మావోయిస్టు పార్టీ సానుభూతిపరుల అరెస్ట్‌

21 Mar, 2019 12:06 IST|Sakshi
నిందితులను చూపుతున్న ఎస్‌ఐ బాలకృష్ణ   

సాక్షి, పర్ణశాల: మావోయిస్టు పార్టీకి పేలుడు పదార్థాలను సరఫరా చేస్తున్న సానుభూతిపరులైన ఏడుగురిని బుధవారం అరెస్ట్‌ చేసి, కోర్టుకు అప్పగించినట్టు ఎస్‌ఐ.బాలకృష్ణ తెలిపారు. ఆయన వెల్లడించిన వివరాలు...     మండలంలోని చిన్ననల్లబల్లి గ్రామ శివారులోని తాటివారిగూడెం వెళ్లే దారి మధ్యన ఆటోలో ఏడుగురు వెళుతున్నారు. వారు అనుమానాస్పదంగా తిరుగుతున్నారన్న సమాచారంతో సీఆర్‌పీఎఫ్‌ బలగాలతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. తమను చూసి ఆటోలో పారిపోతున్న ఆ ఏడుగురిని పోలీసులు వెంబడించి అదుపులోకి తీసుకుని విచారించారు. వీరిని, దుమ్ముగూడెం మండలంలోని దబ్బనూతల గ్రామస్తులు సొందె రవి, కుర్సం మురళి, తెల్లం నాగరాజు, బూర్గంపాడు మండలం వుడ్‌ యార్డ్‌ లక్ష్మీపురం గ్రామస్తుడు ఊకం శ్రీను, ఏపీలోని చింతూరు మండలం పోతనపల్లి గ్రామస్తుడు మడకం చిన్నబాబు, పాల్వంచ మండలం తోగ్గూడెం గ్రామస్తుడు బిందాని దమన్‌ అలియాస్‌ ధర్మ, ములకలపల్లి మండలం ఆనందపురం గ్రామస్తుడు కొండ్రు జగదీష్‌గా గుర్తించారు.

వీరి నుంచి పేలుడు పదార్థాలను స్వాధీనపర్చుకున్నారు. పాల్వంచ మండలంలోని తోగ్గూడెం, బూర్గంపాడు మండలంలోని లక్ష్మీపురం నుంచి మావోయిస్టులకు వీటిని సరఫరా చేస్తున్నట్టుగా వారు అంగీకరించారు. వీరి నుంచి పది ఎక్స్‌పోసివ్‌ బూస్టర్లు, పది ఎలక్ట్రానిక్‌ డిటొనేటర్లు, 300 మీటర్ల డీఎఫ్‌ వైర్, ఆటో (టీఎస్‌28 టీ0208) స్వాధీనపర్చుకున్నారు. కేసు నమోదు చేశారు. వారిని ఖమ్మం కోర్టుకు అప్పగించారు. కేసును చర్ల సీఐ సత్యనారాయణ దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు