పంచాయతీ పోలింగ్‌ 

15 Dec, 2018 08:42 IST|Sakshi
ఏర్పాట్లను సమీక్షిస్తున్న ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్‌ కుమార్‌, డీపీఓ కృష్ణ మూర్తి

ఎన్నికల సంఘానికి కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు ప్రతిపాదన

ఈసారి పంచాయతీ ఎన్నికల్లోనూ ‘నోటా’

జనవరిలో ఎన్నికల నోటిఫికేషన్‌..? 

ఎన్నికల ఏర్పాట్లపై ఆరా తీసిన ఈసీ

జిల్లాలో పర్యటించిన రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి

జిల్లాలో ఉన్న మూడు రెవెన్యూ డివిజన్ల వారీగా గ్రామ పంచా యతీ ఎన్నికలు జరపాలని జిల్లా అధికార యంత్రాంగం భావిస్తోంది. ఇప్పటికే గ్రామాల్లో బీసీ ఓటర్ల గణన జరుగుతోంది. ప్రస్తుతం గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. ఈనెల 15 లోపు ఈ ప్రక్రియ పూర్తి కానుంది. అధికారులకు మరోమారు ఎన్నికల నిర్వహణపై శిక్షణ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్‌ ఎం రామ్మోహన్‌ రావు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపారు. ఈ ఎన్నికల్లోనూ నోటా ఏర్పాటు చేయనున్నారు.

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌ : జిల్లాలో మూడు విడతలుగా గ్రామ పంచాయతీ పోలింగ్‌ నిర్వహించాలని జిల్లా అధికార యంత్రాంగం నిర్ణయించింది. అధికారులు, సిబ్బంది, పోలీసు బందోబస్తు వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని జిల్లాలో ఉన్న మూడు రెవెన్యూ డివిజన్ల వారీగా గ్రామ పంచాయతీ పోలింగ్‌ జరపాలని భావిస్తోంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ ఎం రామ్మోహన్‌ రావు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్‌ రెవెన్యూ డివిజన్ల పరిధిలోని గ్రామ పంచాయతీల్లో ఒక్కో రోజు పోలింగ్‌ జరిగే అవకాశాలున్నాయి.

గ్రామ పంచాయతీలకు మూడు నెలల్లో పోలింగ్‌ నిర్వహించాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశించిన విషయం విదితమే. ఇప్పటికే గ్రామాల్లో బీసీ ఓటర్ల గణన జరుగుతోంది. ప్రస్తుతం గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. ఈనెల 15 లోపు ఈ ప్రక్రియ పూర్తి కానుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ నోటా (నన్‌ ఆఫ్‌ ది ఎబోవ్‌)ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. గత ఎన్నికల్లో ఈ నోటా అమలులో లేదు. ఈసారి  కొత్త నిబంధనను ఎన్నికల సంఘం అమలు చేస్తోంది.  

అసెంబ్లీ ఎన్నికల బదిలీలతో... 
ఈ ఏడాది మే, జూన్‌ మాసంలోనే జిల్లా అధికార యంత్రాంగం ఈ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించింది. ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి ఇప్పటికే రెండు పర్యాయాలు శిక్షణ కూడా ఇచ్చారు. ఈలోగా అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని చాలా మంది అధికారులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు జరిగాయి. స్థాయిని బట్టి ఇతర జిల్లాలకు, మండలాలకు బదిలీపై వెళ్లిపోయారు. వారి స్థానంలో ఇతర జిల్లాలకు చెందిన అధికారులు, ఇతర మండలాలకు చెందిన అధికారులు బదిలీపై జిల్లాకు వచ్చారు. దీంతో బదిలీపై వచ్చిన అధికారులకు మరోమారు ఎన్నికల నిర్వహణపై శిక్షణ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

ఏర్పాట్లపై ఈసీ ఆరా.. 
గ్రామ పంచాయతీ ఎన్నికలకు జనవరిలో నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశాలుండటంతో అధికార యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. పోలింగ్‌ నిర్వహణ అధికారులు, సిబ్బందికి శిక్షణ, బ్యాలెట్‌ బాక్సుల తరలింపు, బ్యాలెట్‌ పేపర్ల ముద్రణ వంటి ఏర్పాట్లు గతంలోనే పూర్తి చేశారు. ఈలోగా అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం విదితమే. తాజాగా ఈ ఏర్పాట్లు సవ్యంగా ఉన్నాయా అనే అంశంపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఆరా తీసింది. ఈ మేరకు ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్‌కుమార్‌ శుక్రవారం జిల్లాలో పర్యటించారు. జిల్లా పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి డీపీఓ కృష్ణమూరి ద్వారా ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు.  

రెండు స్థాయిల్లో రిటర్నింగ్‌ అధికారులు.. 
గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా స్టేజ్‌–1లో ఒకరు, స్టేజ్‌–2లో మరొకరు రిటర్నింగ్‌ అధికారులను నియమిస్తున్నారు. నాలుగు, ఐదు గ్రామ పంచాయతీలకు కలిపి స్టేజ్‌–1 రిటర్నింగ్‌ అధికారి ఉంటారు. ఆయా గ్రామపంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయడం.. నామినేషన్లు స్వీకరణ.. పరిశీలన.. ఉపసంహరణ.. బరిలోఉండే అభ్యర్థుల తుది జాబితా.. గుర్తుల కేటాయింపు.. వంటి బాధ్యతలు స్టేజ్‌–1 అధికారులు నిర్వర్తిస్తారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి, ఫలితాల ప్రకటన వంటి అంశాలు స్టేజ్‌–2 రిటర్నింగ్‌ అధికారుల పరిధిలో ఉంటాయి.

ఏర్పాట్లను పరిశీలిస్తున్నాం 
గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను పరిశీలిస్తున్నాము. బ్యాలెట్‌ పేపర్ల ముద్రణ, బ్యాలెట్‌ బాక్సుల రవాణ, పోలింగ్‌ విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బంది గుర్తింపు.. పోలింగ్‌ నిర్వహణపై అధికారులు, సిబ్బందికి శిక్షణ వంటి అంశాలను పరిశీలిస్తున్నాము. ప్రస్తుతం బీసీ ఓటర్ల గణన కొనసాగుతోంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశాలున్నాయి. 
- అశోక్‌ కుమార్, రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి 

మరిన్ని వార్తలు