సంస్మ‘రణం’

20 Jul, 2020 01:42 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ ‌: రెండువారాలుగా మన్నెంలో అలజడి మొదలైంది. మావోల రాక, పోలీసుల వేటతో ఏజెన్సీలో ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కమిటీ పేరుతో కొత్త దళం తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు రాష్ట్రంలో నక్సలైట్లకు వ్యతిరేకంగా గ్రీన్‌ టైగర్స్, కోబ్రా తదితర పేర్లతో కొన్ని దళాలు ఉండేవి. నక్సలైట్ల సానుభూతి పరులు, ప్రజాసంఘాలు, పౌరహక్కుల నేతలు లక్ష్యంగా పనిచేసేవి. ఇపుడు దాదాపు రెండు దశాబ్దాల తరువాత రాష్ట్రంలో తిరిగి అలాంటి పరిస్థితులే పునరావృతమవుతుండటం గమనార్హం. దీంతో ఏజెన్సీలోని గిరిజనులు, ఆదివాసీలు భయాందోళనలో గడుపుతున్నారు. నిత్యం మావోయిస్టులు, వారి వెనక కూంబింగ్‌ దళాల బూట్ల చప్పుళ్లతో భయభయంగా గడుపుతున్నారు. 

అప్పుడలా..ఇప్పుడిలా..!
దండకారణ్యంలో జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను మావోయిస్టులు ఈసారి మునుపెన్నడూ లేని స్థాయిలో పెద్ద ఎత్తున నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారన్న సమాచారం నిఘా వర్గాల వద్ద ఉంది. ఇందుకోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల మావో అగ్రనేతలు, మిలీషియా సభ్యులు హాజరవుతున్నారు. ఈ సమావేశానికి సంబంధించి తాజాగా విడుదలైన లేఖ కలకలం రేపుతోంది. దండకారణ్య ప్రత్యేక మండల కమిటీ కార్యదర్శి రామన్న అనారోగ్యకారణాలతో గతేడాది మరణించారు.

ఈయన స్థానాన్ని ఇంతవరకు భర్తీ చేయలేదు. ఈసారి వార్షికోత్సవాల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్న నేపథ్యంలో రామన్న స్థానంలోకి కొత్త వ్యక్తి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు వివిధ రాష్ట్రాల్లో ఎన్‌కౌంటర్లలో మరణించిన మావోయిస్టు సభ్యుల మరణాలకు ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ కూడా చేశారు. అందుకే కీలకమైన ఈ సమావేశాలను విజయవంతం చేసేందుకు కావాల్సిన నిధులు, కొత్తవారి రిక్రూట్‌మెంట్‌ కోసం ఈసారి తెలంగాణలోకి మావోయిస్టులు అడుగుపెట్టారు. లాక్‌డౌన్‌ కాలంలో పోలీసులు కోవిడ్‌ విధుల్లో ఉండగా.. మావోయిస్టు యాక్షన్‌ టీం సభ్యులు జనారణ్యంలోకి వచ్చారు. అందులో భాగంగానే బెదరింపులు, వసూళ్లు, రిక్రూట్‌మెంట్‌ యత్నాలు చాపకింద నీరులా చేసుకుంటూ పోతున్నారు. 

ఎట్టి పరిస్థితుల్లో ఆటలు సాగనివ్వం..
తెలంగాణలో పదేళ్లుగా పెద్దగా మావోయిస్టుల కదలికలు లేవు. అలాంటిది లాక్‌డౌన్‌ కాలంలో పుంజుకోవడంపై హోంశాఖ సీరియస్‌గా పరిగణిస్తోంది. ఆసిఫాబాద్‌లో భాస్కర్‌ దళం సంచారంతో అప్రమత్తమైన పోలీసులు వారి కోసం అడవిని జల్లెడ పడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారి అరాచకాలు ఇక్కడ సాగనిచ్చేది లేదని ఇప్పటికే పలుమార్లు డీజీపీ మహేందర్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఆసిఫాబాద్‌ జిల్లా తిర్యాణి మండటం మంగ్లి, ములుగు జిల్లాల అటవీ ప్రాంతాల్లో స్వయంగా ఆయనే కూంబింగ్‌ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ మరో కారణం కూడా చెప్పుకోవాలి. పదేళ్ల నుంచి రాష్ట్రంలో చెప్పుకోదగ్గ స్థాయిలో మావోల కార్యకలాపాలు లేవు. అదే సమయంలో స్పెషల్‌పార్టీ, గ్రేహౌండ్స్‌ పోలీసుల్లో కొత్తగా చేరిన అధికారుల్లో మెజారిటీ మంది సుశిక్షితులేగానీ... వారికి ఎన్‌కౌంటర్లు ఎదుర్కొన్న అనుభవం లేదు. అందుకే, వారిలో ఉత్సాహం నింపి, మావోయిస్టులను తరిమికొట్టాలన్న వ్యూహంతో పోలీసు బాసు పర్యటనలు చేస్తున్నారని సమాచారం.

మరిన్ని వార్తలు