మున్సి‘పోల్స్‌’ కసరత్తు వేగిరం

4 Dec, 2019 01:38 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మున్సిపల్‌ ఎన్నికల కసరత్తు వేగిరమైంది. ఎన్నికలు జరగనున్న 121 మున్సిపాలిటీలు, 10 మున్సిపల్‌ కార్పొరేషన్లలో వార్డులు/డివిజన్ల విభజన ప్రక్రియకు సంబంధించిన 14 రోజుల షెడ్యూల్‌ను ప్రకటిస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వార్డుల విభజన ప్రక్రియ చేపట్టడం ఇది రెండోసారి.

గతంలో కేవలం 7 రోజుల షెడ్యూల్‌ మాత్రమే ప్రకటించి హడావుడిగా ప్రక్రియను ప్రభుత్వం ముగించిందని, ప్రజల నుంచి అభ్యంతరాల స్వీకరణకు కేవలం ఒకేరోజు మాత్రమే కేటాయించిందని ఆరోపిస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించడంతో అప్పట్లో ఎన్నికల ప్రక్రియకు బ్రేక్‌ పడింది. హైకోర్టు తీర్పు ప్రకారం వార్డుల విభజనకు 14 రోజుల షెడ్యూల్‌ను తాజాగా పురపాలక శాఖ ప్రకటించింది. షెడ్యూల్‌ ప్రకారం మున్సిపాలిటీలు వార్డుల విభజనకు సంబంధించిన ముసాయిదా ప్రకటనను మంగళవారం ప్రకటించాయి.

హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 3 నుంచి 9 వరకు ప్రజలు, ప్రజా ప్రతినిధుల నుంచి అభ్యంతరాలు, సలహాలు, సూచనలు స్వీకరించనున్నారు. వీటిని పరిష్కరించి ఈ నెల 17న వార్డుల విభజనకు సంబంధించిన తుది ప్రకటనను ప్రభుత్వం జారీ చేయనుంది. వార్డుల క్రమసంఖ్య వరుసగా ఉత్తరం నుంచి ప్రారంభమై తూర్పు, దక్షిణం, పశ్చిమ దిశల వారీగా సాగేలా మున్సిపాలిటీల మ్యాపుల రూపకల్పనలోజాగ్రత్తలు తీసుకోవాలని కమిషనర్లను ప్రభుత్వం ఆదేశించింది. నిబంధనల ప్రకారం వార్డుల మధ్య జనాభా వ్యత్యాసం 10 శాతానికి మించి ఉండరాదని తెలిపింది. 

రిజర్వేషన్లకు కొత్త రోస్టర్‌ 
వార్డుల విభజన ప్రక్రియ ముగిసిన తర్వాత కొత్తగా ఏర్పడిన వార్డులు/డివిజన్ల వారీగా ఓటర్ల జాబితాను వెంటనే రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించనుంది. కొత్త వార్డులు/డివిజన్ల వారీగా ఎస్సీ, ఎస్టీ జనాభా గణనను చేపట్టనున్నారు. దీనికి దాదాపు 5 రోజుల సమయం పట్టనుందని పురపాలక శాఖ అధికారవర్గాలు తెలిపాయి. అన్ని మున్సిపాలిటీల్లోని ఎస్సీ, ఎస్టీల జనాభా దామాషా ప్రకారం మున్సిపాలిటీల వార్డు, చైర్‌పర్సన్‌ స్థానాలను కేటాయిస్తూ రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు.

మున్సిపల్‌ కార్పొరేషన్లలో సైతం ఇలానే ఎస్టీ, ఎస్సీ రిజర్వేషన్లను ఖరారు చేస్తారు. మున్సిపల్‌ ఎన్నికల్లో మొత్తం 50 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తుండగా, ఎస్సీ, ఎస్టీల కోటా పోగా మిగిలిన స్థానాలను బీసీలకు రిజర్వు చేయనున్నారు. వార్డు/డివిజన్‌ స్థానాలకు రిజర్వేషన్లను ప్రకటిస్తూ స్థానిక జిల్లా కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేయనున్నారు. చైర్‌పర్సన్, మేయర్‌ స్థానాల రిజర్వేషన్లను మాత్రం పురపాలికల వారీగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించనుంది. రిజర్వేషన్లను ప్రకటించిన వెంటనే ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేయనుంది.

ఈ ప్రక్రియలన్నీ సజావుగా జరిగితే జనవరిలో ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. కొత్త మున్సిపల్‌ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి సాధారణ మున్సిపల్‌ ఎన్నికలు కావడంతో కొత్త రోస్టర్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ (ఆర్‌ఓఆర్‌)ను అమలు చేయనున్నారు. ఇప్పటివరకు జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో అమలు చేసిన రోస్టర్‌ను ఈ ఎన్నికల్లో కొనసాగించరు. రోస్టర్‌ను ఒకటో పాయింట్‌ నుంచి ప్రారంభించనున్నారు. ఈ ఎన్నికల్లో ఖరారు చేసే రిజర్వేషన్లను మరో రెండు సాధారణ ఎన్నికల వరకు కొనసాగించనున్నారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా