నిద్రలో కనేది కల.. సమాజాన్ని తట్టిలేపేది కళ

28 Jan, 2019 09:24 IST|Sakshi

ఆడపిల్లలపై వివక్షను రూపుమాపడమే ధ్యేయం

వారి బతుకు కోసం కుంచెను కదిపిన చిత్రకారుడు

‘సేవ్‌ గర్ల్‌ చైల్డ్‌’ పేరుతో కాన్వాస్‌పై సందేశాలు

హృదయాలను కదిలిస్తున్న మహేష్‌ చిత్ర రాజాలు

నిద్రలో కనేది కల. నిద్రాణమైన సమాజాన్ని తట్టిలేపేది కళ. సామాజిక చైతన్యమే దాని ప్రధాన ఉద్దేశం. కొంతమంది కళాకారులు తమ చిత్రాల్లో ప్రకృతికి పెద్దపీట వేస్తారు. కానీ ఆయన మాత్రం బాలికలపై సాగుతున్న వివక్షను రూపుమాపేందుకు తన కుంచెను ఎంచుకున్నారు. తన చిత్రాలతో సమాజానికి చక్కని సందేశాన్ని అందజేస్తున్నారు చిత్ర కళాకారుడు మహేష్‌అలియాస్‌ తుపాకుల మహేష్, రామాంజనేయరెడ్డి. తన కుంచె నుంచి జాలువారుతున్న ప్రతి చిత్రంలోనూ ‘సేవ్‌ గర్ల్‌ చైల్డ్‌’ నినాదాన్ని చేర్చి సమాజమనే కాన్వాస్‌పై అర్థవంతమైన సందేశాలను తీర్చిదిద్దుతున్నారు. తను గీసే ప్రతి చిత్రంలోనూ సేవ్‌గర్ల్‌ చైల్డ్‌ అనే లోగో తప్పక ఉండితీరుతుంది.ఈ చిత్రాలను చూసిన ప్రతిసారి ఆడపిల్లల కోసం మనం చేయాల్సింది ఎంతో ఉందని చెబుతుంటారు ప్రొద్దుటూరు చెందిన మహేష్‌. 

బంజారాహిల్స్‌ :చదువుతోనే ఆడపిల్లలు తమపై జరుగుతున్న వివక్షను తిప్పికొడతారనే అంశాన్ని చిత్రకారుడు మహేష్‌ గట్టిగా విశ్వసిస్తారు. ఈ తపనే ఆయనను చిత్రకళ వైపు మళ్లించాయి. సేవ్‌ గర్ల్‌ చైల్డ్‌ అనే నినాదంతో సమాజానికి సందేశాన్ని ఇస్తున్న ఆయన చిత్రాలు పలువురు ప్రముఖుల ప్రశంసలను అందుకుంటున్నాయి. ఇప్పటి వరకు ఆయన దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి, సంగీత విద్వాంసుడు హరిప్రసాద్‌ చౌరాసియా, సినీనటి కరీనాకపూర్, తమన్నా, బ్రహ్మానందం, గాయకులు ఎస్‌.జానకి, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సినీ నటులు విక్రమ్, కీర్తిసురేష్, ఐపీఎస్‌ అధికారిణి స్వాతి లక్రా, అంజనీకుమార్‌ తదితరుల చిత్రాలను వేసి సేవ్‌ గర్ల్‌ చైల్డ్‌పై ఉద్ధృత ప్రచారం నిర్వహించారు. కే. వలం సెలబ్రిటీలే కాకుండా స్ఫూర్తినిచ్చే మహిళలు శ్రమైక జీవనానికి ప్రతీకగా నిలిచే సామాన్యులకు సైతం తను ఎంతో కష్టపడి గీసిన విలువైన చిత్రాలను అందిస్తూ పెద్దా చిన్నా అనే తారతమ్యం లేకుండా ఈ ప్రచారంలో అందరినీ భాగస్వాములను చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఇప్పటికే పలువురు ప్రముఖులను కలిసి ఈ చిత్రాలను అందజేశారు.  

ఇల్లాలితోనే అంకురార్పణ..
మహేష్‌ భార్య ఇంటర్మీడియెట్‌ తర్వాత చదువు నిలిపివేశారు. తాను పెద్దగా చదువు లేకపోయినా ఆమెను చదివించాలన్న లక్ష్యంతో పీజీ పూర్తి చేయించారు. అనంతరం పోటీ పరీక్షలు రాయించి ఆమె తహసీల్దార్‌ అయ్యేలా ప్రోత్సహించారు. తన భార్యే తనకు స్ఫూర్తిగా నిలవడం ఆనందంగా ఉందంటారు మహేష్‌. ఆడపిల్లలు చదువుకుంటే సమాజం బాగుపడుతుందన్న ఉద్దేశంతో ఈ ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారాయన. తన భార్య ఆరేళ్ల క్రితం గెజిటెడ్‌ పోస్టు సాధించినప్పుడు ఆమెను కలవడానికి చాలా మంది ఇంటికివస్తుంటే ఎంతో ఆనందాన్ని అనుభవించారు. ఏదైనా సాధించాలంటే సంకల్పం ఉండాలని, దానికి స్త్రీ, పురుష బేధం లేదని చెప్పుకొచ్చారు. మార్పు కోసం తొలి అడుగు తన ఇంటి నుంచే మొదలైందంటారు మహేష్‌. ఇందులో తన మిత్రుల సహకారం మరువలేనిదని చెబుతుంటారు. పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రుల చిత్రాలను కూడా గీసి సందేశాన్ని ప్రచారం చేస్తున్నానని, సమాజానికి మంచి చేసే వ్యక్తుల గురించి తెలిస్తే 98669 13354ను సంప్రదించవచ్చని చిత్రకారుడు మహేష్‌ విజ్ఞప్తి చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు