రైతులకు వెంటనే కొత్త రుణాలు

24 Sep, 2014 00:17 IST|Sakshi
రైతులకు వెంటనే కొత్త రుణాలు

 హైదరాబాద్: రిజర్వ్ బ్యాంక్ ఆమోదం మేరకు రుణాలు రీ షెడ్యూల్ కానున్న 3 జిల్లాలతో సహా తెలంగాణ రాష్ర్టవ్యాప్తంగా రైతులందరికీ రుణ మాఫీని అమలు చేస్తున్నట్లు టీ సర్కారు స్పష్టం చేసింది. తొలివిడతగా విడుదల చేసిన 25 శాతం నిధులను అన్ని బ్యాంకులకూ వాటి రుణ వితరణ ఆధారంగా పంపిణీ చేయనున్నట్లు పేర్కొంది. కొత్తరుణాల మంజూరుకు బ్యాంకులు చర్యలు తీసుకుంటాయని వెల్లడించింది. తొలి విడతలో రూ. 4,250 కోట్ల విడుదలకు వ్యవసాయ శాఖ పరిపాలనాపరమైన ఆమో దం తెలపడంతో బుధవారం నిధులను రాష్ర్ట స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ)కి అందజేయనున్నట్లు  వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ మంగళవారం మీడియాకు వివరించారు.

అక్కడి నుంచి ఆయా బ్యాంకులకు సర్దుబాటు జరుగుతుందని మంత్రులు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం బ్యాంకర్లతో సమావేశం అనం తరం వారితో కలసి మంత్రులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ప్రభుత్వం ఒకేసారి భారీ మొత్తంలో నిధులు విడుదల చేసినందున, బ్యాంకర్లు కూడా ప్రస్తుతం చెల్లించిన 25 శాతం నిధులతోపాటు, అదనంగా మరో 30 నుంచి 35 శాతం మేర నిధులను కలిపి రైతులకు కొత్త రుణాలను ఇస్తారని తెలిపారు. దీంతో తక్షణమే రైతులకు రుణాలందుతాయన్నారు. మిగిలిన బకాయిల విషయంలో రైతులను ఇబ్బంది పెట్టొద్దని బ్యాంకర్లను కోరామని, అందుకు వారు అంగీకరించారని ఎస్‌బీహెచ్, ఎస్‌బీఐ, ఆంధ్రా బ్యాంకు, ఆప్కాబ్, దక్కన్ గ్రామీణ బ్యాంకుల ఉన్నతాధికారుల సమక్షంలో మంత్రులు వెల్లడించారు. గురువారం నుంచి బ్యాంకులకు రుణాల చెల్లింపులు ప్రారంభమవుతాయన్నారు. రైతులు వెంటనే బ్యాంకులకు వెళ్లి రుణాలను రెన్యువల్ చేసుకొని ప్రభుత్వంతో సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
 

 

మరిన్ని వార్తలు