గుట్టల వరదతో ‘నీలగిరి’కి ముప్పు!

20 Sep, 2019 08:41 IST|Sakshi
బ్రహ్మంగారి గుట్టపైనుంచి కిందకు వస్తున్న వర్షపు నీరు

పై వరదంతా పట్టణంలోకే..

ఆ ఉధృతికి లోతట్టు ప్రాంతాలు జలమయం, ఆస్తినష్టం

రెండు గుట్టల చుట్టూ కాల్వలు నిర్మిస్తేనే శాశ్వత పరిష్కారం

2013లోనే తెరపైకి వచ్చిన ప్రతిపాదనలు

అమలుకు నోచుకోని నేతల హామీలు

నల్లగొండ టూటౌన్‌ : నీలగిరి పట్టణం రోజురోజుకూ భారీగా విస్తరిస్తోంది. అందుకు తగ్గట్టు వసతులు లేకపోవడంతో భారీ వర్షాలు వచ్చిన ప్రతిసారీ నష్టం చవిచూడాల్సి వస్తోంది. గతంలోనే కురిసిన భారీ వర్షాలకు నీలగిరి పట్టణం అతలాకుతలమైన విషయం తెలిసిందే. అప్పుడు మూడు నాలుగు రోజులు భారీ వర్షాలు పడడంతో పట్టణంలోని రోడ్లన్నీ నదులను తలపించాయి. ఏ రోడ్డు చూసినా మోకాల్లోతుపైనే వరద నీరు పారిన విషయం ఇంకా అందరి కళ్లలో మెలుగుతూనే ఉంది. నీలగిరి పట్టణాన్ని వరదలు ముంచెత్తటానికి ప్రధాన కారణం పట్టణంలో ఉన్న రెండు గుట్టలు. కుండపోతగా వర్షం వచ్చినా, మూడు నాలుగు రోజులు వర్షాలు పడినా గుట్టలపై నుంచి వరద నీరు భారీగా పట్టణంలోకి చేరుతోంది. ఇళ్లల్లోకి నీరు పోవడం, సీసీ రోడ్లు, డ్రెయినేజీ కాల్వలు, మట్టి రోడ్లు కోతకు గురవడం లాంటి సంఘటనలతో భారీ నష్టం వాటిల్లుతోంది. భారీ వర్షాలు కురిసిన ప్రతిసారీ ప్రజా ప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు పట్టణంలో పర్యటించడం, స్థానిక నాయకులను, అధికారులను వివరాలు అడిగి తెలుసుకోవడంతోనే సరి పుచ్చుతున్నారనే విమర్శలు లేకపోలేదు. పట్టణంలో ఉన్న లతీఫ్‌ సాహెబ్‌ గుట్ట, కాపురాల గుట్టల చుట్టూ పెద్ద కాల్వలు నిర్మించి వరద నీరు చెరువులకు, కుంటలకు మళ్లించాలనే ప్రతిపాదనలు ఉన్నా అమలుకు నోచుకోవడం లేదు. 

2013లోనే తెరపైకి కాల్వల నిర్మాణం
2013 సెప్టెంబర్‌ నెలలో కురిసిన భారీ వర్షాలకు నీలగిరి పట్టణం దాదాపు నీట మునిగినంత పని అయింది. ద్విచక్ర వాహనాలు, కార్లు సైతం వరద ప్రవాహానికి కొట్టుకుపోయాయి. అప్పుడు పట్టణంలో ప్రభుత్వ ఆస్తులే దాదాపు రూ.20కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు మున్సిపల్‌ యంత్రాంగం అంచనా వేసింది. కాపురాల గుట్ట, లతీఫ్‌ సాహెబ్‌ గుట్టల చుట్టూ వరద కాల్వలు నిర్మించాలని అప్పటి కలెక్టర్‌కు, ప్రజా ప్రతినిధులకు స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రతిపాదించారు. తప్పనిసరిగా నిధులు మంజూరు చేయించి రెండేళ్ల కాలంలోనే కాల్వల నిర్మాణం చేపడుతామని అప్పట్లో హామీలు సైతం ఇచ్చారు. ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపుతున్నట్లు చెప్పారు.  ఆ తరువాత ఏమైందో కానీ నేటికీ దాని గురించి పట్టించున్న వారే లేరు.
 
మూడు నాలాలకు నిధులు మంజూరు 
రెండు గుట్టలనుంచి వర్షపు వరద నీటిని మళ్లించడానికి మూడు నాలాల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. త్వరలోనే టెక్నికల్‌ ప్రక్రియ పూర్తి చేసి టెండర్ల పిలవడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. లతీఫ్‌ సాహెబ్‌ గుట్ట నుంచి వీటీ కాలనీ మీదుగా బక్కతాయి కుంట వరకు రూ. 5 కోట్లతో, మోతికుంట నుంచి పాతబస్తీ చౌరస్తా వరకు రూ.6.30 కోట్లతో, కాపురాల గుట్టనుంచి గంధంవారిగూడెం చెరువు వరకు రూ. 6 కోట్లతో నాలాలు నిర్మించాలని నిర్ణయించగా నిధులు విడుదల అయ్యాయి. ఈ మూడు నాలాలు నిర్మించినా ఉపయోగం కొంత మేర మాత్రమే ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అదే గుట్టల చుట్టూ నాలా నిర్మించి ఈ నాలాల ద్వారా వరద నీటిని పంపిస్తే శాశ్వత పరిష్కారం లభించనుంది. 

గుట్టల చుట్టూ నాలాలు నిర్మిస్తే శాశ్వత పరిష్కారం 
పట్టణంలో ఉన్న రెండు గుట్టలనుంచి వరద నీటిని పంపించడానికి నాలాల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. తొందరలోనే టెక్నికల్‌ ప్రక్రియ పూర్తి చేసి టెండర్లు పిలుస్తాం. గుట్టల చుట్టూ నాలా నిర్మించి కొత్తగా నిర్మించే వాటి ద్వారా వరదను మళ్లిస్తే శాశ్వతంగా సమస్య తీరినట్లే. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాను.  – కె.వెంకటేశ్వర్లు, ప్రజారోగ్యశాఖ ఈఈ 

మరిన్ని వార్తలు