సీఎం ‘ఆఫర్‌’ను అంగీకరించండి

4 Nov, 2019 05:32 IST|Sakshi

మిమ్మల్ని మీరు చంపుకోవద్దు ఆర్టీసీ కార్మికులకు అసదుద్దీన్‌ విజ్ఞప్తి

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సీఎం కేసీఆర్‌ ప్రతిపాదించిన ‘ఆఫర్‌’ను అంగీకరించాలని ఆల్‌ ఇండియా మజ్లిస్‌–ఏ–ఇత్తెహాదుల్‌–ముస్లిమీన్‌ (ఏఐఎంఐఎం) అధినేత, హైదరాబాద్‌ పార్లమెంట్‌ సభ్యుడు అసదుద్దీన్‌ ఒవైసీ పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన మహారాష్ట్ర, బిహార్‌ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ సాధించిన విజయాల నేపథ్యంలో హైదరాబాద్‌ దారుస్సలాం మైదానంలో శనివారం రాత్రి నిర్వహించిన విజయోత్సవ సభలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో నిరవధిక సమ్మెకు దిగిన ఆర్టీసీ కార్మికుల బాధ అర్థం చేసుకోదగిందేనని, అయితే బయట పేదరికం, ధరాఘాతం తీవ్రంగా ఉందని చెప్పారు.

వీటిని దృష్టిలో పెట్టుకునైనా సీఎం కేసీఆర్‌ ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకుని వాటిని అంగీకరించాలని కార్మికులకు విజ్ఞప్తి చేశారు. సమ్మెలో కొందరు కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడటం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మిమ్మల్ని మీరు చంపుకోవద్దని కోరారు. సీఎం కేసీఆర్‌తో చర్చలకు కూర్చోవాలని, కాంగ్రెస్, బీజేపీ మోసపూ రిత వలలో పడి జీవితాలను నాశనం చేసుకో వద్దని సూచించారు. కార్మికులందరికి తెలంగాణపై హక్కు ఉందని, చర్చలతో సమస్యను పరిష్కరించు కోవచ్చన్నారు. త్వరలో ప్రతిష్ఠంభన వీడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఫిఫ్టీ..ఫిఫ్టీ ఏంటి? 
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ఫిఫ్టీ–ఫిఫ్టీ ఫార్ములాను అసదుద్దీన్‌ తప్పుపట్టారు. ఈ ఫార్ములాపై ఇరు పార్టీల మధ్య నెలకొన్న వివాదాన్ని ఎద్దేవా చేశారు. మార్కెట్‌లో ఫిఫ్టీ–ఫిఫ్టీ పేరుతో కొత్త బిస్కట్‌ వచ్చిందా అని ప్రశ్నిం చారు. మహారాష్ట్ర ప్రజలకు ఏదైనా చేయాలనే తపన బీజేపీ, శివసేనకు లేదని, ఇరు పార్టీలు ఫిఫ్టీ–ఫిఫ్టీ గురించి మాట్లాడుతున్నాయన్నారు. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ లేదా శివసేనకు తమ పార్టీ మద్దతు ఇవ్వబోదని తెలిపారు. శివసేనకు ఏం చేయాలో పాలుపోవడం లేదని, ఉద్ధవ్‌ ఠాక్రేకు ప్రధాని మోదీ భయం పట్టుకున్నట్టు కనిపిస్తోందన్నారు. ఈ సభలో మహారాష్ట్ర, బిహార్‌ నుంచి విజయం సాధించిన పార్టీ ఎమ్మెల్యేలను ఘనంగా సన్మానించారు.

జెడ్‌ అక్షరం తొలగించొద్దు 
ఆర్టీసీని ప్రైవేటీకరించినప్పటికీ బస్సుల నంబర్‌ ప్లేట్లలోని ‘జెడ్‌’అక్షరం తొలగించవద్దని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌కు ఓవైసీ అభ్యర్థించారు. హైదరాబాద్‌ చివరి నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ తల్లి జెహ్రా పేరు నుంచి ఆర్టీసీ నంబర్‌ ప్లేట్లలో జెడ్‌ అనే అక్షరం వచ్చిందని గుర్తు చేశారు. ఇది హైదరాబాద్‌ చరిత్రలో ఒక భాగమన్నారు. బస్సులో జెడ్‌ అక్షరాన్ని కొనసాగించా లని విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు