పోశయ్యకు వైద్యం చేయిస్తాం

14 Apr, 2018 11:43 IST|Sakshi
పోశయ్యను వివరాలు అడిగి తెలుసుకుంటున్న ఆరోగ్యశ్రీ జిల్లా టీం లీడర్‌ గణేశ్, అంగ్రాజ్‌పల్లి ఆరోగ్యమిత్ర సరిత

ఆరోగ్యశ్రీ అధికారుల హామీ

బాధితుడికి పరామర్శ

చెన్నూర్‌రూరల్‌: కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న నిరుపేదకు ఆరోగ్యశ్రీ అండ లభించింది. మండలంలోని దుగ్నెపల్లి పంచాయతీ పరిధి వెంకంపేట గ్రామానికి చెందిన జాడి పోశయ్య గత కొద్ది రోజులుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. వైద్యానికి ఇప్పటికే రూ.8లక్షల వరకు ఖర్చయ్యాయి. మెరుగైన వైద్యం చేయించుకునేందుకు చేతిలో చిల్లిగవ్వ లేక ఇబ్బందులు పడుతున్నాడు. ఈ విషయం తెలిసిన ‘సాక్షి’ పోశయ్య దీనస్థితిని వెలుగులోకి తీసుకొచ్చింది. ‘గుడిసె నీడన బతుకు.. గుండె నిండా బాధ’ శీర్షికన శుక్రవారం జిల్లా పేజీలో మానవీయ కథనాన్ని ప్రచురించింది.

దీనికి ఆరోగ్యశ్రీ జిల్లా అధికారులు స్పందించారు. ఆరోగ్యశ్రీ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ పవన్‌కుమార్‌ ఆదేశాల మేరకు జిల్లా టీం లీడర్‌ మాచర్ల గణేశ్, అంగ్రాజ్‌పల్లి పీహెచ్‌సీ ఆరోగ్యమిత్ర సరిత శుక్రవారం వెంకంపేట గ్రామానికి వెళ్లి పోశయ్యను పరామర్శించారు. అతడి ఆరోగ్య పరిస్థితి, కుటుంబ పరిస్థితులను గురించి అడిగి తెలుసుకున్నారు. పోశయ్యకు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్యం చేయిస్తామని హామీ ఇచ్చారు. కరీంనగర్‌ లేదా హైదరాబాద్‌ ఆసుపత్రికి రావాలని పోశయ్యకు సూచించారు. వైద్యం ఉచితంగా అందించినా ఇతర ఖర్చుల కోసం పోశయ్య దాతల సాయం కోరుతున్నాడు. 

మరిన్ని వార్తలు