వినండి.. మాట్లాడండి

5 Nov, 2019 10:35 IST|Sakshi

మూగ..చెవిటి చిన్నారులకు ప్రత్యేక శిక్షణ

కాంక్లియర్‌ సర్జరీలకు సైతం సాయం

బధిరుల సేవలో ఆశ్రయ్‌–ఆకృతి సంస్థ

అమ్మా అని నోరారా పిలిస్తే..ఆ తల్లికి చెప్పలేని సంతోషం. నాన్నా అంటూ పిలిస్తే ఆ తండ్రికి ఎనలేని ఆనందం. ఈ పిలుపు కోసమే తల్లిదండ్రులు తపనపడుతుంటారు. అయితే పిల్లలుండీ మాట్లాడలేని..వినలేని స్థితిలో ఉంటే వారి వేదన వర్ణణాతీతం. అలాంటి మూగ..చెవిటి పిల్లల్ని చేరదీసి...వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి  ‘అమ్మా..నాన్నా’ అని పిలిచేలా చేస్తూ, వారికి విద్యను అందిస్తూ, ఉన్నతంగా తీర్చుదిద్దుతోంది ఆశ్రయ్‌..ఆకృతి సంస్థ. పుట్టుకతోనే మాట్లాడలేని, వినలేని చిన్నారులను చేరదీసి వారికి విద్యా బోధన అందిస్తూ, పెదవులుదాటి మాటలు బయటకు రాని ఎందరో పిల్లలకు మాటలు వచ్చేలా చేస్తూ వారిలో మానసిక స్థైర్యాన్ని పెంపొందిస్తోంది. కుల మతాలకతీతంగా ఎలాంటి ఫీజులు లేకుండా పూర్తి ఉచిత సేవలు అందిస్తోంది.  – శ్రీనగర్‌కాలనీ  

శ్రీనగర్‌కాలనీలో 1996లో నలుగురు పిల్లలతో సంస్థ డైరెక్టర్‌ డీపీకే బాబు వ్యవస్థాపకుడిగా స్థాపించిన ఆశ్రయ్‌..ఆకృతి ఫౌండేషన్‌ సంస్థ ఇప్పుడు సుమారు 650 మంది పిల్లలు, ఐదు బ్రాంచ్‌లతో బధిరులకు ఓ వరంలా మారింది. నిపుణులైన టీచర్లతో శిక్షణనిస్తూ పుట్టు మూగైనా ఎందరో బుడిబుడి చిన్నారులు మాట్లాడేలా చేస్తున్నారు. వారి తల్లులను అమ్మా అని పిలిచేలా తీర్చిదిద్దుతున్నారు. సాధారణ చిన్నారులతో పోల్చుకుంటే చెవిటి, మూగ చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించడం కొంచెం కష్టంతో కూడుకున్న పని. అయితే ఇక్కడ నైపుణ్యంతో పాటు సుశిక్షుతులైన టీచర్లను నియమించి చిన్నారులకు అర్ధం చేసుకునేందుకు వీలుగా ‘ఓరల్‌ మెథడ్‌’ ద్వారా..బొమ్మల ద్వారా విద్యా బోధన చేపడుతున్నారు. 

సేవా బాటలో...
చిన్నారులకు ఉచిత విద్యను అందిస్తూనే సేవా కార్యక్రమాల్లో ఆశ్రయ్‌–ఆకృతి సంస్థ ముందుంటోంది. లక్షల్లో ఖర్చయ్యే కాంక్లియర్‌ సర్జరీలను ఉచితంగా చేయిస్తుంది. నగరంలోని పలు బ్రాంచ్‌లలో చెవి క్లినిక్‌లను ఏర్పాటుచేసి ఉచిత పరీక్షలను నిర్వహిస్తున్నారు. మొబైల్‌ హియరింగ్‌ క్లినిక్‌ పేరిట ఉచిత వినికిడి పరీక్షలను నగరంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో, వృద్ధాశ్రమాలు, ప్రభుత్వ పాఠశాలలు, బస్తీల్లో విరివిగా నిర్వహిస్తోంది. వారికిఅవసరమైన మందులను అందిస్తూ ఉచితంగా వినికిడి యంత్రాలను సైతం అందిస్తున్నారు. వినికిడి లోపాన్ని దరిచేరనివ్వకుండా చేయడమే తమ లక్ష్యమని డీపీకే బాబు చెబుతున్నారు.   

