పరకాల నగర పంచాయతీ కమిషనర్‌కు అరెస్ట్‌ వారెంట్‌

23 Sep, 2017 13:29 IST|Sakshi

సంతల వేలం పాటల అవకతవకలపై     

2013లో లోకయుక్త కేసు

సంజాయిషీ ఇవ్వకపోవడంతో చర్యలు

25న కోర్టులో పర్చాలని పోలీసులకు ఆదేశాలు

పరకాల : సంతల వేలంలో అవకతవకాలపై విచారణకు హాజరు కాకపోవడంతో వరంగల్‌ రూరల్‌ జిల్లా పరకాల నగర పంచాయతీ కమిషనర్‌ తాళ్లపెల్లి రాజేశ్వర్‌కు లోకయుక్త కోర్టు అరెస్ట్‌ వారెంట్‌ జారీచేసింది. ప్రస్తుత పరకాల మేజర్‌ గ్రామ పంచాయతీగా ఉన్న సమయంలో పశువుల, గొర్రెలు, మేకలు, కూరగాయాల సంతల(2009–2010 సంవత్సరం) టెండర్ల ప్రక్రియలో అవకతవకలు, నిబంధనలకు విరుద్ధంగా వేలం పాట డబ్బుల వసూళ్లపై తెలుగు రైతు సంఘం నాయకులు కొలుగూరి రాజేశ్వర్‌రావు జిల్లా అధికారులు, కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదు. దీంతో ఆయన 2013లో లోకయుక్తను ఆశ్రయించారు. అప్పటి నుంచి విచారణ జరుగుతోంది.

వేలం పాట నిబంధనలు పాటిస్తే రూ.32లక్షలు సంబంధిత కాంట్రాక్టర్లు చెల్లించేవారు.. అధికారులు కాంట్రాక్టర్‌లతో కుమ్ముకై కేవలం రూ.9లక్షలు వసూలు చేసి పంచాయతీకి దక్కాల్సిన రూ.22లక్షలు దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలొచ్చాయి. ఈ వ్యవహారంలో అప్పటి కలెక్టర్‌ తన సంజాయిషీ ఇచ్చుకుని విచారణ నుంచి తప్పుకోగా డీపీఓ, నగర పంచాయతీ అధికారులు హాజరుకాకపోగా సంజాయిషీ ఇవ్వలేదు. దీంతో నగర పంచాయతీ కమిషనర్‌ అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. ఈనెల 25న కోర్టు ముందు హాజరుపర్చాలని జిల్లా పోలీసు అధికారులను ఆదేశించింది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వారిని శిక్షించాల్సిందేనని రాజేశ్వర్‌రావుతో పాటు తెలుగు రైతు సంఘం నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు