నైరుతి రుతుపవనాల రాక.. కాస్త ఆలస్యం

6 Jun, 2019 02:26 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కేరళలోకి నేటికి బదులు 8న వచ్చే అవకాశం

తెలంగాణలోకి 11న రావాల్సి ఉండగా, రెండ్రోజులు ఆలస్యం

సాక్షి, హైదరాబాద్‌: నైరుతి రుతుపవనాల రాక కాస్తంత ఆలస్యం అయ్యే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ వై.కె.రెడ్డి వెల్లడించారు. కేరళలోకి గురువారం (నేడు) రుతుపవనాలు ప్రవేశిస్తాయని ఇటీవల ప్రకటించగా, ఇప్పుడు 8వ తేదీన వచ్చే అవకాశముందని ఆయన తెలిపారు. అలాగే తెలంగాణలోకి ఈ నెల 11న వస్తాయని ఇటీవల అంచనా వేయగా, ఇప్పుడు 13వ తేదీన రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశముందని ఆయన వివరించారు. అయితే ఈ తేదీలకు రెండ్రోజులు అటూ ఇటూ తేడా ఉండొచ్చని పేర్కొన్నారు.

వాస్తవంగా గతేడాదితో పోలిస్తే ఈసారి రుతుపవనాలు ఆలస్యమవుతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం గత నెల వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఆలస్యం కావడం పట్ల రైతుల్లో ఆందోళన మొదలైంది. గతేడాది నైరుతి రుతుపవనాలు మే 29వ తేదీనే కేరళను తాకాయి. ఆ తర్వాత జూన్‌ 8న తెలంగాణలోకి ప్రవేశించాయి.  

మరిన్ని వార్తలు