్నారు. 

కేవలం అన్నం మాత్రమే..
ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా గర్భిణులకు, బాలింతలకు 200 మిల్లీలీటర్ల పాలు, 150గ్రాముల అన్నం, రోజుకు ఒక గుడ్డు వడ్డించాలని నిర్ణయించారు.  కొన్ని రోజులుగా పాలు లేకుండానే గర్భిణీలకు, బాలింతలకు, చిన్నారులకు భోజనాన్ని అందిస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే గర్భిణులు, బాలింతలు అంగన్‌వాడీ టీచర్లను అడిగితే పైనుంచే సరఫరా కావడం లేదని తమ చేతుల్లో లేదని తెగేసి చెబుతున్నారని వారు వాపోతున్నారు. దీంతో కేవలం అన్నం మాత్రమే తిని ఇళ్లకు  వెల్లిపోతున్నారు.  ప్రభుత్వం మాత్రం ఐసీడీఎస్‌ ద్వారా పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని ఊదరగొడుతూ ఇటీవల పౌష్టికాహార వారోత్సవాలు, మాసోత్సవాలు నిర్వహిస్తుంది. కానీ క్షేత్రస్థాయిలో అర్హులైన వారికి  పౌష్టికాహారం అందకుండా పోవడంలో అధికారులు వైఫల్యం చెందారన్న విషయం ఈ సంఘటనను బట్టిచూస్తే స్పష్టమవుతుంది.

ఇప్పటికైనా   ఉన్నతాధికారులు స్పందించి అంగన్‌వాడీ కేంద్రాలకు సకాలంలో పౌష్టిక విలువలు కలిగిన ఆహార పదార్థాలతోపాటు పాలు సరఫరా అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.  ప్రభుత్వం  అంగన్‌వాడీ కేంద్రాలకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని చెబుతున్నప్పటికీ అది క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు.  పలు చోట్ల అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు, బాలింతలకు, గర్భిణులకు దొడ్డు బియ్యమే  పంపిణీ చేస్తున్నారు. దీంతో దొడ్డు బియ్యం తినేందుకు వారు ఇబ్బందులు పడుతున్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత  అంగన్‌వాడీ కేంద్రాల్లోనే భోజనం చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం  కేంద్రాల్లోనే గర్భిణులకు, బాలింతలకు భోజనం వడ్డించాలి. కానీ దొడ్డుబియ్యంతో అన్నం తినేవారు లేక కేవలం పాలు,గుడ్లు మాత్రమే ఇళ్లల్లోకి తీసుకెళ్తున్నట్లు సమాచారం.  కొన్ని కేంద్రాల్లో దొడ్డుబియ్యం తమకు జీర్ణం కాదంటూ కేంద్రాలకే  రావడం లేదు. ఇది కేవలం తూప్రాన్‌ మండలంలోనే కాదు జిల్లా వ్యాప్తంగా ఇదే తంతు కొనసాగుతోంది. 

అధికారులు పట్టించుకోవడం లేదు 
అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా  గర్భిణులకు, బాలింతలకు ప్రతిరోజు గ్లాసు పాలు ఇవ్వాలి. కానీ పాలు ఇవ్వడం లేదు. పౌష్టికాహారం అందిస్తున్నామని చెబుతున్నారు. కానీ మాకు మాత్రం అందడం లేదు. అధికారులు వెంటనే స్పందించి తమకు పాలు అందేలా చూడాలి. ఈ విషయమై అధికారులు పట్టించు కోవడం లేదు.  –రోజా, బాలింత

పది రోజుల నుంచి పాలు ఇవ్వడం లేదు 
పదిరోజుల నుంచి  అంగన్‌వాడీ కేంద్రంలో పాలు ఇవ్వడం లేదు. కేవలం భోజనం, గుడ్లు మాత్రమే ఇస్తున్నారు. ఇదేమిటని అడిగితే పైనుంచి పాలు రావడం లేదని చెబుతున్నారు. పాలు కొనుగోలు చేయలేని మాలాంటి వారికి వెంటనే పాలు అందజేయాలి.  –ఆకుల కృప

ఏజెన్సీ నిర్వాకం వల్లే.. 
అంగన్‌వాడీ కేంద్రాలకు టెండర్ల ద్వారా  ‘నేహా’ అనే సంస్థ  కేంద్రాలకు పాలు సరఫరా చేస్తుంది. తూప్రాన్‌ మండలంలో కొన్ని రోజులుగా పాలు సరఫరా కావడం లేదని అంగన్‌వాడీ టీచర్లు మా దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే  ఈ కేంద్రాలు పాలు సరఫరా అయ్యేలా  చర్యలు తీసుకుంటాం. –కనకదుర్గ, ఐసీడీఎస్‌ సీడీపీఓ, నర్సాపూర్‌

మరిన్ని వార్తలు