స్టెంట్‌ కేరాఫ్‌ సిటీ

3 Oct, 2018 01:32 IST|Sakshi

మెడికల్‌ డివైజెస్‌ పార్కులో రూ.250 కోట్లతో భారీ పరిశ్రమ

 ముందుకొచ్చిన ‘ఎస్‌ఎంటీ’.. వేల మందికి ఉపాధి

పెట్టుబడులకు ఆకర్షణీయ కేంద్రంగా హైదరాబాద్‌: కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌ : ఆసియాలోనే అతిపెద్ద స్టెంట్ల తయారీ పరిశ్రమ హైదరాబాద్‌ నగరంలో ఏర్పాటు కానుంది. నగర శివార్లలోని సుల్తాన్‌పూర్‌ మెడికల్‌ డివైజెస్‌ పార్కులో రూ.250 కోట్ల భారీ పెట్టుబడితో స్టెంట్ల తయారీ పరిశ్రమను నెలకొల్పుతున్నట్లు సహజానంద మెడికల్‌ టెక్నాలజీస్‌ (ఎస్‌ఎంటీ) ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ ప్రకటించింది. హృదయ సంబంధిత రోగాలకు జరిపే శస్త్రచికిత్సల్లో వినియోగించే పరికరాల (మినిమల్లీ ఇన్వేసివ్‌ లైఫ్‌ సేవింగ్‌ మెడికల్‌ డివైజెస్‌)ను తయారు చేసే పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ భార్గవ్‌ కటడియా మంగళవారం ఇక్కడ పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు, ఆ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్‌లతో సమావేశమై ఈ మేరకు ప్రతిపాదనలు చేశారు.

ఈ పరిశ్రమ ఏర్పాటుతో ప్రత్యక్షంగా 2,200 మందికి, పరోక్షంగా వందల మందికి ఉపాధి లభించనుంది. మూడు దశల్లో పరిశ్రమ స్థాపనకు పెట్టుబడి పెట్టనుంది. ఏటా ఈ పరిశ్రమ నుంచి 12.5 లక్షల స్టెంట్లు, 20 లక్షల బెలూన్‌ కాథెటర్స్‌ ఉత్పత్తి కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, సత్వర అనుమతులు, నగరంలో మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరుల లభ్యత తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించినట్లు కంపెనీ ఎండీ భార్గవ్‌ కటడియా పేర్కొన్నారు. ప్రస్తుతం సూరత్‌ కేంద్రంగా తమ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో వైద్య పరికరాల ఉత్పత్తి రంగంలో రానున్న రోజుల్లో తెలంగాణను అగ్రస్థానంలో నిలిపేందుకు తమ వంతు సహకారాన్ని అందిస్తామని చెప్పారు. పరిశ్రమలు, పెట్టుబడులను రాబట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను అభినందించారు. 

భవిష్యత్‌లో వైద్య పరికరాల ఉత్పత్తిలోనూ అగ్రస్థానం: కేటీఆర్‌ 
ప్రపంచ స్థాయి ప్రమాణాలతో వైద్య పరికరాల ఉత్పత్తి రంగంలో భారీ పరిశ్రమ రాష్ట్రానికి రావడం పట్ల కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. ఔషధ రంగంలో ఇప్పటికే హైదరాబాద్‌ అగ్రస్థానంలో ఉందని, భవిష్యత్‌లో వైద్య పరికరాల ఉత్పత్తిలో సైతం అగ్రగ్రామిగా నిలుస్తుందని ఆకాంక్షించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వైద్య పరికరాల తయారీ పరిశ్రమ రావడంతో భవిష్యత్‌లో ఈ రంగంలో పెట్టుబడులకు నగరం ఆకర్షణీయ కేంద్రంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.  
 

మరిన్ని వార్తలు