యథేచ్ఛగా గుట్కా విక్రయాలు

24 Jun, 2014 04:49 IST|Sakshi
యథేచ్ఛగా గుట్కా విక్రయాలు

- లోపించిన అధికారుల నిఘా
- రెట్టింపు ధరలతో విక్రయం

 బాన్సువాడ : ప్రాణాంతకంగా మారిన గుట్కా, పాన్‌మసాల విక్రయాన్ని ప్రభుత్వం నిషేధించినప్పటికీ, గుట్టుచప్పుడుకాకుండా యథేచ్ఛగా గుట్కా విక్రయాలు సాగుతున్నాయి. గుట్కా నిర్ణీత ధరకు రెండింతలు పెంచి విక్రయిస్తున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవడంలో సంబంధిత అధికార యంత్రాంగం విఫలమవుతుండడంతో బ్లాక్ మార్కెట్ విస్తరించింది. జిల్లాలో గుట్కా, పాన్ మసాలా బ్లాక్ మార్కెటింగ్ నిత్యం రూ. 5 లక్షలకు పైగా అమ్మకాలు జరుగుతున్నాయి. పట్టించుకోవాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారు.

వాణి జ్య పన్నుల శాఖ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, పోలీసులు, విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు గుట్కా విక్రయాలను అరికట్టాల్సి ఉంది. అలాగే మున్సిపాలిటీల్లో మున్సిపల్ హెల్త్ అధికారులు దాడి చేయాలి. కానీ ఈ అధికారులు కన్నెత్తి చూడడం లేదు. గుట్కా హోల్‌సెల్ వ్యాపారుల నుంచి నెలవారీ మామూళ్లు అధికారులకు అందుతున్నాట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
 
గుట్కా, పాన్‌మసాలా లాంటి పొగాకు ఉత్పత్తులు క్యాన్సర్‌తోపాటు పలు రకాల రోగాలకు కారణమవుతున్నాయని భావించి ప్రభుత్వం గతేడాది జనవరి 15 నుంచి వీటి విక్రయాలను నిషేధించింది. అయితే ఉన్న గుట్కా స్టాకును విక్రయించుకొనే పేరుతో వ్యాపారులు అక్రమ అమ్మకాలు చేస్తున్నారు. గుట్కా, పాన్ మసాలాకు అలవాటుపడిన వారి బలహీనతలను ఆసరాగా చేసుకొని అసలు ధర కంటే రెండు, మూడు రేట్లు అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.

గుట్కా, పాన్ మసాలాలను హైదరాబాద్‌తోపాటు మహారాష్ట్రాలోని నాందేడ్, దెగ్లూర్, కర్ణాటకలోని ఔరాద్ తదితర ప్రాంతాల నుంచి స్థానికంగా కొంత మంది హోల్‌సేల్ వ్యాపారులు దిగుమతి చేసుకుంటున్నారు. వీరి నుంచి జిల్లాలోని మండల కేంద్రాలు, గ్రామాల్లోని పాన్ షాపులకు సరఫరా అవుతోంది. బాన్సువాడ, బోధన్ పట్టణాల్లో నిలువ చేస్తూ పరిసర మండలాలకు ఆటోలు, మోటర్ సైకిళ్లపై అతి రహస్యంగా చేరవేస్తున్నారు. రాత్రి వేళ నల్ల ప్లాస్టిక్ కవర్లలో గుట్కాలు వేసుకొని వారికి చేరవేస్తారు.

పాన్ షాపుల్లో గుట్కాలను బయటవారి కంట పడనీయకుండా రహస్యంగా విక్రయిస్తున్నారు. నిజామాబాద్ నగరంలోని అహ్మదీ బజార్‌లో రహస్యంగా హోల్ సెల్ విక్రయాలు సాగుతున్నట్లు సమాచారం. అక్రమంగా దిగుమతి చేసుకున్న నిషేధిత కంపెనీల గుట్కాలు, పాన్‌మసాలా ప్యాకెట్లను అసలు ధరకన్నా రెండు మూడు రేట్లు అధిక ధరకు విక్రయిస్తున్నారు. గతంలో రూ. 1.50 ధర ఉన్న గుట్కా ప్రస్తుతం రూ. 5, రూ. 3 ఉన్న గుట్కా ప్యాకెట్‌ను ప్రస్తుతం రూ. 8, రూ. 4 విలువ గల గుట్కా రూ. 10, రూ. 10 ఉండే రకం రూ. 20కు విక్రయిస్తున్నారు.

కాగా గుట్కాకు అలవాటు పడిన వారు ధర ఎక్కువైనా కొనుగోలు చేస్తున్నారు. దీన్ని అసరాగా చేసుకొని హోల్‌సెల్ వ్యాపారులు, పాన్‌షాపుల యజమానులు యథేచ్ఛగా దోచుకొంటున్నారు. గుట్కా విక్రయాలు విచ్చలవిడిగా సాగుతున్నా, సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా యువత గుట్కా వ్యసనానికి అలవాటు పడి తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. వాటిలో ఉండే పలు రసాయనాల ప్రభావంతో క్యాన్సర్‌తోపాటు ఇతర ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గుట్కా విక్రయాలను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు