గోల్కొండలో నల్ల పిల్లి కలకలం..

15 May, 2020 07:06 IST|Sakshi

గోల్కొండ/బహదూర్‌పురా: గోల్కొండలో అడవిపిల్లి (ప్లామ్‌ సివెంట్‌) కలకలం సృష్టించింది. అయితే దీనిని మొదట స్థానికులు నల్ల చిరుత అనుకుని తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సుమారు 15 గంటల పాటు ఇళ్లపై తిరిగిన ఈ అడవి జాతి పిల్లిని  అధికారులు ఎట్టకేలకు పట్టుకున్నారు. గోల్కొండ నూరాని మసీదు పై బుధవారం రాత్రి చిరుతను పోలిఉన్న ఓ జంతువు కనిపించింది. అనంతరం అది మసీదు పొరుగున ఉన్న ఇళ్లపై నుంచి దూకు తూ కలకలం సృష్టించింది. ఇది చిరుతను పోలి ఉండడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురై ఇళ్ల తలుపులు, కిటికీలు మూసు కున్నారు.

మసీదు నిర్వహణ కమిటీ అధ్యక్షుడు మోసిన్‌ బాకుల్‌కా ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు. బుధవారం రాత్రి అక్కడికి చేరుకున్న పోలీసులు అటవీశాఖ, జూ అధికారులకు సమాచారం ఇచ్చారు. సుమారు 3 గంటల పాటు ఇళ్లపై తిరుగుతూ అది పట్టుబడకుండా తప్పించుకుంది. గురువారం ఉదయం ఎట్టకేలకు దానిని పట్టుకున్నారు. ఇది చిరుత కాదని, అడవిలో సంచరించే పిల్లి అని తెలిపారు. ఇది గోల్కొండ కోట ప్రహరీ, దానిని ఆనుకుని ఉన్న కందకాలు, చెట్లలో నుంచి జనావాసాలలోకి వచ్చి ఉంటుందని ఇన్‌స్పెక్టర్‌ కె.చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. పిల్లి రకాల్లోన్ని మరణాంగి జాతికి చెందినదని జూ వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ సయ్యద్‌ అసదుల్లా చెప్పారు.  ప్రస్తుతం ఇది జూలో సురక్షితంగా ఉందన్నారు.
 

మరిన్ని వార్తలు