హమ్మయ్య.. హమాలీలొచ్చారు

9 May, 2020 04:33 IST|Sakshi

రాష్ట్రంలోని రైస్‌మిల్లుల్లో పనిచేసేందుకు తొలి విడతగా బిహార్‌ నుంచి 300 మంది రాక

లింగంపల్లి రైల్వే స్టేషన్‌లో స్వాగతం పలికిన మంత్రి గంగుల, చైర్మన్‌ మారెడ్డి, పల్లా

సాక్షి, హైదరాబాద్‌: ధాన్యం కొనుగోళ్లు జోరుగా సాగుతున్న తరుణంలో రాష్ట్రంలో పనిచేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి హమాలీల రాక మొదలైంది.ప్రస్తుతం వారి కొరతతో అల్లాడుతున్న రైతులకు ఇది పెద్ద ఊరటగా భావించాలి.ఇలా రాష్ట్రంలోని రైస్‌ మిల్లుల్లో పనిచేయడానికి బీహార్‌లోని ఖగారియా జిల్లా నుంచి దాదాపు 300 మంది హమాలీలు శుక్రవారం ప్రత్యేక రైలులో హైదరాబాద్‌ చేరుకున్నారు. పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి, రైతు సమన్వయ సమితి చైర్మన్‌ పల్లా రాజేశ్వరరెడ్డి హమాలీలకు పూలతో స్వాగతం పలికారు. పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ పి.సత్యనారాయణ రెడ్డి. ఫైనాన్స్‌ సెక్రటరీ కమిషనర్‌ సందీప్‌ కుమార్‌ సుల్తానియా, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్, రంగారెడ్డి కలెక్టర్‌ అమోయ్‌ కుమార్‌లు హమాలీలకు కోవిడ్‌ వైద్య పరీక్షలు, రవాణాను పర్యవేక్షించారు.

రైస్‌మిల్లుల్లో వారి పాత్ర కీలకం...
ఈ యాసంగిలో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసేందుకు 7వేలకు పైగా కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే, కరోనా వల్ల హమాలీల సమస్య ఏర్పడింది. రాష్ట్రంలోని రైస్‌ మిల్లుల్లో అధిక శాతం బీహార్‌ నుంచి వచ్చిన హమాలీలే పనిచేస్తున్నారు. హోళీ పండుగకు వారు తమ స్వరాష్టానికి వెళ్లిపోయారు. ప్రయాణ సమయంలో లౌక్‌డౌన్‌ కావడం తో అక్కడే చిక్కుకుపోయారు. దీంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో, రైస్‌మిల్లుల్లో లోడింగ్, అన్‌లోడింగ్‌ సమస్య లు ఏర్పడ్డాయి.

హమాలీల కొరతతో ఎఫ్సీఐ కస్టం మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌)ను అప్పగిం చడానికి ఆటంకాలు ఏర్పడు తున్నాయి. దీంతో ప్రభుత్వం బిహార్‌ ప్రభుత్వానికి లేఖ రాసింది. బిహార్‌ నుంచి వచ్చేందుకు సిద్ధంగా ఉన్న జాబితాను రాష్ట్ర రైస్‌ మిల్లర్ల అసోసియేషన్, జిల్లా అసోసియేషన్‌ పౌరసరఫరాల సంస్థ అధికారులు బిహార్‌ ప్రభుత్వానికి అందించారు. తెలంగాణకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్న హామాలీలను పంపేందుకు బిహార్‌ ప్రభుత్వం ఓకే చెప్పడంతో తొలి విడతలో బీహార్‌ నుంచి హమాలీలు రైలులో లింగంపల్లి రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. అనంతరం వారిని జిల్లాల రైస్‌ మిల్లుల్లో పనిచేయడానికి ఒక్కో ఆర్టీసీ బస్సులో 20 మంది వంతున తరలించారు.

మరిన్ని వార్తలు