ఆర్టీసీ సమ్మెను మరింత ఉధృతం చేస్తాం

24 Oct, 2019 18:40 IST|Sakshi

సాక్షి, మహబూబ్‌నగర్‌ : ‘ఆర్టీసీ సమ్మెకు ముగింపు లేదు.. ఆర్టీసీయే ముగుస్తుంది’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలకు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి గట్టి కౌంటర్‌ ఇచ్చారు. ఎవరికి ముగింపు పలుకుతారో ప్రజలే నిర్ణయిస్తారని వ్యాఖ్యానించారు. ఆర్టీసీ కార్మికుల మనోభావాలు దెబ్బతినేలా కేసీఆర్ వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. సమ్మెలో భాగంగా మహబూబ్‌నగర్‌లో ఆర్టీసీ మహిళా కార్మికులు చేపట్టిన నిరాహార దీక్షా శిబిరాన్ని గురువారం అశ్వత్థామరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..  తెలంగాణ ప్రగతి రథచక్రాలు.. ప్రగతి భవన్‌ను తాకకముందే సమస్యలు పరిష్కంచాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఆర్టీసీ సమ్మెను మరింత ఉధృతం చేస్తామని, కార్మికులు ఎవరు ఆందోళన చెందొద్దన్నారు. ఆర్టీసీ సమ్మెకు ప్రగతి భవన్‌లోనే పరిష్కారం ఉందన్నారు.  పేద రాష్ట్రం ఏపీలో కార్మికులను ప్రభుత్వం విలీనం చేస్తే, ధనిక రాష్ట్రంలో ఎందుకు వీలినం చేయారని ప్రశ్నించారు. సూర్యచంద్రులు ఉన్నంత కాలం ఆర్టీసీ ఉంటుందని వ్యాఖ్యానించారు.

>
మరిన్ని వార్తలు