చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు

4 Jun, 2018 08:47 IST|Sakshi
చేప మందు వేస్తున్న బత్తిని(ఫైల్‌)

ఈ నెల 8,9 తేదీల్లో పంపిణీ

చార్మినార్‌ : మృగశిర కార్తె సందర్భంగా ఏటా బత్తిని సోదరులు అస్తమా రోగులకు ఇచ్చే చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 8వ తేదీ ఉదయం 8.30 నుంచి 9వ తేదీ ఉదయం 8 గంటల వరకు ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో ప్రసాదం అందిస్తామని బత్తిని హరినాథ్‌గౌడ్‌ తెలిపారు.

చేప ప్రసాదం తయారీలో భాగంగా ఈ నెల 7న ఉదయం 11 గంటలకు దూద్‌బౌలిలోని తమ స్వగృహంలో సత్యనారాయణ వ్రతం, బావి పూజ ఉంటాయని, 8వ తేదీ ఉదయం 6 గంటలకు దూద్‌బౌలిలోని తమ స్వగృహంలో కుటుంబ సభ్యులంతా చేప ప్రసాదం తీసుకున్న అనంతరం ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో పంపిణీ జరుగుతుందన్నారు.

170 ఏళ్ల చరిత్ర.. 

ఏటా ఆస్తమా రోగులకు పంపిణీ చేసే చేప ప్రసాదానికి 170 ఏళ్ల చరిత్ర ఉంది. బత్తిని వీరన్న గౌడ్, శివరాంగౌడ్‌ నుంచి ఈ ప్రసాదం పంపిణీ కొనసాగుతోంది. వీరి మూడో తరమైన శంకరయ్య గౌడ్‌ హయాంలో పంపిణీ బాగా ప్రాచుర్యం పొందింది.

శంకరయ్యగౌడ్‌కు శివరాంగౌడ్, సోమలింగం గౌడ్, విశ్వనాథం గౌడ్, హరినాథ్‌గౌడ్, ఉమామహేశ్వర్‌ గౌడ్‌ ఐదుగురు కుమారులు. ప్రస్తుతం వీరిలో శివరాంగౌడ్, సోమలింగం గౌడ్, ఉమామహేశ్వర్‌ గౌడ్‌ మృతి చెందారు. మిగతా ఇద్దరూ ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. 
 

మరిన్ని వార్తలు