బధిర విద్యార్థులకుఉచిత యానిమేషన్‌ శిక్షణ
పదవ తరగతి దాకా చదువుకొని ఏమి చేయాలో అర్ధం కాక ఉన్న బధిరులను చేరదీసి వారికి ఉచితంగా యానిమేషన్‌లో శిక్షణ ఇస్తున్నారు. అనంతరం ఉపాధి కూడా కల్పిస్తున్నారు. ఇప్పటికే వందలాది మంది బధిరులు శిక్షణ తీసుకుని యానిమేషన్‌న్‌ సంస్థల్లో సెలెక్ట్‌ అయి ఉద్యోగాలు చేస్తున్నారు.

కరాటే, కంప్యూటర్, సాంస్కృతికం
చిన్నారులకు కేవలం విద్యాబుద్ధులు నేర్పించడమే కాకుండా వారిలో మానసిక స్థైర్యాన్ని పెంపొందేలా కరాటే లాంటి మార్షల్‌ ఆర్ట్స్, అడ్వెంచర్స్‌పైన శిక్షణ ఇస్తున్నారు. అంతేకాకుండా కంప్యూటర్, యానిమేషన్, మల్టీమీడియాపై అవగాహన కల్పిస్తూ కంప్యూటర్‌పై ఆసక్తి పెంచే విధంగా ప్రోత్సహిస్తున్నారు. పిల్లలకు పలు సాంస్కృతిక పోటీలు ఏర్పాటు చేయిస్తూ వారిలో మనో ధైర్యాన్ని నింపుతున్నారు. అంతే కాకుండా దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి హాస్టల్‌ వసతి కూడా కల్పిస్తున్నారు. పదవ తరగతి పరీక్షల్లో నూటికి నూరు శాతం ఉర్తీర్ణత సాధించడం ఇక్కడ విశేషం. అంతేకాకుండా మార్షల్‌ ఆర్ట్స్‌ పోటీల్లో జాతీయ స్థాయిలో పాఠశాలకు చెందిన విద్యార్థులు ఎన్నో పతకాలు సాధించారు. బధిరులైనా ఏ రంగంలోనైనా మాకు మేమే సాటి అని నిరూపిస్తున్నారు.

పుట్టిన చిన్నారులకు వినికిడి పరీక్షలు
పుట్టిన వెంటనే నెలల చిన్నారులకు వినికిడి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉచితంగా బేరా టెస్ట్, ఆడియోలాజికల్‌ ఎవాల్యుయేషన్‌ టెస్ట్‌లను చేస్తున్నారు. చిన్నారులకు 90 శాతం వినికిడి లోపిస్తే కాంక్లియర్‌ ఇంప్లాంటేషన్‌ సర్జరీని సైతం ఉచితంగా నిర్వహిస్తున్నారు. సుమారు రూ.12 లక్షలు ఖర్చయ్యే ఈ సర్జరీని సైతం దాతల సహాయంతో విజయవంతంగా చేస్తున్నారు.

వినికిడి సమస్యే ఉండొద్దు..
బధిర విద్యార్థుల అభ్యన్నతితోపాటు ప్రతి తల్లి అమ్మ అని పిలిపించుకునే భాగ్యానికి నోచుకోవాలనేదే మా ధ్యేయం. ఆశ్రయ్‌–ఆకృతి సంస్థలో శిక్షణ పొందుతున్న చిన్నారులకు అంతా ఉచితమే. ఎంఎన్‌సీ కంపెనీల సోషల్‌ రెస్పాన్సిబిలిటీ, దాతల సహాయంతో సంస్థను విజయవంతంగా నడుపుతున్నాం. చెవిటి సమస్య అనేదే లేకుండా చేయాలని మా క్లినిక్‌లను విస్తృతం చేశాం. బధిర విద్యార్థులు సాధారణ చిన్నారులతో కలిసి మాట్లాడేలా తీర్చిదిద్దేలా టీచర్లు తమవంతు కృషి చేస్తున్నారు. వినికిడి లోపం లేకుండా చేయడం, అవగాహన తీసుకురావడమే మా లక్ష్యం.– డీపీకే బాబు, ఆశ్రయ్‌–ఆకృతి, డైరెక్టర్‌

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు