విద్యుత్ శాఖలో ‘371 డీ’

9 Feb, 2015 01:32 IST|Sakshi
విద్యుత్ శాఖలో ‘371 డీ’

కొలువుల భర్తీలో ‘స్థానికులకు’ రిజర్వేషన్లు

  •   స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరిన ట్రాన్స్‌కో, జెన్‌కోలు
  •   కేటీపీపీ-2, కేటీపీఎస్-7, మణుగూరు ప్రాజెక్టుల్లో కొత్త పోస్టులపై కసరత్తు

 సాక్షి, హైదరాబాద్: ఉద్యోగాల నియామకాల్లో స్థానిక రిజర్వేషన్ల కోసం ‘371 డీ’ అధికరణ అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థలు భావిస్తున్నాయి. విద్యుత్ సంస్థల్లో ఈ రాజ్యాంగ అధికరణ అమలుపై స్పష్టత ఇవ్వాలని తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్‌కో సంస్థలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాయి. ఉమ్మడి రాష్ట్ర విద్యుత్ సంస్థల్లోని ఉద్యోగాల నియామకాల్లో 2004కు పూర్వం స్థానిక రిజర్వేషన్లు లేవు. అన్ని పోస్టులూ ఓపెన్ కోటాలోనే భర్తీ చేసేవారు. 2004లో విద్యుత్ సంస్థల్లో  ‘371 డీ’ అమలుకు నాటి ప్రభుత్వం ప్రయత్నించినప్పటికీ, కార్పొరేషన్లకు 371 డీ అధికరణ వర్తించదని న్యాయ నిపుణులు సలహా ఇవ్వడంతో అది సాధ్యం కాలేదు. ఆ తరువాత రాష్ర్టపతి ఉత్తర్వులతో ొన్ని కేడర్ పోస్టుల భర్తీలో స్థానిక రిజర్వేషన్లు అమలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో ఎక్కడి ఉద్యోగాలను అక్కడి వారి తోనే భర్తీ చేసేందుకు ‘స్థానిక’ రిజర్వేషన్లను పక్కాగా అమలు చేయాలని జెన్‌కో, ట్రాన్స్‌కో సంస్థలు సంకల్పించాయి. అలాగే విద్యుత్ సంస్థల్లోని ఖాళీలతో పాటు కొత్త ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణ అవసరాల కోసం భారీ సంఖ్యలో కొత్త పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. ఈ క్రమంలో ఉద్యోగుల నియామకాల్లో తమ సంస్థల్లో ‘371డీ’ అమలుపై స్పష్టత కోరుతూ ట్రాన్స్‌కో, జెన్‌కోలు తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట విభజన చట్టం సైతం 371డీ అమలుకు వెసులుబాటు కల్పిస్తోంది. ఈ అంశంపై సానుకూల స్పందన వస్తే విద్యుత్ సంస్థలు చేపట్టే డెరైక్ట్ రిక్రూట్‌మెంట్లలో 80 శాతం పోస్టులను లోకల్, మిగిలిన 20 శాతం పోస్టులను ఓపెన్ కోటా కింద భర్తీ చేస్తారు.
 వెయ్యి పోస్టుల భర్తీకి జెన్‌కో సన్నాహాలు
 రాష్ట్రంలో కొత్త విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి టీ సర్కార్ సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణ కోసం వెయ్యి కొత్త పోస్టుల భర్తీకి జెన్‌కో చర్యలు ప్రారంభిం చింది. కాకతీయ థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు (కేటీపీపీ) స్టేజ్-2నిర్వహణ, అమలుతో పాటు కొత్తగూడెం థర్మల్ విద్యుత్ ప్రాజె క్టు (కేటీపీఎస్)స్టేజ్-7, మణుగూరు ప్రాజెక్టుల నిర్మాణానికి కావాల్సిన సాంకేతిక, సాంకేతికేతర సిబ్బంది లెక్కలను తేల్చేం దుకు జెన్‌కో కసరత్తు ప్రారంభించింది. లెక్కలు తేలాక ఆయా పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కోరనుంది.
 

>
మరిన్ని వార్తలు